7, మే 2018, సోమవారం

తెనుగు షట్కము

2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వ్రాసినవి ..!

తెనుగు షట్కము
********
ఆ.వె.
తెనుగు వర్ణమనిన తెల్లని ముత్యము/
తెనుగు పదము చూడ తేజరిల్లు/
తెనుగు భాష యదియె తేనె లొలుకుచుండు/
తెనుగు మాటలాడు తెలుగు బాల!         1

ఆ.వె.
నన్నయాదికవులు నైక భేదము తోడ
పద్యములను కూర్చి భారతమును
చెప్పినారు తెలుగు నొప్పునట్లుగ గాన
తెనుగు మాటలాడు తెలుగు బాల!          2

ఆ.వె.
భాగవతము సహజ పాండితి పోతన్న
తెలిసి తేటపరచి తెలుగు లోన
కవిత లల్లి పొందె కైవల్య పదమును
తెనుగు మాటలాడు తెలుగు బాల!         3

ఆ. వె.
భక్తి భావ యుతము ముక్తిసాధకమును
రామకథ తెనుగున వ్రాసి వ్రాసి
మాన్యులైరి కవులు ధన్యత మనకిచ్చి,
తెనుగు మాటలాడు తెలుగు బాల!           4

ఆ.వె.
దేశభాషలందు తెలుగు లెస్సయటంచు/
తేనెలూరచెప్పి తెలుగు కృతిని/
ఘనతనొందినాడు కన్నడరాయడు/
తెనుగు మాటలాడు తెలుగు బాల!         5

ఆ.వె.
అనగ తెనుగు మాట యదియె తేనెలొలుకు/
వినగ తెనుగు భాష వీణ పలుకు/
కనగ తెనుగు వ్రాత మణిముత్యముల దండ/
తెనుగు మాటలాడు తెలుగు బాల!         6

********
- రాధేశ్యామ్ రుద్రావఝల

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 - వికీపీడియా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు