తెలుగు బాల శతకము



తెలుగు బాల శతకము

పద్యములను జెప్ప పాండిత్యమదిలేదు/
పద్య విద్య యందు భక్తితప్ప/
వెన్నుతట్టు గురుల దన్నుతోడను నేను
పలుక సాహసింతు తెలుగుబాల!                    

జయపరాజయముల జగతిని యొకరీతి
నెంచి సాగుమెప్పు డెలమి మీర 
లక్ష్య సాధకుల నిరతమగు నేకాగ్ర
తే బలమ నెరింగి తెలుగుబాల!                        2

సిరియు, కాలము నర చేతనుండెడివేళ
పట్టియుంచకున్న గట్టిగాను/
పిడికిటనిసుకవలె వడిని జారుచుపోవు/
తెలియకుండ నీకు తెలుగుబాల!                    3

సత్ప్రవర్తనంబు సహజమౌ కాంతిగ/
శీలవంతుడొప్పు జ్వాలవోలె/
శీలమదియె నీకు శ్రీరామ రక్షయౌ/
మెలగు జ్ఞప్తి కలిగి తెలుగు బాల..!                     4

సత్యమెరిగి పలుకు సత్తెకాలపు వాడు/
కల్లలాడు వాడు కర్మయోగి/
కలియుగమున జనులు కపటులై ధర్మంపు
తీరు మార్చిరమ్మ తెలుగు బాల!                        5

మాటలమ్ముకొనుట మంత్రమిపుడు కాని,/
మాట తోనె కలుగు మనుగడయది/
నిక్కమైన మాట నిలుచునీ జగతిని/
తీరు తెలిసి పలుకు తెలుగు బాల!                     6

సత్య భాషణమ్ము నిత్యవ్రతము చేసి/
సత్యపథమునందు శాంతి బడయ/
సత్యమె నిను గాచు సతతము నిడుములో/
ధీరతదియె బలిమి తెలుగుబాల!                       7

మనిషి మనిషిగాడు మానవత్వములేక
మనసు తెలుసుకొనుము మమత గలిగి
మమత కల్గుటేను మానవత యనగ
తెలిసి బ్రతుక వమ్మ తెలుగు బాల!                    8

పెద్దమాటలాడ పెద్దలు కాబోరు
పెద్దతనమదన్న పెద్దమనసు
చిన్న విషయమైన చింతింపగా వలె
తెలిసి నడచుకొనుము తెలుగు బాల!               9

మాట యుండవలెను మల్లె పూదండగా
సత్య మలర దాని సౌరభముగ
సత్యపథము జగతి నిత్యమై నిలచును
తెలిసి మసలుకొనుము తెలుగుబాల!              10

మనన జేయ విద్య మనమునకది పుష్టి/
కలుగు క్రీడలందు కండపుష్టి/
రెండు  కలగలుపుచు నిండగు వ్యక్తివై/
తెరువు నందికొనుము తెలుగు బాల!               11

తండ్రి కొకదినమ్ము తల్లికొకదినము/
ఇరువురికిని కలిపి మరొక దినము/
తల్లిలేక యతడు తండ్రియెట్లౌను రా/
కలిపి గౌరవించు తెలుగు బాల!                       12

కామము/ఆశ:
ఆశ యుండవచ్చు నవనిలో నరునకు/
తనకు వలయు వరకు తప్పులేదు!
అవసరమును మించి యాశించ కుండగ
తృప్తి కలిగి యుండు తెలుగు బాల..!             13

క్రోధము:
క్రోధమదియెనిప్పు కుంపటి వంటిదౌ
కారుచిచ్చు వోలె కాల్చు నెపుడు/
క్రోధమతికి జగతి కూరిమి కరవు, క్రో
ధితుల దూరముంచు తెలుగు బాల!             14

లోభము:
లుబ్ధుడనగ జగతి లోగల యపకీర్తి
మాపి పొందుటెట్లు మంచిపేరు?
ప్రోగు చేయ నెపుడు పుణ్యము లోలతన్
తెరువు గాను బ్రతుక తెలుగుబాల..!                15

మోహము:
మోహమదియె పాశ మాహాయన తగులు
త్రెంచవలెను గాని పెంచవలదు
లంపటములు పెరుగు కంపవలెను గాన
దృష్టి తప్పనీకు తెలుగు బాల!                        16

మదము:
విద్య, యౌవనమ్ము, ఉద్యోగము మగువ,
ధనము, కులము రూపు ధాన్యముల నె
యాశ్రయించి తనరు నష్ట మదములవి
దృష్టి కలిగియుండు తెలుగుబాల!                17

మత్సరము:
మత్సరమ్ము కలిగి మహిలోన విద్యలో/
వృద్ధినొంద గలవు వేది వగుచు/
ఇతరములను కలుగ నిడుముల పాలౌదు/
తెలియవలెను నీకు తెలుగు బాల!                18

అంతఃశత్రువులు:
ఆరు "లోనిశత్రు" లన్నిటిని క్రమముగా/
నిగ్రహించ వలెను నిష్ఠ తోడ/
నియతి యదియె రక్ష నిలువగ లోవ్యక్తి
తెలియుమిదియె నిజము తెలుగు బాల!         19

బానిసతనమదియె భరియింపరానిదై/
త్రెంచుకొన గరుడుడు తెచ్చె సుధను/
తలను గొట్టు భావ దాస్యము సహియించు/
తెరువు వలదు మనకు తెలుగుబాల!              20

తేనె నవ్వులందు తీయందనమువోలె/
చిన్నిపాపలందు చిందులేయు/
పసిమనసులయందు వసివాడకుండగ/
దేవదేవుడుండు తెలుగు బాల!                     21

ఇన్స్ట గ్రామునందు నికిలించెదరు గాని/
యెదుట నిలచినంత నెవరికెవరు/
సోకు చూడు మిదియె సోషలు నెట్వర్కు
తెగులు పట్టనీకు తెలుగు బాల!                      22

మనసు నిచ్చె బ్రహ్మ మనుజుని కొకనికె/
యున్నతునిగ నెంచి యుర్వియందు/
నహమును చొరనిచ్చి యతడెయౌ పతనమ్ము/
తెలిసికొనుము నిజము తెలుగు బాల!            23

విడువబడ్డవాడు వేదాంతము పలుకు/
మంది నుండ పలుకు మదము తోడ/
విడువ బంధములను పెదవైన కదుపడు/
పలుకు మర్మమిదియె తెలుగు బాల!             24

తెనుగు వర్ణమనిన తెల్లని ముత్యము/
తెనుగు పదము చూడ తేజరిల్లు/
తెనుగు భాష యదియె తేనె లొలుకుచుండు/
తెనుగు మాటలాడు తెలుగు బాల!                25

నన్నయాదికవులు నైక భేదము తోడ
పద్యములను కూర్చి భారతమును
చెప్పినారు తెలుగు నొప్పునట్లుగ గాన
తెనుగు మాటలాడు తెలుగు బాల!                26

భాగవతము సహజ పాండితి పోతన్న
తెలిసి తేటపరచి తెలుగు లోన
కవిత లల్లి పొందె కైవల్య పదమును
తెనుగు మాటలాడు తెలుగు బాల!                 27

భక్తి భావ యుతము ముక్తిసాధకమును
రామకథ తెనుగున వ్రాసి వ్రాసి
మాన్యులైరి కవులు ధన్యత మనకిచ్చి,
తెనుగు మాటలాడు తెలుగు బాల!                28

దేశభాషలందు తెలుగు లెస్సయటంచు/
తేనెలూరచెప్పి తెలుగు కృతిని/
ఘనతనొందినాడు కన్నడరాయడు/
తెనుగు మాటలాడు తెలుగు బాల!                29

అనగ తెనుగు మాట యదియె తేనెలొలుకు/
వినగ తెనుగు భాష వీణ పలుకు/
కనగ తెనుగు వ్రాత మణిముత్యముల దండ/
తెనుగు మాటలాడు తెలుగు బాల!                30

ఆకలైన వాని కరవీసె పసిడేల
పట్టెడన్నమిడుము పొట్టనిండ!
అడుగువాని కున్న యవసరమేమదో
తెలిసి యర్థి కిమ్ము తెలుగు బాల..!                31

స్తన్యమిచ్చి పెంచు, సైదోడుగనునిల్చు/
మనసుసేదదీర్చు, మమత పంచు/
తల్లి, సోదరి, సతి, తనయయౌ నానారి/
కిలను లేరు సాటి తెలుగు బాల!                     32

కోపమదె ప్రథమ శత్రువు/
కోపము గుండెలను కాల్చు కుంపటి వలెనే/
కోపితుల మెచ్చరెవ్వరు/
కోపము దరిచేరనీయకు తెలుగు బాలా!        33

విద్యయె శాశ్వతమిత్రుడు/
విద్యను సేవించుచుండ విజ్ఞానుండౌ/
విద్యకు సాటేది జగతి/
విద్యనువినయమున నేర్వవె!తెలుగు బాలా!   34

కష్టమందు నిన్ను కాచెడి వారలు/
నీకు హితులుసుమ్ము నిజముగాను/
సన్నిహితులలోన సన్మిత్రు లెవ్వరో/
తెలిసి మసలుకొనుము తెలుగు బాల!         35

అవసరమును మించి యాధారపడనేల?
రోయబడుచు జనుల లోకువగుచు!
మించి దీని నాత్మ వంచనిలను లేదు/
తెలియుమాత్మ బోధ తెలుగు బాల!          36

ఆస్తులెన్ని యున్న నాప్తులు  లేనిచో/
అడవిగాచు వెన్నెలౌను కలిమి/
ఆప్తులున్నవారి కాస్తుల పనిలేదు/
కలుగ భాగ్యమదియె తెలుగు బాల!         37

ముతక బట్టతోడ ముక్కును తుడవగ/
నొరిసిపోవు గాని తెరిపి రాదు/
పోల్చి చూడ గాను మూర్ఖుని పని తీరు/
తేటతెల్లమౌను తెలుగు బాల!                 38

నవ్వు మోము తోడ నలువుర మెప్పింప
నవ్వు నిన్ను గాచు నలుదిశలను
నీవు నవ్వకున్న నీదె లోపమనుచు
తెలిసి నవ్వు కొనుము తెలుగు బాల!         39

అవసరమును బట్టి యవకాశమును బట్టి
మంచి చెడులరూపు మారు నిలను
గ్రుడ్డి గాను బ్రతికి చెడ్డవానిని చూడు
తెరచి యుంచు కనులు తెలుగు బాల!         40

ఐకమత్యము బల మాపద వేళల
నేవిపత్తునైన నెదురు కొనగ
తమిళనాడు, ముంబయి మనకాదర్శము
తెలిసి కొనుము విధిగ తెలుగు బాల!             41

ఆత్మబంధువౌచు నగ్నికి వాయువు
కాన కాల్చునాడు కలసివచ్చు!
ఆర్పివేయుదీపమౌవేళ శత్రువై
బలమె కారణంబు తెలుగు బాల!             42

దైవభక్తికలిగి తల్లిభారతి కొల్చి
తోటివారికింత తోడు నిచ్చి
కన్నవారికెపుడు గర్వకారణమగు
తీరు నేర్చికొనుము తెలుగు బాల!             43

భవుడు శక్తినిచ్చె భస్మాసురుని మెచ్చి/
బలపరీక్ష చేయ వాడు తరిమె!
అందనపుడుపాద, మందిన సిగపట్టి/
ఖలుడు బుద్ధి జూపు తెలుగు బాల!             44

ఆటవెలదులేవొ యల్లుకొనుచు నేను
మంచిమాటలిన్ని మదిని తలచి
గురువు జూపినట్టి కరుణతో నొద్దికన్
తెలియ పరతు నమ్మ తెలుగు బాల!          45

శక్తిపాతమనుచు భక్తి జనుల ముంచి/
పాదపూజ పేర పదుల వేలు/
ధనము గుంజు వాడు తత్త్వదర్శి యగునె?
తెలివి మాలి చెడకు తెలుగు బాల!                 46

చందమామలోన సాయి దర్శనమిచ్చు/
పార్వతిసుతు బొమ్మ పాలు త్రాగు/
కనుల మూఢభక్తి గంతలు కట్టగ/
తెలివి తిరిపమెత్తు తెలుగుబాల!                 47

మాట యొకటె నిలుచు మహిలోన సతతము!
మాట విలువ పెంచు మనుజ కులము/
మాట నిలచు నెవడు మహితుడౌ సుజనుల
తెలిసి మాటలాడు తెలుగు బాల!                 48

త్రికరణముగ కార్య దీక్షను వహియింప/
నలుపు రాదు నిన్ను గెలుపు చేరు/
గెలుపు బలము కాదు బాధ్యత యని దాని/
తలకు నెక్కనీకు తెలుగు బాల!                 49

ప్రీతి నొక్క వైపు భీతిని నొకవైపు/
పంచ సాధ్యమౌను ప్రకృతి కెపుడు!
ఆదమరచి పోకు మాహ్లాదమున మున్గి/
కలిగి యుండు స్పృహను తెలుగు బాల!        50

ఆచరింపనట్టి యాదర్శములు గల/
సూక్తులెన్ని తెలియ ముక్తి యేది?
తలచియూరుకొనక తత్పర బుద్ధివై/
దీక్షతోడ మెలగు తెలుగుబాల!                     51

పక్షి చిక్కుకొనును వలను కాలును మోపి,
మనిషి చిక్కుబడును మాట జారి/
పలుకు నదుపు నుంచి నలువురు మెచ్చగా/
తెలివి నడచుకొమ్ము తెలుగుబాల!             52

దీనుడైనవాని హీనుడనుచునెంచి
యపహసింపబోకు మహముతోడ
నేడు కలుగు సిరి యనిత్యమను నిజము
తెలిసి వ్యవహరించు తెలుగు బాల!             53

కలిమి యున్న నాడు గర్వములేకుండ
బల్మి లేని నాడు తాల్మి తోడ
బ్రతుకనేర్చువాని వైఖరి యండయై
ధీరునిగను నిల్పు తెలుగు బాల!                 54

ఆర్తులైనవారి నక్కున జేర్చుక
వెంటనుండి వారి వెతలు దీర్చి
కంటి నీరు తుడుచు కారుణ్య మూర్తుల
తలచి యనుసరించు తెలుగు బాల!             55

పనికివచ్చు మాట పదిమారులౌగాని/
చెప్పుకొనగవచ్చు చింతలేదు/
పొల్లుమాటలేక పుడమి జనులు మెచ్చు
పలుకు లెపుడు నిలచు తెలుగు బాల!            56

వెల్గు రేక సోకు వెలుతురు కెదురేగ/
తిమిర మంతరించు దివ్వె తోడ/
సందియమ్ము గురువు సముఖాన దీరును/
కలుగ జ్ఞాన తృష్ణ తెలుగు బాల!                 57

విమల మతిని జేయు విజ్ఞాన మార్జించి,
చిత్తశుద్ధి కలిగి, శీలమొప్ప/
ధర్మ పథము నిలచి తన తల్లి దండ్రుల/
కెలమి కూర్చు మోయి తెలుగు బాల!          58

రగిలి మానధనుడు రారాజు కచ్చతో/
కులము కంత కీడు కోరి దెచ్చె!
దురభిమానమునను నరమేథమును సల్ప/
ఖలుడొకండు చాలు తెలుగు బాల!             59

సహజవనరులనగ సర్వ జీవులయాస్థి!
అవసరమ్ము మీఱి యాశపడక,
భద్రముగను వాని భావితరములకం
దించ వలెను విధిగ తెలుగు బాల!             60

గంధలేపనములు, కాసుల పేరులు/
పట్టు బట్టలు ఘన వైభవములు/
మంచిమాట నధిగ మించు భూషలుగావు/
తెలియ నరుని కిలను తెలుగుబాల!         61

చెవులఁ బడగనీకు చెప్పుడు మాటల/
పడిన తత్క్షణమ్మె విడవవలయు/
విడువ కుండ వాని విస్తరించితివేని/
తిరిగి నీకె చేటు తెలుగుబాల!                 62

పెద్దగురువులగుచు సుద్దులు చెప్పగ
నొకని మించుచు మరియొకరు గలరు!
ఆచరించిజూపి యాదర్శము త్రిశుద్ధి
వెలుగు పథము నందు తెలుగుబాల!         63

అంతరిక్షమునకు నంచు కొలవవచ్చు!
కడలిలోతు లందు గడపవచ్చు!
మనసు కల్గెనేని మార్గమ్ము తోచు, సత్/
ఫలము తానె వచ్చు తెలుగు బాల!             64

పట్టలేని కూర్మి వరముల నీయకు
మాగ్రహమున నిర్ణయములు వలదు
దశరథుండు, నలపరశురాముల చరిత్ర
తెలిసి మసలుకొనుము తెలుగుబాల!             65

నిలిచియుండి చల్ల నీరు త్రావుటకంటె,
పరువులెత్తి వేడి పాలుత్రాగు/
టదియె కాలధర్మమాయెను నేడిల!
దృష్టి కలిగి మసలు తెలుగుబాల!             66

గొప్పనదియు చూడ కొద్దిగా మొదలౌను!
పెరిగి చిన్న మొలక వృక్షమగును!
చెలగు జైత్రయాత్ర చిన్ని యడుగు తొల్లి!
తెలిసి యుద్యమించు తెలుగుబాల!             67

కండలున్న మనిషి కాబోడు బలవంతు/
డట్టి బలము వట్టి చట్టుబండ!
నీతి, గుణము శీల నియతులె నరునకు/
బలము నిజముగాను తెలుగుబాల!             68

అంగబలము మరియు నర్థబలము మూల/
కారణములు నరుని గర్వమునకు!
నవి కలిగిన పురుషు డాత్మ సంయమమున/
మెలగవలె యెరుకను తెలుగుబాల!            69

కన్నుముక్కు తీరుగానున్నలేకున్న/
మాటతీరులేక మనిషి కాడు!
అందమినుమడించు నాదరమును, ప్రేమ
కలుగు మాట వల్ల తెలుగు బాల!                70

తీరుకల తలఁపున నోరు మంచిదగును!
నోరుమంచిదైన నూరు మంచి!
యూరు మంచియైన గౌరవమది మించు!
తలపు చక్కఁజేయు తెలుగుబాల!            71

మంచి నెపుడు చాటు మందిలో నెలుగెత్తి
చెప్పవలయు నెపుడు చెడును చెవిని
వెలుగు మంచితనము పృధివిని యంతట
తొలగు చెడ్డతనము తెలుగు బాల!            72

నిఖిల కర్మ సాక్షి నియమాను వర్తియై
సమయబద్ధుడౌచు సంచరించి
సమయపాలనమ్ము సర్వుల ధర్మమని
తెలియజెప్పె మనకు తెలుగు బాల!            73

పరుల బాధనొకడు పరిహాసమును జేసి/
తనకు బాధగలుగ తల్లడిల్లు!
తత్త్వమెఱుగ గాను తనదాక రావలె/
నిలను సత్యమిదియె తెలుగు బాల!            74

ఆచరించి నూరు యాగముల నహుషు
డింద్ర పదవి ముదము నెక్కె గాని,
మోహదష్టు డగుచు మునులను బాధించి
తిరిగి పతనమయ్యె తెలుగు బాల!                75

ఒకరి సంప్రదాయ మొకరికౌ చాదస్త/
మొకరి మాన మొకరి కౌను దుడుకు/
జనుల గుణము లెల్ల సాపేక్షమే కాగ/
దృష్టి భేదమె గద తెలుగు బాల..!                76   

చేయగలనటంచు ధీరతన్ ముందుకు/
సాగి నిలువవచ్చు సఫలునిగను!
సంశయమ్ముతోడ చతకిల బడువాడు/
ఫలము పొందలేడు తెలుగు బాల!                77

చెరకు తిన్నవాడు తీపిననుభవించి/
బెల్లము తినువాని వెంగలి యను/
నట్లె తాను చేసినదియె ఘనమనుచు,
పలుచఁ జేయు పరుల తెలుగుబాల!                78
వెంగలి = మూర్ఖుడు, వెర్రివాడు
భావం:
అందరూ తాము చేస్తున్న పనే చాలా గొప్పది అన్న భ్రమలో ఉంటూ ఉంటారు, అవతల వాడు చేసే పని లోని గొప్పతనాన్ని గ్రహించరు. చెరకు తినేవాడు అవతల వాడు బెల్లం తింటూ ఉంటే చూసి ఎలా అయితే సహించలేడు ఇదీ అలాగే..!!
అవతలవాడిని వెర్రివాడు అనుకుంటాడు .
 
ఆ.వె.
కాళ్ళు తడువకుండ కడలి దాటగ వచ్చు/
దాటలేము కనులు తడియకుండ/
కష్టమను కడలిని! కాని, దాటవలెను -
దిటవు గుండె తోడ తెలుగు బాల!                 79
 
ఆ.వె.
శరము సూటిదనము పరికింపగా నొక్క/
కంట జూచినట్లు కమ్మరీడు -
లక్ష్యమందు మనసు లగ్నమగు తదేక
దృష్టి కలిగియుండు తెలుగు బాల!
!                 80

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు