యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కేదారనాథ పర్వత సానువులలో ప్రకృతి

మా కేదార్ నాథ - బదరీ నాథ యాత్ర లో చూచిన ప్రకృతి వర్ణన:

సీ.
నభమంటు శిఖరాలు ప్రభుధామమై 'మంచు/
తలపాగ' తొడిగెను దర్పమొలుక!
పులకాగ్ర మైనట్టి భూరుహమ్ములు నిల్చె/
ముక్కంటికై కయిమోడ్పు లిడుచు!
శిరము నుండెడు గంగ చెంగునన్ దూకంగ/
పాయలై లోయలన్ పాదమంట!
చల్లగాలులు వీచె మెల్లగా నెల్లెడన్
శివ విభూతిని పెంపుజేయ జగతి!
లింగాకృతిన్ దాల్చి లెక్కకు మిక్కిిలై/
ప్రమథులె రాలు రప్పలుగ వరల!

తే. గీ.
ప్రకృతి కేదారనాథుని ప్రాభవమును/
రంగరించెడి ఘనత నంగాంగ మలరు/
వర్ణ సాకల్య చిత్రంపు పరిధి యెంత?
సరస హృదయ చిత్రపట వైశాల్యమంత!

- రాధేశ్యామ్ రుద్రావఝల
03.08.2023
🙏🙏🙏


ఆకాశాన్ని అంటుకుంటున్న శిఖరాలు శివుడి నివాసమైనందుకా అన్నట్టు మంచు తలపాగ తొడిగాయి దర్పంగా..!!
ఆ పులకింతలో శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఆపర్వతాల మీది వృక్షాలు నిట్టనిలువుగా నిలబడి శివుడికి నమస్కరిస్తున్నాయి..!
శిరస్సు మీది గంగ చెంగున దూకి పాయలుగా లోయలలో శివుడి పాదాలను తాకడానికా అన్నట్టు పారుతున్నది.
శివ విభూతిని (విభూతి = భస్మం, ఒక సంపద, ఐశ్వర్యము) విశ్వమంతా వ్యాపింప జేయడానికి అన్నట్టు చల్ల గాలులు మెల్లగా వీచుతున్నాయి.
ప్రమథ గణాలు లింగాకృతిలో (గుండ్రం గా) అసంఖ్యాకంగా రాళ్ళు రప్పలు గా కొలువుతీరాయి.

ప్రకృతి కేదారనాథుని ప్రాభవాన్ని తన అంగాంగములలో రంగరించి ఉన్నట్టి ఆ సంపూర్ణ వర్ణ చిత్రపు పరిథి ఎంత అంటే, మన హృదయంలో ఉన్న కేన్వాసు ఎంత పెద్దగా ఉంటే అంత..!!
మంచు తలపాగ 

22, నవంబర్ 2019, శుక్రవారం

రైలు యాత్ర..!

విజయవాడలో పని చూచుకొని అక్కడి నుంచి విశాఖపట్నానికి తిరిగి బయల్దేరినప్పటి సంగతి ఇది.
సంబల్పూర్ ఎక్స్ ప్రెస్ దొరికితే అది ఎక్కాను, నా పాట్లు అవధరించండి..! 


ఆ.వె.
ట్రైను స్పెషలటంచు రన్నింగునెక్కితి/
గూడు చేర ప్రొద్దు గూక కుండ/
స్పెషలు ట్రైను లేటు జీవిత కాలమై/
యిల్లు చేరు సరికి తెల్లవారె! 


కం.
టీటీ గారికి చెప్పగ/
వాటంగా బెర్తు రాసి పక్కకి పిలిచెన్!
ధాటిగ మామూలిడి, నా
సీటుకు వడివడిగ నడచి చేరితి నంతన్!


తీరా ఎక్కాక లోపల ఏసీ కోచ్ పరిస్థితి ఎలా ఉందంటే:
ఆ.వె.
ఆక్రమించుకొనుచు నన్ని బెర్తులు వారె/
దుప్పటీలు పరచి దొరల వలెను/
విస్తరించుకొనిరి పేకాట రాయళ్ళు/
సేదదీర మనకు సీటు లేదు! 


ఆ.వె.
వేరుశనగ పొట్టు పారబోయు నొకడు,
నీచు తినుచు కంపు నించు నొకడు!
ఉలికి పడగ కాళ్ళ నెలుకలు నర్తించు!
వెతలు రైలు లోన కతలు గావు!


ఆ.వె. 
క్రింది బెర్తులన్ని ముందున్న యాత్రికు
పడకలౌచు హాయి వారి కొసగు!
వారి కాళ్ళ వద్ద కూరుచొన మనసు
రాక లెమ్మనంటి వీక తోడ..!
 
ఆ.వె. 
కాలు బెణికె నేను కదలేననెనొకడు/
పెద్దదాన వీవె సద్దుకొనవొ/
యనుచు నొక్క పడతి యనునయింపగ నేను/
సైడు బెర్తు నెక్కి చస్తి నపుడు!

 

రాత్రి అయ్యాక పడుకుంటే ఇక చూస్కోండి: 
ఆ.వె.
గురక పెట్టి చంపు కుంభకర్ణుడొకడు!
గుక్క పట్టి యేడ్చు గుంట డొకడు!
పక్కవాని బాధ పట్టనే పట్టదు!
రాత్రి పూట రైలు యాత్రికులకు!

16.11.2018


గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు