26, జులై 2023, బుధవారం

విరహము

ఆ.వె.

మనసు మాట వినదు మాటలాడు వరకు/
పలుకు విన్న వరకు పరితపించు/
పలుకరింపబోగ పలుకవైతివి నీవు
ఇంత రాతి గుండె యేల నీది? 



ఇంద్రుడు, చంద్రుడు

 ఎవరినైనా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలేమో:

ఆ. వె.
ఇంద్రుడవని, యొకని, చంద్రుడని పొగడ/
నొప్పబోదు గుణము లూహ సేయ!
వాసవునికి  కల దభద్రతాభావమ్ము/
వెన్నెల దొరకేమొ వీపు నలుపు!!

- రాధేశ్యామ్ రుద్రావఝల
25.07.2023


చిన్న సవరణతో:
ఆ. వె.
ఇంద్రుడని నొకరిని చంద్రుడని పొగడ/
నొప్పదనెద గుణము లూహ సేసి!
వాసవునికి కలదభద్రతాభావమ్ము/
వెన్నెలదొరకేమొవీపునలుపు!

(వెన్నెలదొరయొగురువిందపూస!!)

17, జులై 2023, సోమవారం

విశ్వనాథవారి వేయిపడగలు నవలలో - మేఘ వృక్ష మైత్రి - కి పద్యరూపం

విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగల్లో ఒక ఘట్టం శ్రీ శ్రీరామారావు మాస్టారి మాటల్లో:   

ఒక మేఘం  వానకాలంలో సంచరిస్తూ ఒక పెద్దచెట్టుని‌ కౌగలించుకొని ఆనందబాష్పాలు‌ కార్చేది.
ప్రతిసంవత్సరం వారి చెలిమి చాల దృడమైనది. ఏళ్లతరబడి సాగుతున్నవారి చెలిమికలిమితరగనిగని!

నాగరకత పెరిగింది. ఆ సుబ్బన్నపేట నెమ్మదిగా పట్టణాలవంకచూడసాగింది.
చెట్టునికొట్టి కరెంట్ పోల్ వచ్చింది --- ఆదేశంగా!!!
వానకాలంవచ్చింది. మన వృద్ధమేఘమూ వచ్చింది.
ఆ ప్రాంతమంతాకలయతిరిగింది.
ఎక్కడ తన ఆప్తవృద్ధమిత్రుని జాడకానరాలేదు. 

వెదకివేసారి మళ్ళీ ఈ ప్రాంతానికి రానక్కర్లేదని బాధపడింది..
మ్రోడువారినయెదలోనుండి కార్చకన్నీరులేక నిట్టూర్పులతో నిష్క్రమించిందా మేఘం!!!!

పై భావాన్ని ఆటవెలదుల్లో ప్రయత్నించాను..!

జలదమొకటి మిన్ను సంచరించుచు పెద్ద/
తరువు చేరె ప్రేమ ధార కురియ!
నా యిరువురి మధ్య ననుబంధమేర్పడి/
యెంతయో బలపడె నేటికేడు!

కాల మహిమ నకట గ్రామమ్ము పట్నమై/
తరువు తొలగి వెలసె స్తంభమొకటి!
వర్ష ఋతువునందు వచ్చుమేఘము తన/
చనవరి కనరాక చకితుడయ్యె!

వెదకి యలసిసొలసె, వృద్ధమిత్రుని జాడ/
తెలియరాక మబ్బు దిగులు చెందె!
నిలువలేక నచట నిట్టూర్చి జలదమ్ము/
మరల రాననుచును మరలి పోయె!

చెట్టులేని తావు ’చినుకుదారి’క* రాదు/
తానులేక చిగురు దాల్పదు తరు/
విట్లు బంజరయ్యె వేడిగాడ్పులనూరు!
కార్చ కంటనీరు గగనమయ్యె!

*చినుకుదారి - మేఘము - ఇకరాదు

5, జులై 2023, బుధవారం

కోడలి జాణతనము

శ్లోకము:
శ్ర్వశ్రూ రత్ర నిమజ్జతి
అత్రాహం దివసకే ప్రలోకయ
మా పథిక! రాత్ర్యంధ!
శయ్యాయా మావయోర్నిమఙ్క్ష్యసి!

ప్రతిపదార్థము:
శ్వశ్రూ = అత్త, అత్ర = ఇక్కడ
నిమజ్జతి = నిదుర మునుగుతుంది.
అత్ర
అహం = నేను, దివసకే = పగలే, ప్రవిలోకయ = బాగా చూడు - చూచుకో
పథిక! = ఓ బాటసారీ!, రాత్ర్యంధ! = రేఁజీకటి కలవాడా!
ఆవయోః = మాయొక్క, శయ్యాయాం = పడకపై, మా నిముఙ్క్ష్వ= పడవద్దు


నా అనువాద యత్నము:
ఉత్పలమాల:
అత్త పరుండు నిచ్చటనె యద్దరి నే పవళింతు పాంథుడా!
క్రొత్త ప్రదేశమోయి! మది గుర్తు నెరుంగుము! శయ్య చేర నీ/
తత్తరనో నిశాంధ్యమునొ దారిని తప్ప ప్రమాదముండదో/
యెత్తెరగున్ గమించెదవొ యే పొరబాటుకు తావు నీయకన్!

క్లుప్తత కోసం మరో ప్రయత్నం:
ఆ. వె.
అత్త నిదుర మునుగు నచ్చట, నిచ్చట /
నేను పవ్వళింతు! నెరుక తోడ/
చూచికొమ్ము పవలె! రేచీకటిని మాదు/
పైన పడెద వేమొ బాటసారి!


1, జులై 2023, శనివారం

ఇళయరాజా



ఉత్పలమాల.

ఎన్నగ వేలపాటలకు నింతటి గొప్పస్వరమ్ము లల్లి, తీ/
పన్ననిదే యనన్ మదికి నబ్బురమౌ పలు చిత్ర గీతముల్/
మన్ననపొందగా శ్రవణ మాధురి నందుచు నిల్చె గాన ధా/
రన్నవ రాగమై యిళయరాజ ను పేరిట సుస్థిరమ్ముగన్!

నా అభిమాన సంగీత దర్శకుడు శ్రీ ఇళయరాజా గారి పుట్టినరోజు సందర్భంగా
2 June 2023 న వ్రాసిన పద్యం..! నెల ఆలస్యంగా పోస్టు చేస్తున్నాను.

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు