ఖండిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఖండిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2023, సోమవారం

న్యాయస్థానములు..!

ఆ.వె.
పాత రాతి కట్టు భవనపు గదులవి/
కప్పు నాని పోయి కారు చుండు/
ఘనము వాని చరిత గతమహో యనగను/
కూలిపడక నిలచు కోర్టు హాళ్ళు..!

ఆ.వె.
నలుపు గౌను తొడిగి పలు వాదనమ్ముల/
వినుచు తీర్పులీయ విసుగులేక/
పెద్దగద్దెమీద పేరిమి కూర్చున్న/ 
జనుల వేలుపతడు జడ్జిగారు!

ఆ.వె.
నల్ల కోటు వేసి న్యాయదేవత సాక్షి/
కాగితముల దొంతు కౌగలించి/
గాలి లేని యిరుకు గదులలో వాదనల్/
నడుపు నతని పేరు న్యాయవాది!

ఆ.వె.
తెలుపు యూనిఫార్ము నెలమి జడ్జి కడను/ 
నిలచి యెర్ర పగిడి తలను దాల్చి/ 
యరుణపు పటకానెగుర వేయుచు జనుల/ 
మూడుసార్లుపిలచు వాడు ప్యూను!!

ఆ.వె. 
దీనులగుచు మిగుల దిక్కులు చూచుచు/ 
చెమట గ్రక్కుకొనుచు చింతపడుచు/ 
తమను పిలుతు రనుచు తలుపుల వ్రేలాడు/ 
కర్మ కాలి వారు కక్షిదార్లు!

- రాధేశ్యామ్ రుద్రావఝల
7.06.2018

**************************************
దీనికే కొనసాగింపు:
ఆ.వె.
బల్ల కలదు కాని పైకప్పు మరి లేదు/
కలదు స్టూలు కాని గచ్చు లేదు/
ఒక్క కేసు కోసమురక లెత్తుచునుండు/
చెట్టు కింద ప్లీడ రిట్టు లుండు..!

యేచూరి చంద్రశేఖర మూర్తి అని మామిత్రుడి ఐడియా ని నేను పద్య రూపంలో వ్రాసినది.. 
(07.06.2018)

శిక్ష: 
ఆ.వె.
శిక్ష పడ్డవాడు చెడ్డవాడనికాదు/
పడనివాడె మంచివాడు కాదు/
శిక్షపడినపిదప చెడ్డేది మంచేది 
యన్నినొక్కరీతి నెన్న బడును..!!

తే.గీ.
దొరకు నంత వరకు పెద్ద దొరలు కాని/
దొంగలౌదురు వారలు దొరికినంత/
దొరకకుండగ దొంగలై దోచుకొనుట/
దొరలకే సాధ్యమౌనట్టి దొంగవిద్య!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(9.06.2018)

6, సెప్టెంబర్ 2023, బుధవారం

మావాడు..!!

ఆ. వె.
వనమున నొకసారి వచ్చెనెన్నిక లంత/
నన్ని చెట్లు 'ఓటు హక్కు' పొందె!
కుదిరెను బరి నెదురు 'గొడ్డలి'‌ 'సెలయేరు'
నన్ను నన్నటంచు ఎన్నికలను!

ఆ. వె.
తరుల మనుగడ కవసరమగు నీరిచ్చె/ 
నేరు! గాన గెలిచి తీరును! మరి/
కూలె నెన్నొ చెట్లు గొడ్డలి వ్రేటుల/
కనుక గెల్చు తెరువు కాన రాదు!

ఆ. వె.
అనుచు బయలుదేరె నభిమతమొక్కటి/
వనము నందు చెలగి ప్రబల మయ్యె!
ఎవరు గెల్తురనుచు నెంతయో నుత్కంఠ/
పెరిగె దినదినాభివృద్ధి యగుచు!

ఆ. వె.
ఫలితమొసగువేళ బలములు లెక్కింప/
నబ్బురమున మునిగె నడవి యంత!
ఘన విజయము పొందె గండ్రగొడ్డలి, సెల/
యేరు నోటమిగని నీరుగారె!

తే.గీ.
వృక్ష జాతి పెద్దల సమావేశ పరచి/
ఇట్టి వింతైన ఫలితమ దెట్టు కల్గె/
ననగ మా ఓటు "గొడ్డలి" కనియె తరులు!
వాని వెనుక నున్నది *మన వాడె* కనుక!

3, ఏప్రిల్ 2021, శనివారం

అందం తెచ్చిన తంటా..!

ఆ.వె.
అరువదేండ్ల ముసలి యముని గని కలను/
నాయువెంత మిగిలె ననుచు నడిగె/
ముప్పదేండ్లపైని మూడుమాసములని/
యా యముండు పలికె నాదరమున!

ఆ.వె.
సంతసించి నారి చెంతనుగల వైద్య/
శాలకు చని ఖర్చు చాల చేసి/
చక్కదనము తిరిగి చిక్కునట్లు చికిత్స/
నంది పాతరూపు పొందె ముదము..!

ఆ.వె.
వైద్యశాల నుండి వచ్చిన వనితను/
నకట! గ్రుద్దు కొనియె నాంబులెన్సు!
విడిచె ప్రాణ మచటె విల విలలాడుచు/
తరుణి కాయె యముని దర్శనమ్ము!

ఆ.వె.
ఏల జేసినావొ యింతటి ఘోరము?
ఆయువెట్లు దీరె ననుచు నడుగు/
పడతి జూచి యముడు బదులిచ్చె "గుర్తింప/
కుంటినమ్మ నిన్ను కోమలాంగి!"

_(ఆంగ్లములో వచ్చిన ఒక వాట్సాప్ జోకుకి పద్యానుసరణ.)_
- రాధేశ్యామ్ రుద్రావఝల
(01.08.2019) 🙏🙏🙏

20, డిసెంబర్ 2020, ఆదివారం

గాలి పటము - ఖండిక

గాలి పటము - ఖండిక

ఆటవెలదులు:

గగనవీధిలోన గాలిపటమొకటి/
యెగిరె స్వేచ్ఛ తోడ నెగసి పడుచు/
మేడ దాటి యెగిరె మిద్దె దాటుచు పోయె/
తేలి పైకి పోయె గాలిపటము!              (1)

పక్షి గుంపులోన పక్షివోలెనెగిరె!
మేఘ మాల తోడ మేలమాడె!
పవను బలము తనకు బాసటై నిలువగా/
తేలి పైకి పోయె గాలిపటము!              (2)

25, నవంబర్ 2020, బుధవారం

ఆవకాయ

[నిన్న (24.11.2020) మా పద్యసౌందర్యం WhatsApp గ్రూపులో ఆవకాయ గోంగూరలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ ఫ్లోలో ఆశువుగా వచ్చిన పద్యములివి]

ఆవకాయ పద్యాలు

కందము.
ఎందెందు కలిపి తినగా/

నందందే స్వర్గ సుఖము నందించునుగా!

విందేది యైనగాని ప/

సందౌ మన ఆవకాయ సందడి చేయున్!

కందము.
ఇందు తగు నందు తగదను/

సందేహము లేదు కలుప చక్కగ రసనా/
నందము తథ్యము! గానన్/

తిందుము మన యావకాయ తృప్తి కలుగగన్!

కందము.
ముంగిట విస్తరిలోనన్/
గోంగూరయు నావకాయ కూర్మిని కనగా/

నంగుటి లొట్టలు వేయగ/
సంగరమే వాని మధ్య చవులూరింపన్!

ఉత్పలమాల.
ఎర్రని యావకాయ రుచి యించుక తగ్గదు పాతబడ్డ తా/
చుర్రనిపించు నాలుకను చొక్కున కూడగ నన్నమున్ తగన్/
జర్రని ముక్కుకారును నసాళము నంటగ దాని ఠేవయున్/
జుర్రుదు రెల్లరున్ పెరుగు జోడయి నన్నము కమ్మకమ్మగాన్/

ఆ.వె.
ఆవకాయ తిన్న యానందమది మిన్న!
కూరలెన్ని యున్న చారు కన్న/
నందులోన కొంచమావకాయయె నంజు/
కున్న నదియె రంజుగుండు నన్న!

ఆ.వె.
ఊహ తోనె నోటి నూరించు నెయ్యది!?
యన్నిటికిని గొప్ప యాదరువది!
యూరగాయలందు నుత్తమంబైనది!
ఆవకాయ యనిన ఠీవి గలది!

 

- రాధేశ్యామ్ రుద్రావఝల
24.11.2020


గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు