శార్దూలము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శార్దూలము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, అక్టోబర్ 2022, శనివారం

హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన:

హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన:


శార్దూలము.
ఏమా యున్నత గోపురంబులవి తామే కీర్తినిన్ దాల్చెనో/
యేమా స్వచ్ఛ జలాశయంబులవి తామే శీలమున్ కల్గెనో/
యేమా గండ్ర శిలాచయంబులవి తామే ధీరతన్ చూపెనో/
యేమా కోమల శిల్పమూర్తులవి తామే భావముల్ పల్కెనో/
యా మా రాయల సద్గుణాళి నిలిచెన్ హంపీ కళా క్షేత్రమై!

కీర్తి ఉన్నతంగా, శీలము స్వచ్ఛంగా, ధీరత్వము కఠినంగా, భావాలు కోమలంగా ఉండే రాయలవారి సద్గుణాలకు ప్రతీకలుగా/ వ్యక్తిత్వ చిహ్నాలుగా/  గోపురాలు, జలాశయాలు, శిలా సమూహాలూ, శిల్పాలూ హంపి క్షేత్రంలో నిలిచియున్నాయి అని భావము.

- రాధేశ్యామ్ రుద్రావఝల
15.10.2022

12, జనవరి 2022, బుధవారం

హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!

శుభోదయం.

శార్దూలము.
ఉర్వీపుత్రిక జాడ తానెఱిఁగి యయ్యుత్సాహ సంరంభమున్/
గర్వాంధుండగు రాక్షసాగ్రణికి చీకాకున్ ప్రకోపింపగా/
నార్వేరంబు తొలంగ దాశరథికిన్ హర్షంబు చేకూర్చు నా/
దుర్వారోద్యమ బాహు విక్రముని, నస్తోకప్రభారాశినిన్/
సర్వాభీష్ట ఫలప్రదాత హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!

ఆర్వేరము = కలఁత

భూమిజ యైన సీత జాడ తెలిసికొని, ఆ ఉత్సాహముతో, గర్వాంధుడగు రాక్షసరాజైన రావణుని చీకాకు పరచి, రామునికి కలత పోగొట్టి ఆనందమును కలిగించిన ఎదురులేని బాహుబల సంపన్నుడూ, అనల్పమైన కాంతితో వెలుగొందేవాడు, అభీష్టములన్నీ నెరవేర్చేవాడూ అయిన హనుమకు సద్భక్తితో నేను నమస్కరిస్తున్నాను.

- రాధేశ్యామ్ రుద్రావఝల
12.01.2022

11, ఆగస్టు 2021, బుధవారం

పెళ్ళాం అలుక - బాపు కార్టూనుకు పద్యం..!


శార్దూలము:
నేనేదైనను చేసినందు కలకో, నేనేమి చైలేదనో/
నేనైనిన్నొకమాట యంటిననియో, నేనేమి యన్లేదనో/
నేనేదైనను కొన్న బాధ యిదియో, నేనేమి కొన్లేదనో/
యీనాడేమిది మూడు వేస్తివి! యహో! యింకేమి చెయ్ లేననో!

- రాధేశ్యామ్ రుద్రావఝల
11.08.2021

పై పద్యానికి మా గురువుగారు శ్రీ శ్రీరామారావు గారి సవరణ:
నేనేదైనను చేసితో? యలుగగా నేనేమియుం జేయనో?
నేనై నిన్నొకమాటయంటి ననియో? నేనేమి మాటాడనో?
నేనేదైనను కొంటినన్న వగపో? నేనేమి తేలేదనో?
యీనాడేమిది 'మూడు' భంగిమము, నాకేమింకమూడెంగదో?!

20, ఏప్రిల్ 2021, మంగళవారం

ఇంకో పేరడీ పద్యం..!

తన భార్య ఆన్‍లైన్ షాపింగ్ లో మోసపోతుందేమో అని హెచ్చరిస్తున్నాడు భర్త..!!

శార్దూలము:

నీకున్ షాపుల కేగగాను కఱవా నీచేత కార్డుండగా/
బైకుల్, కారులు త్రొక్కుచుండి తిరుగన్ వైడెస్టు రోడ్లుండగా/
సోకుల్ పోవుచు ’నాను లైను’ సరకుల్ చూడన్ విచిత్రమ్ముగా/
వీకన్ జేకొన నీ మొబైలు తగునా!? వెఱ్ఱౌటకా శ్రీమతీ!?


🙂🙃🙂

పై పేరడీకి మూలం (ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి)

నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండగా
పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప కా బోయచే
జేకొంటెంగిలి మాంసమిట్లు దగునా! శ్రీకాళహస్తీశ్వరా!

దానికా శ్రీమతి ఇలా అంది:

ఆ.వె.
పైకిపోవగాను నాకును మనసేను!
పైకి పోదు నన్న భయముతోను/
కాలు కదుపలేక, కరొనా కు జడిసి నే/
నాశ్రయించితి మరి 'ఆను లైను'!


- రాధేశ్యామ్ రుద్రావఝల

28, మార్చి 2021, ఆదివారం

వ్యాజస్తుతి..!


శార్దూలము.

నీ సొమ్మేమది పోవునో, భవహరా! నీకెంత యాటాయెనో!
యే సార్థక్యము కల్గి గొప్పదగు పేరే దాల్చెదో! గొంకవో!
యీ సంసార పయోధి ముంచక ప్రభో! యెట్లైన దాటింపవో!
యో సామీ! తమ పాదముల్ గొలువ లేదో !?  తండ్రి! కాపాడుమా!

6, మార్చి 2018, మంగళవారం

చందమామ

శార్దూలము.
రాకాచంద్రుని వెన్నెలల్ జగతి కారాధ్యంబు లింపారగా/
నాకాశంబున నిన్నుజూడ మది నాహ్లాదంబు పెంపారగా/
నీకై వేచిన కల్వ భామినుల సాన్నిధ్యమ్ము సొంపారగా/
నేకాంతంబునుగోరు జంటలకు నీవేకైక మిత్రుండవై..!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు