18, ఏప్రిల్ 2022, సోమవారం

ఇడ్లీలపై పద్యాలు:




ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు :

*********************

హేడ్లీ తో చెప్తున్నాను:

కం.

        హేడ్లీ! వేడిగ సాంబా/

        రిడ్లీలవి రెండు తినగ నింపగు మదికిన్!

        బ్రెడ్లూ బర్గరు పిజ్జా/

        లిడ్లీలకు సాటిరావు యేనాడైనన్!

*********************

కం.

        బూరెలు పులిహోరలు గోం /

        గూరయు పప్పూపులుసును కొబ్బరి చట్నీ/

        గారెలు నేతులతో నిం/

        పారగ నరిటాకున తిన నదురును హేడ్లీ!

*********************

ఆ.వె.

        మల్లె పూలవోలె తెల్లని యిడ్లీలు/

        వెన్న ముద్ద నోట పెట్టినట్టు/

        కరిగిపోయినంత కలుగదే సంప్రీతి!

        యట్టి యిడ్లి కదియె యౌను సాటి!

*********************

తే.గీ.

        వేడి సాంబారు, పచ్చళ్ళ వేడ్క ముంచి/

        తెల్లటిడ్లీలఁ  దినునట్టి దినము దినము!

        నేయి, కారంబు లద్దుచు ప్రీతి మీఱ/

        రవ్వ యిడ్లీల రుచియించు రసన రసన!


- రాధేశ్యామ్ రుద్రావఝల


********************* 

ఈ మధ్యే పరిచయమైన కోరా మిత్రులు శ్రీ చంద్రమోహన్ గారు ఇడ్లీ పై వ్రాసిన పద్యం: 

        కం.

        మల్లెల బోలిన మెత్తని

        తెల్లనివిడ్లీలటంచు తెలియును గానీ

        పుల్లని,వెర్రని, వితరము

        లెల్లను చూపించ మాకు ఇడ్లీలగునే!

4 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. సీ. ఇడ్లీలపై నేల నీశ్వరుపై మీరు పద్యముల్ రచియింప వలయు గాని
    బర్గరు పిజ్జాల బట్టి తిట్టుట గాక బంధతతుల దిట్ట వలయు గాని
    గోంగూర పప్పుల గొప్ప లెన్నుట గాక నళినాక్షు గొప్పెన్న వలయు గాని
    తిండియావను బోవు దినమెట్టి దినమయ్య దినమన్న హరికిచ్చు దినము కాని
    తే. ఊరకే లౌకిక ములపై నుంచి శ్రధ్ధ
    పనికిమాలిన కవితలు బరుకుటేల
    నుడువ దలచిన హరిగూర్చి నుడువు డయ్య
    సార్ధకంబగు భారతీశక్తి యపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజెప్పినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారూ..! మీరన్నది నిజమే..!! మీరన్న పద్యాలు వ్రాస్తూ ఉండినా అప్పుడప్పుడు సరదాకే అనుకుంటూ ఇలా బుద్ధి పెడత్రోవ పడుతుంది.

      మీ సూచనలను గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు.

      https://mypadyam.blogspot.com/p/blog-page_10.html

      https://mypadyam.blogspot.com/p/blog-page_25.html

      దయచేసి పై లింకులలో ఉన్న పద్యాలను కూడా కాస్త చూసి మీ అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా మనవి.

      తొలగించండి
    2. మీ పద్యాలను చదివాను. రెండుపేజీల్లోనూ పద్యాలను అక్కడక్కడా చూసాను. తీరికగా మరిన్ని చదివి నా అభిప్రాయం పంపుతాను. మంచి ధారాశుధ్ధితో పద్యాలు వ్రాస్తున్నారు.చాలా సంతోషం కలిగింది. అభినందనలు. చిల్లరవిషయాల గురించి పద్యాలను వ్రాయటం వలన మీసమయం వృథా అవటం తప్ప ప్రయోజనం ఉండదు కాబట్టి అటువంటివి గట్టి సందర్భం ఉంటే తప్ప వ్రాయకండి దయచేసి. మీరు కవిత్వాన్ని భగవంతుడికిచ్చి చక్కగా పద్యాలు చెప్తున్నారు. ఈకాలం వాళ్ళు తమాషాపద్యాలు మాత్రమే చదువుతారు కదా అని ఆలోచించవద్దు.

      తొలగించండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు