సీసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సీసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఏప్రిల్ 2024, బుధవారం

ఉగాది శుభాకాంక్షలతో:

ఉగాది శుభాకాంక్షలతో:

సీ.
క్రొత్త వత్సరమంచు కుహు కుహూ రవముల/
గండుకోకిల పాడె గళము నెత్తి!
కొమ్మకొమ్మకు నొక్క  క్రొత్త చిగురు దాల్చి/
యా రసాలము పట్టె తోరణముల!
తెలిమంచు పరదాలు తొలగించి విరిసి - ము/
స్తాబయ్యె చక్కగా ధరణి భామ!
పూల నెత్తావిని దాలిచి చిరుగాలి/
మెలమెల్ల మేనుల పలుకరించె!

ఆ. వె.
పక్షి వృక్ష తతులు, ప్రకృతి యంతయును వ/
సంతునాగమమున సందడించు/
శుభతరుణ ముగాది సుఖసౌఖ్యముల నిచ్చి/
యెలమి పంచు గాత యెల్లరకును!

-- రాధేశ్యామ్ రుద్రావఝల
09.04.2024

11, సెప్టెంబర్ 2023, సోమవారం

లోకరీతి..!

 సీ.
అలనాడు, చంద్రమా! యద్దము నిను జూపె/
బాలరాముని తండ్రి వైనముగను!
ఆముద్దు తీరక నా రామచంద్రుడు/
తన నామ మందున నిను ధరించె!
శాపదష్టుడ వగు శశి! నిను గాంచగా/
క్షీర ఘటమునందు కృష్ణమూర్తి/
నిందచే యలిగెనో నిన్ను దాల్పడు కదా/
నామావళిన్ తాను దీమసాన!

గీ.
సిరికి సోదరుడౌ బావ మఱది వయ్యు/
శీతకర! ముచ్చట కలుగ చేరదీసి/
తనకు నష్టము సేయ మాధవుడు దూర
ముంచె! లోకరీతి యదంతె! యుర్వినెపుడు!

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కేదారనాథ పర్వత సానువులలో ప్రకృతి

మా కేదార్ నాథ - బదరీ నాథ యాత్ర లో చూచిన ప్రకృతి వర్ణన:

సీ.
నభమంటు శిఖరాలు ప్రభుధామమై 'మంచు/
తలపాగ' తొడిగెను దర్పమొలుక!
పులకాగ్ర మైనట్టి భూరుహమ్ములు నిల్చె/
ముక్కంటికై కయిమోడ్పు లిడుచు!
శిరము నుండెడు గంగ చెంగునన్ దూకంగ/
పాయలై లోయలన్ పాదమంట!
చల్లగాలులు వీచె మెల్లగా నెల్లెడన్
శివ విభూతిని పెంపుజేయ జగతి!
లింగాకృతిన్ దాల్చి లెక్కకు మిక్కిిలై/
ప్రమథులె రాలు రప్పలుగ వరల!

తే. గీ.
ప్రకృతి కేదారనాథుని ప్రాభవమును/
రంగరించెడి ఘనత నంగాంగ మలరు/
వర్ణ సాకల్య చిత్రంపు పరిధి యెంత?
సరస హృదయ చిత్రపట వైశాల్యమంత!

- రాధేశ్యామ్ రుద్రావఝల
03.08.2023
🙏🙏🙏


ఆకాశాన్ని అంటుకుంటున్న శిఖరాలు శివుడి నివాసమైనందుకా అన్నట్టు మంచు తలపాగ తొడిగాయి దర్పంగా..!!
ఆ పులకింతలో శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఆపర్వతాల మీది వృక్షాలు నిట్టనిలువుగా నిలబడి శివుడికి నమస్కరిస్తున్నాయి..!
శిరస్సు మీది గంగ చెంగున దూకి పాయలుగా లోయలలో శివుడి పాదాలను తాకడానికా అన్నట్టు పారుతున్నది.
శివ విభూతిని (విభూతి = భస్మం, ఒక సంపద, ఐశ్వర్యము) విశ్వమంతా వ్యాపింప జేయడానికి అన్నట్టు చల్ల గాలులు మెల్లగా వీచుతున్నాయి.
ప్రమథ గణాలు లింగాకృతిలో (గుండ్రం గా) అసంఖ్యాకంగా రాళ్ళు రప్పలు గా కొలువుతీరాయి.

ప్రకృతి కేదారనాథుని ప్రాభవాన్ని తన అంగాంగములలో రంగరించి ఉన్నట్టి ఆ సంపూర్ణ వర్ణ చిత్రపు పరిథి ఎంత అంటే, మన హృదయంలో ఉన్న కేన్వాసు ఎంత పెద్దగా ఉంటే అంత..!!
మంచు తలపాగ 

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు