వర్ణన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వర్ణన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2025, మంగళవారం

చిత్రకారుడు

 

 

ఉత్పలమాల.

ఎవ్వరు నేర్పె కొమ్మలకు నిన్ని సుమంబులు రెమ్మరెమ్మకున్/
నవ్వుచు పూయగా ప్రతి దినంబు క్రమంబును తప్పకుండగా/
దివ్వెగ భాను బింబము ద్యుతిన్ విరజిమ్మక మున్నె వర్ణములు/
నివ్వటిలంగ జేయగను నెమ్మి వహించుచుఁ నద్దె నాతడే!

ఎవరు కొమ్మకొమ్మలకూ పూవులను క్రమంతప్పకుండా పూయడం నేర్పాడో, ఆతడే ఆ పూవులు అతిశయించేటట్టుగా ఓపికగా సూర్యోదయానికి ముందే వర్ణాలు కూడా అద్దాడు.

17, జూన్ 2024, సోమవారం

జటాయువు

 

తిరువనంతపురం లో ఉన్న Jatayu Earth's Center Nature Park ను సందర్శించినప్పుడు వ్రాసుకున్న పద్యం ఇది:

సీ.

భీత విహ్వల యైన సీతమ్మ రోదనన్/
విని, ప్రోవ నరుదెంచు వృద్ధ యోధ!

కర్కశత్వమె గాని కరుణ యించుక లేని/
లంకేశు కెదురొడ్డు రట్టు నీది!

యతని శస్త్రపు బల్మి, నాఘాతముల నోర్చి/
ధీరత్వమున పోరు తెగువ నీది!

ముక్కుతో గోళ్ళతో రక్కసు బాధించి/
నిలువరింపగ నెంచు నిష్ఠ నీది!

గీ.

రెక్కలు తెగినేలను పడ్డ పక్కివగుచు/
మోక్ష మందితి శ్రీరాము పుణ్య కరము!
స్త్రీల గౌరవ, రక్షణ చిహ్నమనిన/
నింకెవరు నినుమించగ నిల జటాయు!

— రాధేశ్యామ్ రుద్రావఝల

పై ఫొటో నేను తీసిందే..!

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కేదారనాథ పర్వత సానువులలో ప్రకృతి

మా కేదార్ నాథ - బదరీ నాథ యాత్ర లో చూచిన ప్రకృతి వర్ణన:

సీ.
నభమంటు శిఖరాలు ప్రభుధామమై 'మంచు/
తలపాగ' తొడిగెను దర్పమొలుక!
పులకాగ్ర మైనట్టి భూరుహమ్ములు నిల్చె/
ముక్కంటికై కయిమోడ్పు లిడుచు!
శిరము నుండెడు గంగ చెంగునన్ దూకంగ/
పాయలై లోయలన్ పాదమంట!
చల్లగాలులు వీచె మెల్లగా నెల్లెడన్
శివ విభూతిని పెంపుజేయ జగతి!
లింగాకృతిన్ దాల్చి లెక్కకు మిక్కిిలై/
ప్రమథులె రాలు రప్పలుగ వరల!

తే. గీ.
ప్రకృతి కేదారనాథుని ప్రాభవమును/
రంగరించెడి ఘనత నంగాంగ మలరు/
వర్ణ సాకల్య చిత్రంపు పరిధి యెంత?
సరస హృదయ చిత్రపట వైశాల్యమంత!

- రాధేశ్యామ్ రుద్రావఝల
03.08.2023
🙏🙏🙏


ఆకాశాన్ని అంటుకుంటున్న శిఖరాలు శివుడి నివాసమైనందుకా అన్నట్టు మంచు తలపాగ తొడిగాయి దర్పంగా..!!
ఆ పులకింతలో శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఆపర్వతాల మీది వృక్షాలు నిట్టనిలువుగా నిలబడి శివుడికి నమస్కరిస్తున్నాయి..!
శిరస్సు మీది గంగ చెంగున దూకి పాయలుగా లోయలలో శివుడి పాదాలను తాకడానికా అన్నట్టు పారుతున్నది.
శివ విభూతిని (విభూతి = భస్మం, ఒక సంపద, ఐశ్వర్యము) విశ్వమంతా వ్యాపింప జేయడానికి అన్నట్టు చల్ల గాలులు మెల్లగా వీచుతున్నాయి.
ప్రమథ గణాలు లింగాకృతిలో (గుండ్రం గా) అసంఖ్యాకంగా రాళ్ళు రప్పలు గా కొలువుతీరాయి.

ప్రకృతి కేదారనాథుని ప్రాభవాన్ని తన అంగాంగములలో రంగరించి ఉన్నట్టి ఆ సంపూర్ణ వర్ణ చిత్రపు పరిథి ఎంత అంటే, మన హృదయంలో ఉన్న కేన్వాసు ఎంత పెద్దగా ఉంటే అంత..!!
మంచు తలపాగ 

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు