కందము .
అరి నికరము చెదరగ ప్రభు/
డురికెను రణమున తఱిగని యురిమి యురవడిన్!
గిరగిర తిరిగెడి-కరమున /
బిరబిరమని కరి యరిగెను భిదురము పగిదిన్!
మొదట వ్రాసినది:
అరి వర్గము చెండగ ప్రభు/
డురికెను రణరంగమందు నురుముచు; పరుగున్/
గిరగిర త్రిప్పుచు తొండము/
బిరబిరమని కరి యరిగెను భీకరలీలన్!
నా పద్యములు..!
నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
12, సెప్టెంబర్ 2024, గురువారం
కరి యురవడి..!
23, ఆగస్టు 2024, శుక్రవారం
శిల్పి
సీ.
నల్ల రాతిని జూచి నారాయణుని రూపు/
దర్శనమును చేయు ద్రష్ట యెవరు ?
గండ శిలల లోన కమనీయ మూర్తిని/
వెలికి తీసినయట్టి వేత్త యెవరు?
ఉలిని తాటించగా హొయలొల్క బండకు/
చలనము కలిగించు సరసు డెవరు?
చూచినంతనె కేలు జోడించు నట్టి ది-
వ్యత రప్ప కొసగిన వరదు డెవరు?
కొండకోనలఁబడి యెండవానల కోర్చు/
బండల కగు నెవరండ దండ?
తే. గీ.
ఒకటి ప్రాకార శిల్పమౌ, నొకటి గడప,
దేవతామూర్తిగ నొకటి సేవలందు-
శిలల భాగ్యవిధాత యౌ శిల్పి యతడు!
ఆ కళావిశారదునకు నంజలింతు!
జలకాలాటలలో..
22, ఆగస్టు 2024, గురువారం
చక్రి..!
కం.
చక్రము త్రిప్పెడు చక్రికి,
చక్రములో నుండి తిరుగు చక్రికి తోడై/
చక్రము సైతము తానై/
సక్రమ మార్గమును జూపు చక్రికి ప్రణతుల్!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
🙏🙏🙏
14, ఆగస్టు 2024, బుధవారం
స్త్రీమూర్తి
9, ఆగస్టు 2024, శుక్రవారం
వృత్తౌచిత్యము: బలి చక్రవర్తి వామనునికి దానమీయుటకు సిద్ధమైన ఘట్టము
7, ఆగస్టు 2024, బుధవారం
గజరాజు సంరంభము - ఫోటోకు పద్యం
17, జూన్ 2024, సోమవారం
జటాయువు
తిరువనంతపురం లో ఉన్న Jatayu Earth's Center Nature Park ను సందర్శించినప్పుడు వ్రాసుకున్న పద్యం ఇది:
సీ.
భీత విహ్వల యైన సీతమ్మ రోదనన్/
విని, ప్రోవ నరుదెంచు వృద్ధ యోధ!
కర్కశత్వమె గాని కరుణ యించుక లేని/
లంకేశు కెదురొడ్డు రట్టు నీది!
యతని శస్త్రపు బల్మి, నాఘాతముల నోర్చి/
ధీరత్వమున పోరు తెగువ నీది!
ముక్కుతో గోళ్ళతో రక్కసు బాధించి/
నిలువరింపగ నెంచు నిష్ఠ నీది!
గీ.
రెక్కలు తెగినేలను పడ్డ పక్కివగుచు/
మోక్ష మందితి శ్రీరాము పుణ్య కరము!
స్త్రీల గౌరవ, రక్షణ చిహ్నమనిన/
నింకెవరు నినుమించగ నిల జటాయు!
— రాధేశ్యామ్ రుద్రావఝల
పై ఫొటో నేను తీసిందే..!
16, జూన్ 2024, ఆదివారం
తల్లి
ఆ. వె.
ఊయలూచి బుగ్గ నొకచిన్న ముద్దిచ్చి/
జోలపాట పాడి జోయనుచును/
కమ్మనైన కథల నమ్మ చెప్ప వినుచు/
హాయి నిదుర జారి నట్టి కొడుక..!
***
నిన్ను ముద్దు చేసి నీ చేష్టల మురిసి/
నిన్ను సాకినట్టి కన్నతల్లి/
పెద్దదైన పిదప ప్రేమను పంచుట/
సుతుడ! నిన్ను గాచు సుకృత మిలను!
మా మాస్టారి సవరణ:
ఆ. వె.
ఊయలూచి బుగ్గ నొకచిన్న ముద్దిచ్చి/
జోలపాట పాడి జోయని నను/
కమ్మనైన మంచికథల కలకనగ/
బుజ్జగించి నిద్ర బుచ్చితీవు!/
***
నన్ను ముద్దు చేసి నా చేష్టల మురిసి/
నన్ను సాకినట్టి కన్నతల్లి/
పెద్దదైన పిదప ప్రేమను పంచెద/
సుతుడనగుచు గాతు సుకృతమెసగ!
10, ఏప్రిల్ 2024, బుధవారం
ఉగాది శుభాకాంక్షలతో:
సీ.
క్రొత్త వత్సరమంచు కుహు కుహూ రవముల/
గండుకోకిల పాడె గళము నెత్తి!
కొమ్మకొమ్మకు నొక్క క్రొత్త చిగురు దాల్చి/
యా రసాలము పట్టె తోరణముల!
తెలిమంచు పరదాలు తొలగించి విరిసి - ము/
స్తాబయ్యె చక్కగా ధరణి భామ!
పూల నెత్తావిని దాలిచి చిరుగాలి/
మెలమెల్ల మేనుల పలుకరించె!
ఆ. వె.
పక్షి వృక్ష తతులు, ప్రకృతి యంతయును వ/
సంతునాగమమున సందడించు/
శుభతరుణ ముగాది సుఖసౌఖ్యముల నిచ్చి/
యెలమి పంచు గాత యెల్లరకును!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
09.04.2024
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
కందము . అరి నికరము చెదరగ ప్రభు/ డురికెను రణమున తఱిగని యురిమి యురవడిన్! గిరగిర తిరిగెడి-కరమున / బిరబిరమని కరి యరిగెను భిదురము పగిదిన్! మొదట...
-
5.3.18 నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకుగాను ఉద్దేశించిన బ్లాగు ఇది..! నా పద్య రచన