శ్రీమద్రామాయణము, బాలకాండ, 18వ సర్గము – శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము
బాల/18/1/ఆటవెలది.
ముగిసె నశ్వమేథమును పుత్రకా మేష్ఠి,
యమరులందె వారి హవ్యములను
దశరథుడు ముదమున తన నగరము జేరె
భృత్య, సైన్య, సతులు వెంటరాగ
బాల/18/2/సీసము.
ఆహూతులైనట్టి యా రాజ ప్రముఖులు
దశరథు చేతసత్కారమంది
మిగుల సంతసులౌచు తగవశిష్ఠునికి, జో
తలజేసి వారి తావులకు చనిరి.
తమ తపోవాటికిన్ తరలిరి ఋష్యశృం
గాదులు మన్నన లంది కొనుచు.
వారి తోడ కొలది దూరము భూజాని
యనుసరించుచు పోయె నాదరమున
ఆ.వె.
యజ్ఞ పరిసమాప్తి యానంద హేతువై
మురిసె దశరథుండు ముసలిరాజు
యాగఫలము పొంద నాతని హృదయము
పుత్రజననమునకు నాత్రపడెను!
బాల/18/3/ఆటవెలది.
ఇట్లు గడిచె నారుఋతువుల కాలము
శుభగలక్షణముల విభవ మంది,
గర్భవతులు రాణి కౌసల్య యు, సుమిత్ర,
కైక వెలిగె వింత కాంతి తోడ!
బాల/18/4/కందము.
మాసము చైత్రము శుభమై,
యాసా దీపముగ దశరథాత్మజుడై యా
కౌసల్యకు జనియించెను
తా సాక్షాద్విష్ణు వవని తరియింపంగన్!
బాల/18/5/ఆటవెలది.
గ్రహము లైదు గొప్ప గతులను నుండ, పు
నర్వసు గల తిథిని నవమి నాడు
రాముడుద్భవించె రవికుల మందున
ముద్దు పట్టి తండ్రి పుణ్యపేటి!
బాల/18/6/ఆటవెలది.
చక్రధారియందు చతురాంశ గలవాని
సద్గుణములరాశి, సత్య ధర్మ
పరుని సాత్వికుండు భరతుని ప్రసవించె
మీనలగ్నమందు చాన కైక!
బాల/18/7/ఆటవెలది.
అన్ని యాయుధముల మిన్నయౌ నేర్పుతో
విష్ణు నంశ తోడ వీర పుత్త్రు
లను సుమిత్ర కనెను లక్ష్మణ శత్రుఘ్ను
లను కవలుగ కర్క లగ్నమందు!
బాల/18/8/కందము.
గుణవంతులు బాలురు వా/
రనురూపులు నొకరికొకరు ననురాగమతుల్!
మనముల నాదరమొప్పుచు,
వినయము గాంభీర్యము లను విక్రములౌచున్!
బాల/18/9/ఉత్కళిక.
సకల జగన్నాథుడతడు/
సకలలోక పూజ్యుడతడు!
జననమందు శుభతరుణము/
జనుల కెంత మోదకరము!
ముకుళిత కర యుగళి సురలు/
వికసిత ముఖు లౌచు విరుల/
వర్షము కురిపించె పుడమి/
హర్షమునుత్సాహ గరిమ!
బాల/18/10/ఉత్పలమాల:
మ్రోగెను దేవదుందుభులు భూమి నభంబులు పిక్కటిల్లగా,
రాగ ప్రవాహముల్ చెలఁగ శ్రావ్య సుధల్ విన కర్ణపేయమై,
సాగగ కిన్నెరాంగనల చాలనముల్ కడు రమ్యరీతులై
మూగి రయోధ్యవాసు లతి మోదము నందుచు రాజవీథులన్!
బాల/18/11/తేటగీతి.
ఉత్సవములను జేసి
యయోధ్య పురము/
నన్న సంతర్పణములను
నచటి ప్రజకు/
విప్రవరులకు గోవుల
వేలకొలది/
భూరి దక్షిణలిచ్చెను
భూవరుండు/
సూత, మాగధ, వందులు
సొలఁపు మీఱ/
శ్రీమద్రామాయణము, బాలకాండ, 18వ సర్గము - రామచంద్రాదుల గుణశీల వర్ణనము, విశ్వామిత్రుని రాక.
బాల/18/12/వచనము.
తదుపరి పదియునొక్క దినములకు నమిత సంతుష్టాంతరంగుడైన దశరథ భూజాని వశిష్ఠాది ముని ముఖ్యుల ఆధ్వర్యవమున, పుర ప్రముఖుల సమక్షమున రత్నముల వంటి తన నలువురు పుత్త్రులకును జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయనాది సంస్కారములన్నియు యథావిధిగ జేసెను. దిన దిన ప్రవర్థమానులగు నా రాజకుమారులెట్టివారనిన:
బాల/18/13/కందము.
అందరు సద్గుణ శోభితు/
లందరునై వేదవేత్తలందరు శూరుల్!
అందరు జ్ఞాన సమున్నతు/
లందరు సౌశీల్యవంతు లా రాజసుతుల్
బాల/18/14/కందము.
మిన్నగనందరిలో తా/
నన్నిట మేటిగను గుణము నాదర్శములన్/
మన్ననలందుచు రాముడు/
పన్నుగ పుర జనుల ప్రీతి పాత్రుండయ్యెన్!
బాల/18/15/మత్తకోకిల.
నిండుపున్నమి నాటి రేయిని నిర్మలమ్మగు నింగినిన్/పండువెన్నెల చిందు చంద్రుని వన్నెఁ బోలెడు మోమునన్/
గండుతుమ్మెద బారులౌ యలకల్లలాడగ గాంచగన్/
పండువౌ కనుదోయికిన్ మన బాలరాముని యందమున్!
బాల/18/16/సీసము
ప్రేమమీరగ తమ పెద్దన్న రాముని/
యమిత స్నేహము తోడ నాదరించి/
సోదరు ప్రీతికై కాదనకుండగా/
తనువునిచ్చెడు గొప్ప త్యాగమూర్తి!
అనవరతము నన్న ననుసరించెడు సర్వ/
లక్షణయుతుడగు లక్ష్మణుండు/
రామానుజునిగ సార్థకనామమును పొందె!
భ్రాతృ ప్రేమకును తార్కాణమాయె
ఆ.వె.
అన్న రామునికిని యనుజుడన్నను ప్రాణ/
మతడు లేక నన్న మితడు తినడు!
ఇతని తోడులేక నతడు పరుండడు!
తనువులవియె వేరు మనసులొకటి.
బాల/18/17/ఆటవెలది.
భరతు నీడవోలె చరియించు శత్రుఘ్ను/
డన్న ప్రేమపొందె నాదరమున!
నిట్లు సుతుల చెలిమి యెలమిని కలిగింప/
తన్మయతను పొందె దశరథుండు.
బాల/18/18/ఆటవెలది.
రాముడు గజ తురగ రథముల పైనుండి/
పోరు సల్పు మేటి వీరు డతడు/
బాణ చాలనమున పరమ యోధుడతడు!
తండ్రిమాటను జవ దాటడెపుడు!
బాల/18/19/ఆటవెలది.
దశరథుడు పురోహిత సచివ గణము/
పిలిచి తనసుతులకు పెండ్లి సేయు/
మంతనంబునున్న యంతట వచ్చెను/
గాధిరాజ సుతుడు కౌశికుండు.
శ్రీమద్రామాయణము, బాలకాండ, 19వ సర్గము - యాగసంరక్షణమునకై రాముని పంపమని విశ్వామిత్రుడు దశరథుని యర్థించుట.
బాల/19/1/సీసము
రాజర్షి కెదురేగి రాజు దశరథుడు/
చేతులు జోడించి శిరము వంచి/
భక్తిప్రపత్తుల ప్రణమిల్లె మౌనికి/
నర్ఘ్యపాద్యములిచ్చి యాదరమున/
వినయశీలి యగుచు విప్రులు గురువులు/
వెంటరాగను సభా మంటపమున/
కాతని తోడ్కొని యాగమించె నృపతి/
పులకితగాత్రుడై పుణ్యమూర్తి!
ఆ.వె.
సముచితాసనమున సంయమి కూర్చుండ/
సావధానుడగుచు సమ్ముఖమున/
దశరథుండు నిలిచె, తపసి విశ్వామిత్రు/
డమిత సంతసంబు ననియె నిట్లు.
బాల/19/2/శార్దూలము
రాజా! నీదు కుటుంబమున్, ప్రజలు నీ రాజ్యంబునన్ క్షేమమే?
భూజానీ! ధనధాన్యముల్ కలిమి పెంపొందెం గదా కోశమున్?
యాజుల్ సాగెనె వైదికాన్వయములై?యాజ్ఞాను సారంబుగా,
రాజుల్ కప్పములిచ్చి నీ బల పరాక్రాంతిన్ సదా బద్ధులే?
బాల/19/3/వచనము
అనుచు కుశలమడిగిన విశ్వామిత్రునితో నయోధ్యాపతి యిట్లనియె.
బాల/19/4/ఆటవెలది.
పుత్త్రహీనునకును పుత్త్రోదయమువోలె/
పదను టెండను జడి వానవోలె/
పోయి దొరికినట్టి భోగభాగ్యమ్ములే/
నీదు రాక మాకు నిర్మలాత్మ!
బాల/19/5/ఉత్సాహము
ఓ మహర్షి నీదు రాక యొప్పె నమృత వృష్టి యై/
నామనస్సు నిండె నేడు నలువ గాంచినట్లుగన్/
స్వామి మీకు స్వాగతమ్ము వచ్చుకార్యమేమియో/
తాము తెలిపినంత చేసె దను మహాత్మ చెప్పవే!
బాల/19/6/వచనము
దశరథుని పలుకులు విని యమితసంతుష్టాంతరంగుడైన కౌశికుండిట్లనియె:
బాల/19/7/ఆటవెలది.
భవ్యవంశమందు ప్రభవించి యోరాజ/
ముని వశిష్ఠ గురుని బోధ వినెడు/
నీదు బోంట్ల పలుకు వాదు లేకుండగా/
తేటయౌను పొల్లు మాట లేక.
బాల/19/8/ఆటవెలది.
మనసు నున్న కార్య మనుపమ గుణధామ!
తెలుపుచుంటి నీకు ధీరసాంద్ర!
కూర్మినాదుమాట కోసలేంద్ర వినవె/
యాడి తప్పకుండ నాచరింపు!
బాల/19/9/శార్దూలము.
యాగంబొక్కటి చేయనెంచితి జగం బాశ్వాసమున్ పొందగన్/
రేగెన్ తాటక పుత్త్ర దౌష్ట్యములు; మారీచాదు లారక్కసుల్/
సాగన్నీయరు యాజి, హోత్రమున వ్రేల్చన్ రక్తమాంసాదులన్/
వేగంబిర్వురి ద్రుంచ గావలె మహా వీరుండు నాకొక్కడున్!
బాల/19/10/ఉత్పలమాల.
తేకువ కల్గి పోరు నతి ధీమసమున్ రిపు దుర్నిరీక్ష్యమౌ/
వీఁకను జూపి యా ఖలుల పీచమణంగగ జేయగా తగన్/
నీకొడు కైన రాము డవనీస్థలి నుండెడు మేటి యోధుడై/
నాకతి ప్రీతిపాత్రుడయి నామనమందున నిల్చె భూవరా!
బాల/19/11/శార్దూలము.
బాలుండీతడు కార్యమెంతటిది యబ్భారంబు సైరింపగా/
జాలండోయను శంకలన్విడిచి యా శామిత్రముం నిల్పగన్/
గూలంజేయును రాక్షసాధముల సంకోచంబు లేకుండగన్/
కేలన్ విల్లును బట్టి పోర నితనిన్ గెల్వంగ వే సాధ్యమే?
బాల/19/12/చంపకమాల.
కొడుకనిముద్దుగుఱ్ఱయని కోమలుడే యని యెంచబోకుమీ!/
బడలిక తాళలేడనుచు వాని బలమ్మును విస్మరింపకే/
విడిచిన నాకడన్ యశము విశ్వము నిండి ప్రకాశమొందెడిన్/
తడబడకుండ యో దశరథా! ముదమారగ రామునంపుమా!
బాల/19/13/కందము.
పది దినములు సాగు సవన/
మది కావగ పంపు నీదు నాత్మజు నాతో/
మది కలవరమందక దశ/
రథ నీకగు క్షేమము రఘురాముకు కీర్తిన్!
బాల/19/14/వచనము
ఇట్లు ధర్మసమ్మతముగా పలికి ధర్మాత్ముడునూ, నపారతేజోసంపన్నుడునూ నైన విశ్వామిత్రుడు
దశరథ మహారాజు నర్థించి యూరకుండెను.
బాల/19/15/ఆటవెలది
మునిపలుకులు వినిన భూవరునికి, కాళ్ళ/
క్రింది భూమి తల్ల క్రిందులాయె!
వణుకు బుట్టె, నతని వాక్కు తడబడెను,
చింత తోడ మదియె చీకటాయె.
సృష్టి
యంతయు పెను చీకటాయె!
శ్రీమద్రామాయణము, బాలకాండము, ఇరువదియవసర్గము - దశరథుడు రాముని తనతో పంపననుటచే విశ్వామిత్రుడు కోపించుట:
బాల/20/1/వచనము
యాగ సంరక్షణకు రాముని తనతో పంపమని దశరథుని విశ్వామిత్రుం డడిగినయంత, పుత్త్రవియోగమను నూహ యశనిపాతమై దశరథుడు దుఃఖితుడాయెను.
బాల/20/2/ఆటవెలది
దీనవదనుడౌచు దినమణి కులజుండు/
మౌని పలుకు లెల్ల మదిని దలచి/
మాట నిలువ లేక మడమ త్రిప్పగలేక/
రామునంపగాను రంధి పడుచు
బాల/20/3/సీసము
రాజీవ నేత్రుండు రఘుకుల దీపంబు/
పదియారు ప్రాయంపు వన్నెకాడు/
విలువిద్య నందున మెలకువల్ నేర్వంగ/
నభ్యాసమున్ జేయు నర్భుఁడితడు/
రాక్షసులనెదిర్చి రణమును సల్పగ/
సరియగు వ్యూహము లెరుగడితడు/
వారిమాయాయుద్ధ వైఖరి నోర్చెడు/
శస్త్రాస్త్ర విద్యా కుశలత లేదు!
ఆ.వె.
లేకలేక గలిగె, లేలేతబాలుండు/
రాముఁడితడు నాకు ప్రాణ సముడె/
యెట్లు పంపనేర్తు నెరిగియు నాపద/
తండ్రి మనసు నాది తల్లడిల్లు!
బాల/20/4/ఆటవెలది
నాకు కడిమి ప్రియుడు నల్వురు సుతులను,
పెద్దకొడుకు గాన విమలచరిత!
వాని విడిచి క్షణము నేనిట మనలేను/
రాము నంపు టెట్లు రాజమౌని!
బాల/20/5/ఆటవెలది
అనఘ! చిత్తగింపు, మక్షౌహిణీ సైన్య
బలముకలదు నాకు, ప్రభుడ నేను/
వారిగూడివచ్చి పోరు సల్పెదనయ్య/
రయముగ నణచుటకు రాక్షసులను!
బాల/20/6/ఆటవెలది
ప్రాణమున్నవరకు, రాజర్షి! నామేన/
విల్లుచేతబట్టి, విఘ్నములను/
కలుగజేయు నసుర గణముల నిర్జించి/
సవము గావగ నను సమ్మతించు!
బాల/20/7/ఉత్పలమాల
ఎవ్వరు వారు రక్కసులొ, యెక్కడ నుండెను వారి స్థావరం/
బెవ్వరు వారలన్ నడుపు? నెవ్వరు వారికి నాయకుండు వా/
రెవ్వరి ప్రాపునన్ గదిసి యింత యకృత్యముఁ జేయనెంచిరో/
క్రొవ్విన వారలన్ తెలుపు క్రూరుల ద్రుంచి సవంబు కాచెదన్!
బాల/20/8/వచనము
అని దశరథుండు విశ్వామిత్రుని ప్రశ్నించగా నమ్ముని యిట్లనెను:
బాల/20/9/సీసము
పౌలస్త్యు వంశాన ప్రభవించిన యొకండు
రావణబ్రహ్మ నాఁ రక్కసుండు,
పరమేష్ఠి మెప్పించి నరులఁ దక్క, పరుల
వలన హతుఁడు కాని వరము పొందె!
గొప్ప యోధుడతడు కూర్చి యసురసైన్య/
ములనడిపించి త్రిభువనములను,
బ్రహ్మ వరబల గర్వాంధుడై పీడించె/
నతని యాగడముల కంతులేదు.
ఆ.వె.
విశ్రవసునిసుతుడు భీకర తేజుండు/
ధనదునికిని సొంత తమ్ముడతడు/
పంక్తి శిరుడు, ప్రాభవమున లంకేశుడు/
రాక్షసాధిపుండు రావణుండు!
బాల/20/10/ఆ.వె
యాగములను తానె యాటంక పరచగ
చిన్న పనియనుచునొ, చేవ చూప,
ప్రేరణమున పంపు మారీచుని సుబాహు
ని విలయమును జేయ సవనమందు!
బాల/20/11/సీసము
అనుచు పలికినంత నామహర్షినిగని
తత్తరపాటున దశరథుడనె,
రణమునా ధూర్తుని ప్రతిఘటింపగలేను
నిలువరింపగ తగు బలము లేదు!
ఆజ్ఞానువర్తినై యాన చెల్లింపగా
నోచని భాగ్య హీనుండ నేను!
గురుదేవుడవు మాకు, కురిపించి కరుణను
రాముకనికరించ రావె దేవ?
తేటగీతి.
సురలు, దైత్య గంధర్వ యక్షులు, ఖగపతి,
నాగు లాదిగా గల యోధు లాగలేరు/
రావణునినెదిరింపగా, రణమునందు/
నిల్వలేను నేనైనను గెల్వలేను!
పసియగు రఘురాముని నెట్లు పంపగలను?
బాల/20/12/ఆటవెలది
మఖము విఘ్నపరచు మారీచుడు
సుబాహు/
డమిత శక్తిపరులు యముని సములు/
చూడ కన్నవారు సుందోపసుందులు/
వారికంటె దలప వీరు ఘనులు!
బాల/20/13/ఆటవెలది
నేను నాదు సుతులు సేనయొక్కటి యైన/
గాని గెలువలేము గాధి సుతుఁడ!
కదన రంగమునను కాకలు దీఱిన/
వారి కడకు రాము బంపలేను!
బాల/20/14/ఆటవెలది
యుద్ధవిద్యలందు ‘నోనమాలను’ దిద్దు
ముద్దు బాలుడితడు మునివరేణ్య!
వారి నెదిరి పోర ఘోర సంగరమున
పంప రాము నాకు వశము కాదు!
బాల/20/15/వచనము
దశరథుడీమాట చెప్పగా విని యా మునిశ్రేష్ఠుండును, కుశిక వంశోద్భవుడును నగు విశ్వామిత్రుం డాజ్యాహుతిని ప్రజ్వరిల్లిన యగ్నికుండము వలె, మండిపడెను.
గురుదేవులు శ్రీ రామరాయ మహోదయులకు వందన శతములూ, ధన్యవాదములతో..
- రాధేశ్యామ్ రుద్రావఝల
18.06.2020
****************************
శ్రీమద్రామాయణము, బాలకాండము, ఇరువదియొకటవ సర్గము – రాముని విశ్వామిత్రునితో పంపుటకై వశిష్ఠుడు దశరథుని యొప్పించుట:
బాల/21/1/ఉత్పలమాల:
దోషిగ నిల్చెనా దశరథుండు ప్రతిజ్ఞను వమ్ము చేయగన్/
తోషిత మౌని సత్తముడు దోషము నోర్వగ లేక క్రుద్ధుడై
భీషణుడై సభాస్థలిని వీడగ లేచెను కంపదేహుడై/
దూషితమానసంబునను తోకను త్రొక్కిన త్రాచువోలె ను/
క్రోషము పొంగగా నతడు, రోష కషాయిత నేత్రు, డిట్లనెన్.
బాల/21/2/చంపకమాల:
ఒడికమిదేనొ? మీ రఘు కులోద్భవులెన్నడు బాస తప్పిరే?
యడిగిన దానినిత్తునని యాడినమాటకు కట్టుబడకనే
విడువగ మంచు నన్నిటుల వేడుట నీకిది పాడియౌనొకో?
బడయుము కీర్తియున్, సుఖము, భద్రము నీవిక నీజనంబుతోన్!
బాల/21/3/వచనము
జ్ఞానవంతుండైన విశ్వామిత్రమునీంద్రుడు కుపితుడై లేచిన యంత భూమి కంపించెను! సురలు భయాస్పదులై గడగడ వణికిరి..! అంతట నిట్టి యుత్పాతములకుఁ గారణంబు గ్రహించిన రఘుకులాచార్యవర్యుడును, పరమ నిష్ఠాగరిష్ఠుడును, మునిశ్రేష్ఠుడును నైన వశిష్ఠుడు దశరథునితో నిట్లనియె:
బాల/21/4/సీసము.
ఇనకులమందున జనియించి జనపాల
మూసపోసిన ధర్మ మూర్తివీవు!
ధైర్యవంతుడవు, సత్య పరిపాలనమున/
సురలకు దీటైన సువ్రతుడవు!
దేవతలకు సరి ధీరత్వమును జూపి/
యసురతతులను చెండాడినావు!
ధర్మాత్ముడవనుచు త్రైలోక్య పూజితు/
డవగు నీవు స్వధర్మ మాచరించు!
ఆ.వె.
ఆడితప్పువాని కాదరముండదు,
చేయు పుణ్యమంత చెదరిపోవు!
పాపమార్గమందు పయనించి రాజేంద్ర,
చెడి యధర్మ మీవు చేయబోకు!
బాల/21/5/ఆటవెలది
సంతసమునఁబంపు సంయమి తోడ, నీ/
పుత్త్రు రాము నింక మోహపడక!
మరియు బెంగవలదు మౌని తోడుండగా/
నెట్టి యాపదైన ముట్టబోదు!
బాల/21/6/ఆటవెలది
అండ నస్త్రవిద్యలుండిన లేకున్న
మౌని యండ యుండ మనకు చాలు!
నగ్ని నున్న యట్టి యమృత భాండము వోలె
రాముడుండు కడు సురక్షితునిగ!
బాల/21/7/వచనము
మఱియు నీ విశ్వామిత్రుని గొప్పదనమదెట్టిదన:
బాల/21/8/కందము
ఆకృతిదాల్చిన ధర్మము/
లోకమునం గలతపసులలోశ్రేష్ఠుండై/
వీఁకను కౌశికుడు ఘనుడు/
తేఁకువనందరిని మించె తేజంబొప్పన్!
బాల/21/9/సీసము
అస్త్ర శస్త్రములన నరచేతి యుసిరిక
లట్టి విద్యలజగజ్జెట్టి యితడు
బుద్ధియందున మేటి భూతలమందున
తపమున మౌనిసత్తముడితండు
సురలు, గంధర్వ యసుర ముని కిన్నర
పన్నగాదు లితని ప్రాభవమది
యింతనితెలియలే, రింతటి మహితుండు
పుట్టలేదుమరిక పుట్టబోడు!
ఆ.వె.
సృష్టికి ప్రతి సృష్టిచేసినబ్రహ్మర్షి/
అస్త్రశస్త్రములకు నాటపట్టు!
జ్ఞాని, జగతికొసగె గాయత్రి మంత్రము
తపసిగణములందు దార్శనికుడు!
బాల/21/10/ఆటవెలది
ప్రభువుఁజేసి రాజ్య పాలనసేయగా/
నిచ్చె కౌశికునకు మెచ్చి శివుడు/
నల భృశాశ్వుని సుతు లస్త్రరూపుల, నప్డు/
ధారబోసెను తదపార కరుణ!
బాల/21/11/ఆటవెలది
తనయు లైరి వారు దక్షుని కూఁతుల
పలు తెరఁగుల రూపు బడయగలరు!
పరమశూరులు ప్రతిభాభాసమానులు,
జయము నిత్తురు కడు శక్తియుతులు!
బాల/21/12/వచనము
“తొల్లి దక్షప్రజాపతికి జయ, సుప్రభ యను నామములుగల యిరువురు పుత్త్రికలుండగా, జయకు నసురవధనిమిత్తమై ప్రభావాతిశయము కలిగి కామరూపులౌ నేబది మంది పుత్త్రులును, సుప్రభకు సంహారులను పేరుతో నజేయులును, అమోఘ బలసంపన్నులునునగు నేబది మంది కుమారులను పొందగా, యీ విశ్వామిత్రుఁ డా యస్త్రములన్నిటిని ప్రయోగ ఉపసంహారములతోగూడనెరిగినవాడై క్రొత్త యస్త్రములనుఁ గల్పింపసమర్థుడై యుండెను. అంతియగాక, గొప్ప పరాక్రమవంతుడై, యా రక్కసులను తానే స్వయముగ నిగ్రహింప సమర్థుడయ్యు, నిన్నును, నీ పుత్త్రునికిని మేలు చేయబూని యిట్లు వచ్చెనని గ్రహింపు” మనుచు, ఇంకను నిట్లు పలికెను.
బాల/21/13/ఆటవెలది
సకలధర్మవిదుడు సర్వజ్ఞు డీమౌని/
విశ్వమంత కీర్తి వెలుగు వాడు /
నంత మేటి నిన్ను యాచింపగావచ్చె/
నర్థి కాదతండె యర్థదాత!
బాల/21/14/తేటగీతి
మహితు డిట్టి విశ్వామిత్రు మాట మేర/
యాగరక్షణసేయగ నాత్మజు రఘు/
రామునంపగదే దశరథ! శుభమగు/
నీకు, రామునికిని నమ్ము నిశ్చయమ్ము!
బాల/21/15/వచనము
తమకులగురువు, వశిష్ఠుండిట్లన వినిన దశరథమహారాజు మిగుల సంతసమునొందినవాడై, హృదయముప్పొంగగా శ్రీరాముని యాగరక్షణకై విశ్వామిత్రునితో పంపుటకంగీకరించెను.
శ్రీమద్రామాయణము, బాలకాండము, ఇరువదిరెండవ సర్గము – దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట:
బాల/22/1/కందము
వినయము కలిగి దశరథుడు/
మునిపలుకుల నాలకించి ముదమును పొందెన్/
తన మనమున శంకలు చెద/
రినవంచు వసిష్ఠ గురువరేణ్యున కెరగెన్!
బాల/22/2/కందము
ఆముని కౌశికు వెంటను/
స్తోమము గావగ ఘనుండు సూర్యాన్వయుడౌ/
రాముని పిలువగ నంపెను /
ప్రేమముతో, గవనికాపరిని శీఘ్రముగన్!
బాల/22/3/ఆటవెలది
తండ్రి పిలుపునంది తమ్ముడు సౌమిత్రి/
వెంట రాగ వచ్చె వీర వరుడు,
సత్య ధర్మ పరుడు, సౌశీల్య మూర్తి, ప/
రాక్రముండగు రఘు రాముడపుడు!
బాల/22/4/ఆటవెలది
తండ్రి దశరథుండు తల్లి కౌసల్య, సు/
మిత్ర కైక ప్రేమ మీర, శిరము/
మూర్కొని రఘు రాము ముద్దాడి దీవించె!
స్వస్తి వచనములను పలికె గురువు!
బాల/22/5/ఆటవెలది
మురిపెమొప్ప, మెరయ మోమున చిరునవ్వు /
మదిని కలవరంబు మాపుజేసి/
దశరథుండు భక్తి దాశరథిని మౌని/
కప్పగించె నతడు హర్షమంద!
బాల/22/6/సీసము
అంత విశ్వామిత్రు డెంతొ సంతుష్టుడై/
కోదండ రాము సమాదరించె/
శుభసూచకముగాను శుద్ధమౌ చల్లని/
పవనము తెచ్చెను పరిమళముల/
పుష్పవృష్టి కురిసెపుడమిని యప్పుడు/
దేవదుందుభులట మ్రోవుచుండ/
నరగు యా కౌశికుననుసరించి వెనుక/
ధానుష్కు లైయన్న దమ్ములు చనె/
తేటగీతి.
సరవి రాముడువెడలెలక్ష్మణుని కూడి/
బ్రహ్మ వెనుకగ నశ్వినుల్వలెను చెలఁగ/
నిరుభుజములను దాల్చిన శరనిధులను/
మూడు శిరముల పాముల పోలి నట్లు!
బాల/22/7/తేటగీతి
ఉడుము చర్మము కరముల తొడుగు గట్టి/
ఖడ్గ ధారులై యస్తోక కాంతి యొప్ప/
సోదరులు, రాజ పుత్త్రులు శోభ కలిగి/
సద్గుణములు భాసిల్లగ సంయమి పథ/
మనుసరించెను శ్రీరాము డనుజుడంత!
బాల/22/8/వచనము
అట్లు నూత్నయౌవనులగు రామలక్ష్మణులెట్టి దోషమును లేక నా విశ్వామిత్రుని వెంటపోవుట, యచింత్యప్రభావుడైన యీశ్వరుని యనుసరించి ప్రకాశించు నగ్నియందు బుట్టిన స్కంధ, విశాఖులవోలె నొప్పారుచుండెను. ఇవ్విధంబుగా వారొకటిన్నర యోజనముల దూరము పయనించి సరయూనది దక్షిణ తటికింజేరిన పిమ్మట విశ్వామిత్రుం డాదరమున నిట్లనెను:
బాల/22/9/సీసము
రామా! యనుచుఁ బిల్చి ప్రేమతో కౌశికు/
డాచమనమొనర్చుడని, బల యతి/
బల యను పెను మంత్రములుపదేశింతును,
గ్రక్కున వానిని గ్రహణ జేయ/
కలుగదు నిద్రయు, నలసట, రోగము/
చేరవు దరికిని చెడదు రూపు!
నిద్రనున్ననుగాని నీకు నిశాచర/
భయములేకుండును వత్స యనెను!
తేటగీతి.
మరియు నీ రెండు విద్యల మనన జేయ
భుజ బలమునందు, నిను మించు పోరుబంటు
భూమి పైనుండడింకపై పుట్టబోడు
నైపుణిని, బుద్ధి కుశలత, రూపమందు
తేజరిల్లు నీ శౌర్యము తిరుగులేక!
బాల/22/10/వచనము
ఇట్లు వచించిన విశ్వామిత్ర మహర్షికి రామచంద్రుడు వందనమొనర్చి పవిత్ర సరయూనదీ జలములతో నాచమనము చేసి శుచియై భక్తిప్రపత్తులతోడ బల యతిబల విద్యలను గ్రహించినంత.
బాల/22/11/ఆటవెలది
అమిత శౌర్యవంతు డా రామ చంద్రుడు
బలయతిబల మంత్ర ప్రాభవమున/
శరదృతువున నుండు శతసహస్రకిరణ/
భాసమాన సూర్యు పగిదియొప్పె!
బాల/22/12/తేటగీతి
గురువు పదముల నొత్తుచు కూర్మి తోడ/
రామచంద్రుడు సేవించె రాణ్మునివరు/
విసరె సౌమిత్రి మెల్లగ వీవెనలట/
మౌని లాలింపు పలుకులు మైమరపున/
వినుచు దర్భల పరచుక విశ్రమింప
గడగి రారాత్రి మువ్వురు బడలికవిడ/
- రాధేశ్యామ్ రుద్రావఝల
02.07.2020
శ్రీమద్రామాయణము, బాలకాండము, ఇరువది మూడవ సర్గము, రామలక్ష్మణసమేతుడై విశ్వామిత్రుడు కామాశ్రమమున రాత్రి విశ్రమించుట
బాల/23/1/వచనము
సరయూ నదీతటమునఁ బ్రసన్నతాసుధ లొలికెడు మోముతో నిదురించుచున్న రామచంద్రుని యందమును జూచి గర్వభంగమై సుధాకరుడు క్రుంగి యస్తాద్రి వెనుక దాగెను.
బాల/23/2/ఉత్పలమాల.
మచ్చిక కల్గగా మలయ మారుతముల్ సడి లేక వీవగన్/
రచ్చగొనంగె నల్కలు రరాటము నాడగ తేటిగుంపులై /
విచ్చిన నల్లకల్వ యనిపించెడు రాముని మోము చూచి తా/
వచ్చెను వేళదాటెనని భాస్కరు డంతట సంభ్రమాత్ముడై!
బాల/23/3/ఆటవెలది
ధవళ సైకతమున తమ్ముడు తోడుగ/
పవ్వళించు నీల వర్ణు రాము,
పాల్కడలిని శేష పాన్పున శయనించు/
శ్రీపతిగ తలంచి తాపసి గనె!
బాల/23/4/వచనము
ముద్దులు మూటగట్టినట్లున్న శ్రీరాముని జూచుచు పరవశుడైన విశ్వామిత్రుడు ప్రేమతో రాముని మేల్కొలుపఁ దలంచి యిట్లనెను.
బాల/23/5/ఆటవెలది
కనులు తెరవు మయ్య, కౌసల్య కన్నట్టి/
ముద్దు బిడ్డ! రామ, ప్రొద్దు పొడిచె/
పురుష సింహ! లెమ్మ! పూర్వాహ్ణ కర్మల/
నాచరించు మినకులాబ్ధి సోమ!
బాల/23/6/ఆటవెలది
మౌని పలికినట్టి మధురమౌ వాక్కుల/
వినగ మేల్కొని కడు వినయశీలు/
రన్నదమ్ములు ముని నర్జించి స్నానము
లాచరించి రవికి నర్ఘ్యమిడిరి!
బాల/23/7/ తేటగీతి.
నూతనోత్సాహమును కల్గి చేతనమున/
రాజ సుతులునుద్యుక్తులై, రాణ్ముని పద/
ములకు మ్రొక్కుచు మౌనితో ముందుకేగ/
సంతసము తోడ నిలిచిరి సరయు తటిని!
బాల/23/8/ఆటవెలది
పయనమైరి వారు రయమున మునితోడ/
ప్రకృతి శోభ గనుచు పరవశించి,
సరయు నదియు గంగ సంగమమౌనట్టి/
స్థలము గాంచిరి కడు తన్మయతను!
బాల/23/9/ తేటగీతి.
నదుల సంగమ స్థలమున సదమలమతు/
లౌచు రామలక్ష్మణులట నాశ్రమంబు/
నొకటి గాంచుచు ప్రణమిల్లి యుత్సుకతను/
నమ్మునివరుని జూచుచు నడిగి రిట్లు.
బాల/23/10/కందము
ఎవ్వరిదీ యాశ్రమ మిట/
నెవ్వరొయా పుణ్యపురుషు డెవ్వరికొరకై/
యివ్వల తపమును జేసెనొ/
యవ్వాని కథ నెరిగింపు మయ్యా దయతో!
బాల/23/11/వచనము
అంత రామలక్ష్మణులను గాంచి ప్రసన్న వదనుడైయావిశ్వామిత్ర ముని యచట తపమాచరించుచున్న మునీశ్వరులకు వందన మిడి కామాశ్రమగాథనిట్లుదెల్పె.
బాల/23/12/సీసము
సుందర దేహుండు కందర్పు డనువాడు/
కాముడనెడు గౌణ నామ మంది/
నిరతము తపమున నిష్ఠన్నిమగ్నుడౌ/
శర్వుని నెదిరించె గర్వితమతి/
నంత స్థాణువు జూడ నాగ్రహ జ్వాలల,
కాలి బూడిద యయ్యె కాముడపుడు/
శివుని శాపవశాన చిత్రముగ ననంగు/
డయ్యె నిటను గాన నంగ దేశ/
తేటగీతి.
మనిరి, యీ తపో వాటి, కామాశ్రమమని/
వాసికెక్కె! నిట తపము చేసె హరుడు/
నతి పవిత్ర మీ స్థలి! గాన నఘము బొంద/
రీ మునివరులు శిష్యులై యీశ్వరునకు!
బాల/23/14/వచనము
మరియు నిట్లనె:
బాల/23/15/కందము
గంగా సరయూ నదులకు/
సంగమ మలరారుచుండ సంయమి జన స/
త్సంగతి నుందుము రాత్రి వి/
నంగను బహు పుణ్య కథల నరవర రామా!
బాల/23/16/ఆటవెలది
తెలిసి వీరిరాక నల మౌని గణములు/
సంతసమ్మునంది చెంతకేగి/
రాణ్మునికిని మరియు రాజ సుతులకును/
స్వాగతమని సాధు వాదమిడిరి!
బాల/23/17/వచనము
అంతనా మునులందరును మొదట విశ్వామిత్రున కర్ఘ్యపాద్యాద్యుపచారములతో సేవించి, పిమ్మట రఘువీరులకును నట్లే యతిథిమర్యాదలఁ గావింప విశ్వామిత్రుడు నమ్మునిగణములను కుశలమడిగెను. వారును పలు పురాణగాథలను విశ్వామిత్ర రామలక్ష్మణులకు వినిపించిన యంత వారందరు నమితాహ్లాదాంతరంగులై యేకాగ్రచిత్తముతో సాయంసంధ్యోపాసనా విధులనొనర్చి స్థానికులగు యాశ్రమవాసులతో గూడి కామాశ్రమము చేరి యారాత్రికి నచటనే విశ్రమించిరి.
- రాధేశ్యామ్ రుద్రావఝల
19.07.2020
శ్రీమద్రామాయణము, బాలకాండము, ఇరువది యైదవ సర్గము, తాటకా వృత్తాంతము
బాల/25/1/తేటగీతి.
అప్రమేయప్రభావుడౌ యామునిఁ గని/
పురుష తల్లజుడు రఘురాము డిటులడిగె/
వింటి మునుపు యక్షులు నల్ప వీర్యు లౌదు/
రని మునీంద్ర చెపుమ! తాను యక్షిణి కద!/
యింత బలమది తాటక కెట్లు
గలిగె?
బాల/25/2/వచనము:
అనిన గాధిరాజ సుతుడు మిగుల సంతసమందుచు నా కథను తెలిపెద, సావధాన చిత్తుడవై యాలకింపు మని యిట్లు చెప్పెను:
బాల/25/3/తేటగీతి.
యక్షుడొకడుండెను సుకేతు, డమిత శక్తి/
యుతుడు, సంతుకోరి తపము నతడు చేసె/
మెచ్చి యా తపమును బ్రహ్మ యిచ్చె వరము/
దాన పొందె సుకేతుడు దీని సుతగ/
వరబలమున తాటక కింత బలము కలిగె!
బాల/25/4/తేటగీతి.
వేయి యేన్గుల బల, మప్ర మేయ రూప/
యౌవనములను పొందగ నామె తండ్రి/
పెండ్లి చేసె సుందుడనెడు వీరు తోడ/
వారి సుతుడు మారీచుడు పరమ నీచు/
డట్టి శాపవశమ్మున నసుర యయ్యె
బాల/25/5/తేటగీతి.
ముని యగస్త్యుడీయగ శాపము, మరణించె/
సుందు, డదివిని తాటక సుతుని తోడ/
మునిని చంప బోయెను క్రోధము నను నప్డు/
శాపమిచ్చెను దాని రాక్షస వనితగ/
నతిభ యంకర రూపము నందు మనుచు!
బాల/25/6/తేటగీతి.
శాపఫలమున ఘోరమౌ రూప మంది/యమ్మ హాముని కించుక హాని చేయ/
శక్తి లేకనె యీప్రదేశమును జొచ్చి/
పాడుబెట్టెను సుతునితో గూడి యిపుడు!
బాల/25/7/సీసము
క్రూరత్వమంతయు రూపుకట్టినయట్లు/
తాటకా రక్కసి తనరు చుండు!
దుర్మార్గురాలును దుష్ట శక్తి గలుగు/
నిట్టి పాతకికి లేరెవరును సరి!
రాజ పుత్రులకు కర్తవ్యమౌ దుష్టశి/
క్షణ సేయ దీనిని సంహరింప!
గోబ్రాహ్మణ హితము కోరి దీనినిఁ జంప/
పాపమంటదు రామ! పావనాత్మ!
తేటగీతి.
నరుల భక్షించు దీనిపై కరుణ వలదు!
నీవుదక్క పరులు చంప నేర్వలేరు!
స్త్రీయనుచు శంకను విడిచి తీక్ష్ణ బాణ/
ధాటి వధియించు తాటకన్ తత్క్షణమ్మె!
- రాధేశ్యామ్ రుద్రావఝల
30.07.2020
శ్రీమద్రామాయణము, బాలకాండము, నలుబది రెండవ సర్గము - భగీరధుఁడు గంగను దెచ్చుటకై తపంబొనరించుట:
బాల/42/1/తే.గీ.
కాలధర్మముచెందె సగరుడు; పిదప/
మంత్రులతని మనుమడంశు మంతుని తమ/
ప్రభుని జేయగా నతడు ధర్మాత్ముడౌచు/
గొప్ప పాలన నందించె కూర్మితోడ/
నిట్లు పెక్కేండ్లు పాలించె నిద్ధరిత్రి!
బాల/42/2/తే.గీ.
ఆతనికిఁ బుట్టెను దిలీపుడను సుతుండు/
వాసికెక్కెనాతడు రవి వంశమందు/
నంశుమంతుడు ప్రభువుగ నతని నిల్పి/
తపమునకు పుణ్య హిమపర్వతములఁ జేరె!
బాల/42/3/తే.గీ.
ఇంద్రియముల నణచి సంయమించి ఘోర/
తపము జేసె పవిత్రమౌ స్థానమందు/
పుణ్యగతులను నొద్దికఁ బొందగాను/
తనువు విడె యంశుమంతు డాదర్శమూర్తి!
బాల/42/4/వచనము.
మహా తేజస్వియైన దిలీపుఁడు రాజ్యమునొందితన ముత్తాతల మరణవృత్తాంతమునంతను విని, మిక్కిలి చింతాక్రాంతుడై,
బాల/42/5/కందము.
ఎట్లుదివిజగంగను భువి
కెట్లై రావించెదమరి యేదారులలో
నెట్లాయమ హిబుకంబున
కెట్లుచనునొ సాగరులకు నేగతి కలదో!
బాల/42/6/కందము.
ఏవిధమునవారికి జల
మేవిధులను తర్పణంబు
లెన్నగ నిడుదో?
యేవిధముగ నే సద్గతు
లేవిభవములుసగరసుతుల
కేర్పడగలవో?
బాల/42/7/వచనము.
ఇట్లాలోచించుచున్న దిలీపునకు--
బాల/42/8/తేటగీతి
కృపను వర్షింప సురలు, భగీరథుడను
పుత్త్రుని దిలీపుడు బడసి ముదమునొందె!
పితరులకు తర్పణం బీయగ తనయుండు
కలిగె నని యుత్సవము చేసెనెలమి మీర!
బాల/42/9/ తే.గీ.
పృథివిఁ బాలించె ముప్పది వేల యేండ్లు
పెక్కు యాగములను జేసి ప్రీతిఁ గాని,
సగర సుతుల సద్గతికిని తగు తెఱువది
తెలియక దిలీపుడేగెను దేవ భూమి!
పృథివిఁ బాలించె ముప్పది వేల యేండ్లు/
పెక్కు యాగములను జేసె ప్రీతిఁ, గాని,
సగర సుతుల సద్గతికిని తగు తెఱువది
తెలియలేక దిలీపుడు కలత చెందె!
బాల/42/10/ తే.గీ.
వ్యాకులమతి దిలీపుడు వ్యాధి గ్రస్తు/
డాయె! నంత తన సుతు పట్టాభి షిక్తు/
జేసి, తను సుకృతమ్ముల చేసిన కతమున/
కల్గు పుణ్యఫలమున స్వర్గమునుపొందె
బాల/42/11/ వచనము
దిలీపుని తదనంతరము అతని పుత్త్రుడు భగీరధుడు రాజ్యపాలనా భారమును వహించెను. సంతతి లేనివాడగుటచే సంతానము కోరువాడై యుండెను.
బాల/42/12/తేటగీతి
సంతు లేదని మనసున చింత పెరిగి,
గొప్పతేజస్వియును ధార్మికుడు భగీర/
ధుండు రాజ్య భారమును మంత్రులకు నిచ్చి/
తనకు వగదీర సంతానమును మరియును/
గంగను పుడమికి రావింపంగ కోరి/
చేరి గోకర్ణమును చేసె ఘోర తపము!
బాల/42/13/తేటగీతి
బాహుయుగళి నిటారుగ పైకి నెత్తి,
నిలచి పంచాగ్నుల నడుమ నెలకునొక్క/
మారు భోజన మొనరించి, మట్టుబెట్టి/
కోర్కె,లుగ్రత జేసెను ఘోర తపము!
బాల/42/14/వచనము
ఇట్లు వేయేండ్లు తపమొనరించిన భగీరధుని దీక్షకు మెచ్చిన పరమేష్ఠి, దేవగణములతో గూడి యా గోకర్ణ క్షేత్రమునందలి తపోస్థలి కేతెంచి భగీరధునితో నిట్లనెను:
బాల/42/15/తేటగీతి
జనులు వేనోళ్ళ కొనియాడు సచ్చరిత్ర!
యోభగీరధ నీ తపో వైభవమును/
మెచ్చినాడను వరమీయ వచ్చినాడ/
నో ధరానాథ కోరుకొ మ్మొక వరమ్ము!
బాల/42/16/వచనము
అని బ్రహ్మదేవుడనిన, భగీరధుఁడమితానందముతో బ్రహ్మదేవునికి మ్రొక్కి యిట్లనె:
బాల/42/17/తేటగీతి
గలిగె నేని నా యెడ ప్రీతి, నలువ! ఫలము/
గలిగెనేని నా తపము, సగరు సుతులిక/
నా వలన తర్పణంబుల నందు గాక!
వారి బూదిని సురగంగ వారిఁ దడిపి/
నంత వారందరును స్వర్గ మంద్రు గాక!
యింక నిక్ష్వాకు వంశము నింతతోను/
ముగియకుండగనాకొక పుత్త్రునిమ్మ!
యనుచు భక్తితోడఘటించె యంజలులను!
బాల/42/18/వచనము
అంత బ్రహ్మదేవుడాతని జూచి మృదుభాషణుడై యిట్లెనె: భగీరథా, యిక్ష్వాకు వంశోద్ధారకా, యట్లె యగుగాక! నీకు శుభమగును! కాని, గంగను భువికిఁదెచ్చు సమయమున నా గంగాపాతమును భూదేవి సైరింపగా జాలదు. హిమాద్రి సుతయగు సురగంగను దాల్పజాలిన వా డీశ్వరుఁడు దక్క వేరొకరికి నది శక్యముకాదు. అందులకై నీవు భక్తవశంకరుడగు శంకరుని ప్రార్థింపుమని పలికి, బ్రహ్మ భగీరథునకు వరమొసగి, భగీరధుని వినతిని మన్నింపుమని గంగాదేవికి యానతిచ్చి తన లోకమునకుఁ బోయెను.
- రాధేశ్యామ్ రుద్రావఝల
26.11.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి