పార్వతీపతి శతకము

పార్వతీపతి శతకము

ఉ.
చావడిఁగావ నిల్చు సుతుఁ జంపి గజాసురు భక్తి మెచ్చగా/
దీవెనలిచ్చి వానితలఁ దెచ్చి గజాస్యుని జేసి నీసుతున్/
జీవితుఁజేసి విఘ్నపతి జేసితివయ్య! మహత్వ పూర్ణమౌ/
నీవిలసత్కథామృతము నిత్యము గ్రోలెడు భాగ్యమిమ్ము శం/
భో! వృషవాహనా! హర! నమో భవ శంకర! పార్వతీపతీ!                     1

చం.
హర! మరి, నీవలెన్ మది నియంత్రణ జేయగ మాకు సాధ్యమే!?
త్వరపడి చిచ్చుకంట నల తామర తూపరిఁ గాల్చితీవు! మై/
మరపున దారికాచితివి మారుని తండ్రిని పొందుకై, వశం /

కర కడు చిత్రమౌ తమరి గాధలు లీలలు పార్వతీపతీ!                         2

చం.
వరములనిచ్చి దానవుల బల్మిని పెంచెద వెంత ముచ్చటో!

శరణను మౌని దేవ గణ సజ్జనులన్ కడగంట చూడవో!
హరిదరి చేరుడీ, యతఁడె యాశ్రిత వత్సలుడంచు పంప, శ్రీ/
హరి హరు లేక తత్త్వమను నర్థము కన్పడె, పార్వతీపతీ!                    3

చం.
అరదము భూమి, చక్రములె యర్క సుధాంశులు, నాల్గువేదముల్/
తురగములై చతుర్ముఖుడు త్రోలగ, శేషుఁడె నారి, మేరువున్/
హరియను చాపబాణముల నల్లన దాల్చితి వెంతవాడవో!?
పురముల మూడు గూల్పగ ప్రభో! త్రిపురాంతక! పార్వతీపతీ!            4

ఉ.
క్లేశములెన్ని గల్గినను కేవల నామ జపమ్ము తోడనే/

లేశము బాధ యేనియును లే కపమృత్యు భయాపహారి వై/
పాశము ద్రుంచివేయుదట, పండది తీగను వీడునట్లుగా/

దాసుడ, భక్తి గొల్చెదను! త్ర్యంబక! గావుము, పార్వతీపతీ!
                5

చం.
గరళము బుట్టె చిల్కగను, కశ్యప పుత్త్రులు గూడి క్షీరసా/
గరమును, తాళలేక హర! కావుము దేవర యంచు మ్రొక్కగన్/
వెఱపిసుమంతలేక దిగి ప్రేంఖణమున్ సలుపంగ వెఱ్ఱివో/
మరియది వెన్నగా తలచి మచ్చిక మ్రింగితొ పార్వతీపతీ!
                   6

ఉ.
చాలును! నీ యొడల్ మఱచు జాలియు క్రోధములెంత తీవ్రమో/
బాలుని, కాలుఁ బాశమున పడ్డ యభాగ్యుని గాచినావు! లే/
బాలుని, తల్లి యాజ్ఞఁ దల వాకిలి కాపును జంపినావు! నే/
తాళగలేను కోపమును తాలిమి జూపుము పార్వతీ పతీ..!
                7

ఉ.
కాశికిఁ బో విరక్తి గొని కావిని గట్టగనేల నీశ్వరా!?
గాసిలి, బంధముల్ దునుమగా భవ సంసృతియన్ గభీర వా/
రాశిని దాటనిత్తువు పరాత్పర నీ తలనున్న గంగనే/
దోసెడు నీ శిరంబు నిడ తుష్టిని పొందుచు పార్వతీపతీ!
                8

ఉ.
గంగకు మూర్ధమిచ్చి మరి గౌరికి నర్ధ శరీర మిచ్చు నా/
సంగతి స్పష్టమాయె హర! చల్లన జేయగ కంటి చిచ్చు, నా/
భంగున సోలు తూలికల భంగి సరాసరి జేయ గౌరి యా/
నింగి పయస్వినీ తరుణి నిక్కపు మక్కువ గూర్చునీకు; న/
ర్ధాంగియె గౌరి యన్నదది యంతయు పేరుకె పార్వతీపతీ!"             
9

ఉ.
తీరము చేరకుండగనె తెప్పఁ దహించుట నీకె చెల్లు నా!

గౌరికి నీకు కోరిజతఁ గల్పగ వచ్చిన కాముఁ గాల్చి యా/
నారిని పెండ్లిజేసికొనినావు గదా! యభవా! భవాబ్ధి నన్/

పారగ జేయ వీడగలనా తమ పాదము పార్వతీపతీ!
                    10

చం.
హరికిని నీకభేదమని యందురె గాని సదాశివా! భవా!

మురిసి గజాసురోదరము మున్ బస చేసిన ప్రజ్ఞ నీది, తా/
మురిపెపు మాటలాడుచును భూనభమంతయు నిమ్ముజేసె శ్రీ/

హరి! మరి నీవమాయకుడ వాతఁడు లౌక్యుఁడు పార్వతీపతీ!
           11

చం.
తిరిపెము నెత్తుచున్ జగతి ద్రిమ్మరివై వెలిబూదిపూతలన్/

గిరులనునుందు వీవు, తగ క్షీరపు వారిధి వాని కిల్లు క/
స్తురి ఘుమఘుమ్మనంగ నలదున్ తన మేనికి! వానిజూడవో/

సిరిగలవాని పోకడలు చిన్మయ! మెచ్చవొ పార్వతీపతీ!
                   12

చం.
శివ తమ యాజ్ఞలేక నొక చీమయు కుట్టగలేదనందురే!?
తివిరియు మారు బాణముల దెబ్బతినంగనదేమియాజ్ఞయో/

నవగత మౌనె మాకు? తమ యాజ్ఞకు వాని నిబద్ధుఁ జేయగా/
యవునని యెట్లు గెల్చు తన యాటలు సాగగ! పార్వతీపతీ!
            13

చం.
పొగడగ నుబ్బులింగమవు! ముందును వెన్కలు చూడకన్, సురల్/

వగచుచు చెట్టుఁ బుట్టలకు పారగ, దైత్యులకున్ వరాల నీ/
యగ నది యేమనందును, నయంబున విష్ణుని రక్షఁ బంపగా/

తగునని! నీకు నాతనికి  తప్పదుగా మరి పార్వతీపతీ!
                    14

చం.
గరళము నీవు మ్రింగగను, కమ్మగ నుండుననంచు దల్చెనో/

యురము విషమ్ము చిందగ నహోయని గ్రోలెను బాలకృష్ణుడై!
హర! కనకాద్రి నీవు విలటంచు ధరింపగ, గోటియంచుపై/
గిరినిలుపంగ ప్రేరణను కేశవుడందెను పార్వతీపతీ!
                       15

చం.
సురలకు రాజ్యమీయగను శోభనమూర్తికి విష్ణుమూర్తికిన్/
మరియొక మార్గమెన్నగను మన్ననగాదని, చేయిసాచుటే/

గరిమగ నెంచినాడొ, హరి గైకొన రాక్షస రాజ్యలక్ష్మినిన్/
నెరపెను యాచకత్వమది నీకడ నేర్చెనొ పార్వతీపతీ!
                    16

చం.
గిరికొననుంటివీవు తగ క్షీర పయోనిధి నుండ నాతడున్!

త్వరఁ జన నీకు నెద్దు మరి, తార్క్ష్యుడు శ్రీహరి వాహనంబులై/
కరి మొర నాలకింప చిరకాలము పట్టె మురారికిన్! శివా!
మరణ భయమ్ము బాలునికి మాన్పితి వెంటనె! పార్వతీపతీ!            17

ఉ.
సుంతయు గొంకు లేక మరి సోకుగ బూడిద పూత వెట్టుచున్/

గంతల నంబరమ్ము మొల గట్టెడు ద్రిమ్మరి! యో జగత్పితా!
యంతయు నన్నపూర్ణ దయ! యాయమ మాపు జగత్క్షుధార్తినే/

కొంతయునైన బాధ్యతల గూడి వహింపవొ పార్వతీపతీ!
                18

చం.
వరముగ నస్త్ర మీదలచి వచ్చెడి నీ తల మోదె క్రీడి! నీ/

వరము పరీక్ష జేయ నభవా! తల తాక తాకగ వచ్చె రక్కసుం/
డురికెడి గంగ జూటమున నోపగ బిల్చె భగీరథుండు న/

య్యరొ! మరి తేరగా దొరికి నట్లుగ నీ తల పార్వతీపతీ!                 19

ఉ.
క్షేమమ నెంచి భక్తి పులకించుచు కోరగ నాత్మలింగమున్/

స్వామి యనుగ్రహించుచు గజాసుర కుక్షిని కొల్వుదీరినన్/
సాములజేసి దేవతలు చాల భజింపగ నుబ్బులింగమా!

క్షేమమదెక్కడో? యురముఁ జీల్చి బయల్పడ! పార్వతీపతీ!
            20

ఉ.
వింతగ తోచు నీదు తిరిపెంబు మహేశ్వర! యేమిటయ్య! నీ/

యింతి జగత్క్షుధార్తి నడగించుట, నీవిటు సంచరించు టౌ/
నంతియె లోకరీతి! పొరుగమ్మలు నీకిడు పుల్లకూరకై
/
ముంతను బట్టి నిల్చెదవు ముచ్చటొ, లీలయొ పార్వతీపతీ!
            21

ఉ.
శ్రీధరు డాదిలక్ష్మిని ధరించెను వక్షము నందు సొంపుగన్/

వేధ సరస్వతిన్ నిలిపె వేదమటంచును జిహ్వ పైన, నీ/
స్వాధువు లిన్మడింపగను పార్వతి కర్థశరీరమిచ్చి యా/

రాధనలందుకొంటివి నిరంజన! జంగమ! పార్వతీపతీ!
                  22

ఉ.
అబ్బ! యిదేమి చోద్యమయ! యచ్చట నిచ్చట సంచరించుచున్/

బొబ్బల పోసికోక, మరి, బూడిద పూసుకు నిల్లు చేరగా/
సబ్బుఁ దలంటగా జలము చాలదదెంతయు నన్న గౌరి తా/
నబ్బుర మంద నీకమరె నా సురగంగయె పార్వతీపతీ!
                   23

చం.
పులియును నేన్గుచర్మముల బొంత ధరించెడు నీ విలాసమున్,
పొలుపున కాలకూట విషమున్ వడి మ్రింగిన నీ రసజ్ఞతన్
చలి వణకించు నట్టి తమ స్థావర వైభవమంత చూడగా,
కలవరమౌను నిన్ను నడుగన్ తొలి భిక్షుక! పార్వతీపతీ!                    24

చం.
భవుడవు నీవెయయ్యు నభవా యని బిల్చిన పల్కెదీవు! స్త్రీ/
వవుదువు నీవె పూరుషుడవౌదువు చూడ విరుద్ధమౌచు, స్థా
ణువవు తిరుంగు జంగమవు, నున్నని లింగము వ్యోమకేశివై/
శివుడవునై భవానివయి క్షేమమొసంగదొ పార్వతీపతీ!                     25

ఉ.
ఎంగిలి కూడు నీకు రుచి, యీశ! పొదుంగున దూడ త్రాగు పా/
లెంగిలి, తేటి పట్టు మధువెంగిలి, మత్స్యము లీదులాడు నీ/
రెంగిలి చప్పరింప మదినిష్టమె కావున వింతయేమి? నీ
వెంగిలి మాంసఖండముల నిమ్ముగ మ్రింగగ పార్వతీపతీ!                 26

ఉ.
లోకమునన్ ప్రభుత్వమున లుబ్ధగుణంబది పెచ్చుమీరె స్వా/
మీ! కన, లంచమన్ తృణము మేయక చేయరుగా స్వధర్మమున్/
కాకలు దీరిరందరును! కానుక లిచ్చెద మ్రొక్కెదన్, ప్రభూ!
నీకిది లాంఛనంబగునె? నీయెడభక్తియె! పార్వతీపతీ!                    27

ఉ.
అంగబలమ్ము చూడ తమ కంగవిహీన పిశాచ సంతతుల్/
సంగడికాండ్రె! యర్థబలసంచయ మెన్నగ నస్థిమాల లీ/
భంగి విరాగినిం గనము!భైరవ! నీదగు బల్మి మొత్తమ/
ర్ధాంగి బలమ్ముగాదె!తెగ తాండవ మాడెదు పార్వతీపతీ!                 28

ఉ.
శాంకరి కర్ధదేహము నొసంగఁ గదా నటరాజువై సదా/
యంకములందు నీ యభినయమ్ములు సాగె! వశంకరుండవై/
పొంకము తోడ నాడ, నుమఁ బోలు విలాసము, సౌకుమార్యముల్/
శంకర! నీకు నెట్లుమరి సాధ్యపడెంగదొ పార్వతీపతీ!                     29 

ఉ.
ప్రాణములిచ్చెనీకొఱకు పామును, లూతయు నేన్గు, భక్తితో/
బాణమునన్ కనుల్ పెరికి వైచి యొసంగెను బోయ తిన్నడా/
ప్రాణమొ దేహమో యడుగు భక్తి పరీక్షలఁ బెట్టుటేల! యీ
ప్రాణిని దాటనీయగదె, భర్గ! భవాబ్ధిని పార్వతీపతీ!                        30

ఉ.
మామను మేష శీర్షునిగ మార్చిన యల్లుడ! యింటి ముంగిటన్/
ధీమసుడై చెలంగు సుతుఁ ద్రెళ్ళగ శీర్షము ద్రుంచి యేన్గు దౌ/
మోముగ చేయు తండ్రి! మరి, బుర్రలు మార్చెడు కౌశలంబునం/
దామిక నొందు నాయకుల కా కళ భూమిని 'రాజకీయమై'/
మేమును పండిపో నకట! మీఱగ హద్దును పార్వతీపతీ!                  31

ఉ.
వేడుక నీకదేమొ!? మఱి పేర్మి వహించుచు బల్ పసందుగా/
నాడెదవీవు తాండవము హ్లాదమునొంద త్రిలోకముల్, శివా!
మూడవకన్నువే తెఱచి బుగ్గిని చేసెద వంతలోనె! యా/
బూడిదె మాకునయ్యెడు విబూది ప్రసాదము పార్వతీపతీ!                 32

చం.
గరుడుడు హుంకరించి యురగమ్ముల మ్రింగగ నుత్సహింప నో/
హర! తమ భూషలయ్యు తన యాకలి చూపుల నాగలేక నా/
యురగములన్ని చేరి హరి నొద్దిక మ్రొక్కగ దర్వి నాడి యా/
శిరమున క్షేమమిచ్చు పద చిహ్నములుంచెను పార్వతీపతీ!                  33

ఉ.
(జ్యోతి స్వరూప! లింగముగ నుద్భవ మందుచు నీవు నిల్వగా/)
జ్యోతిగ ప్రాభవమ్ము తగ జూపగ లింగమ మౌచు నిల్వగా/
ధీతిని కల్గి నీ యెడల, తేల్చగ నాదియు నంతు తాము నీ/
భూతిని గొల్తుమంచు వడి పూని ధరాధరుడే వరాహమై/
శ్వేత మరాళమై నలువ శీఘ్రగతిన్ చనె పార్వతీ పతీ!                       34

ఉ.
నీ తల తాకగా నలువ, నీ పదమంటగ బోయె విష్ణుడున్/
చేతను గాక నిర్వురికి, శ్రీహరి వచ్చె సమాదరింపగా
ధాతను, తోడుతెచ్చెను నతండొక పుష్పము సాక్ష్యమీయ నా/
కేతకి బొంకె నా విధునికే విజయమ్మని పార్వతీపతీ!                         35

చం.
ఒకవిరి బ్రహ్మకై యనృత మొక్కటి చెప్పగ దానిఁ బట్టి కే/
తకి నిను నాదు పూజ దల దాల్చను పొమ్మని కట్టు సేయు నిన్/
చకితుని జేయ వాల్జడను శాంకరి పూన్చెను, నీదు భూషలున్/
వికటము లౌచు నాపొదల వృద్ధిని పొందెను పార్వతీపతీ!                   36

చం.
అడుగును తల్లి యార్తి, సుతు లాకడ నీకడ పోయిరాగ తా/
విడువక, "వేళ కింత తిన వీలును కల్గుట లేదొ బిడ్డడా!
వడలితి, వెంత చిక్కి"తని పట్టెడు బువ్వను బెట్టు! జంగమా,
యడిగెడు వారు లేక సగమైతివి యేమొకొ!? పార్వతీపతీ!                  37

ఉ.
తామును కామితార్థఫలదాయకులౌ ఘన కీర్తిసాంద్రు లె/
ట్లో మన మాటగా చెపుమ! లోనికి మ్రింగగ లేని క్ష్వేళమున్,
దామము నాగులున్, శిరము తైతకలాడు సురాపగన్, శివా!
యేమని కోరుకొందు తమకే తల నొప్పులు పుట్టెడుండ నా/
కేమభయమ్ము నిచ్చెదవొ యీశ శుభంకర పార్వతీపతీ!                     38

చం.
అలవికి మీఱు సంతసము నవ్వలకంటను జూపి వెంటనే/
యలుకను పూని తీవ్రమగు నాగ్రహ కీలల బేసికన్నులన్/
నిలుకడలేక చూపగను నే భయమందనయోమయమ్ము, నా
కలతను దీర్చు నివ్వలను కన్నది యమ్మది పార్వతీపతీ!                       39

చం.
చలువకు శీత శైలమును, చంద్రుడు, గంగయు నెత్తినుండ, నీ/
వలువలు దిక్కులై గళముఁ బయ్యరమేపరి యుప్ఫనంగ నీ/
వలది విబూది దేహమున హాయిగ నాడెద వేమి గొప్ప!? నీ/
విలనొక వేసవిన్ గడుపవే తెలియున్ మరి పార్వతీపతీ!                       40

ఉ.
కన్నులు చూడ బేసియగు కంఠము నల్లన, మిన్నునౌ కురుల్/
పన్నుగ భూషణమ్ములయి పన్నగ రాజము లాడు; నొంటిపై/
చెన్నుగ బూదిపూత యిక చెప్పగ దిక్కులు వల్వలౌను నీ/
విన్నిట పూరుషా! వికృతులే కలుగన్ ప్రకృతయ్యు శంకరా!
యెన్నగ సుందరేశ్వరుడ వెట్లయితో మరి పార్వతీపతీ!                         41

చం.
ఘాతకుడైన బాణుఁ, భువి గండర గండనిగానొనర్పగన్/
చేతుల వేయినిచ్చి, నెఱి సేమము సూడగ కాపుకాసితే!/
యాతని వాకిలిన్! చివర కా హరి తోడను కయ్యమాడు  నీ/
చేతల చిత్తమున్ దెలియ జెప్పుటశక్యమె? పార్వతీపతీ!?                        42

ఉ.
శంకర! నీవుఁదాల్పగను చంద్రుడు, గంగయు, పన్నగాదులున్/
వంకరలున్నగాని మహిఁ బన్నుగ పూజల నందుచుండెఁ బో!/
వంకరబుద్ధులౌజనుల ప్రాభవముల్ మితి మీరెనయ్య! యే/
వంకకుఁబోదుపాంసనులపాల్పడకుండగ పార్వతీపతీ!                        43

ఉ.
మ్రొక్కుచు నాదిదేవుడని ముందుగ నందలమిచ్చి నంతనే/
సొక్కి, సురాసురుల్ పెనగుచో నహిఫేనము పుట్ట క్షీరధిన్/
గ్రక్కున నా విషమ్ము నరికట్టగ నీ వట నడ్డికట్టగా/
తక్కిన వారు జై యనిరి! త్రావితి వీవది యొక్కగుక్కఁ దా/
దక్కెను ’నీల కంఠ’! యభిధానము నీకును పార్వతీ పతీ!                      44

కవికంఠ భూషణము:
కరుణాంతరంగ, భవ, గాంగజటాధర, హే మహేశ! శం/

కర, ఫాలనేత్ర, శివ, కల్మషకంఠ, సనాతనా! వశం/

కర, వ్యోమకేశ, ధరకార్ముక, జంగమ, స్థాణు, ఝర్ఝరీ!

హర, మమ్ము గాచుమిక నాపద దీర్పవె! పార్వతీపతీ!                                45

ఉ.
గ్రక్కున కాలకూటమును కమ్మని పండని యెంచి మ్రింగగా,
స్రుక్కెడు రోగి చందురుని సోకులు పోవుచు నెత్తి నుంచగా,
మిక్కుటమౌ ప్రవృత్తిఁ జను మిన్ను సరిత్తును మోయుచుండు నీ/
తిక్కకు లెక్కయేమిటయ ధీయుత శంకర పార్వతీపతీ!                             46 

చం.
చిరుబురులాడుచున్ పెనగి చిందుల క్రోధదవాగ్ని పూనగన్/
నరులము, మ్రింగలేక వమనమ్మును సేయ విషమ్ము వాక్కులన్/
మురిపెమొ నీకు, కాక మొగమోటమొ బూచులఱేడ! వింతగా/
(మురిపమొ నీకు కాక మొగమోటయొ సంతత మౌర! గొంతునన్/)
గరళము నెట్లు పట్టితివి క్రక్కక మ్రింగక పార్వతీపతీ !                               47

ఉ.
తెల్లనివాడ, యీశ! తమదేహము తెల్లన, నందికేశుడున్/
తెల్లన, నీ నివాసమతితెల్లన, నీవు ధరించు భస్మమున్/
తెల్లన, చంద్రవంక నగ తెల్లన, గంగయు నస్థిమాలలున్/
తెల్లన, చూచిచూచి మరి తెల్లనివన్న మొగమ్ముమొత్తి మా/
తల్లిని యర్థదేహమున దాల్చితివేమొకొ పార్వతీపతీ!                              48

ఉ.
కాల్చిరి భవ్య వాస్తుకళ గల్గిన సుందర మందిరమ్ములన్/
కూల్చిరి రమ్యశిల్పకళకున్ నెలవౌ ఘన దేవళమ్ములన్/
దాల్చి మహమ్మదీయ విభు దౌష్ట్యము నాజ్ఞగ! నద్దురాత్ములన్/
వ్రేల్చగ సోమనాథుడ! యుపేక్ష యదేలనొ పార్వతీపతీ!                        
49

చం.
పొరిపొరి యా సురద్విషులు భూనభముల్ వడి సంచరించు నా/
పురముల కూలనేయగని, పూనుచు వైరము వారలున్ మతాం/
తరమున జన్మలొంది కడు దౌష్ట్యమునన్ గుడి గోపురంబు లి/
క్కరణిని కూల్పగా నిపుడు కాచెదవేగతి?!- పార్వతీపతీ!
                       50

ఉ.
ఎవ్వరి కెంత యాయువుల నిచ్చెడు లెక్కల కేమి హేతువో?/
యవ్వ శతాధికాయువగు, యౌవన దార్ఢ్యున కాయువల్పమౌ/
హవ్వ!చిరాయువై మిగులు నాగడకాడు, సుశీలు పూర్ణుగా/
నెవ్వల నుండనీయ విదియేమి విలాసమొ? పార్వతీపతీ!
                        51

గురువుగారూ, శుభోదయం. చిన్న సందేహమండి..! ఆయువునిచ్చే  పోర్ట్ ఫోలియో బ్రహ్మగారిది కదా..! మరి శివుడికి అన్వయించడం/ ఆపాదించడం ఎలా సమర్ధించుకోవాలి? శివుడు మృత్యు వంచకుడు కనుక ప్రాణములను ఉంచడం హరించడం ఆయన చేతనే ఉంటుందని అనుకోవచ్చా?
శ్రీరామారావు మాస్టారు ప. సౌ: బ్రహ్మ ప్రాణం పోస్తాడు. శివుడు ముగించినప్పుడుగదా- ప్రాణికి ఆ జీవనకాలం ఆయువయ్యేది!
బ్రహ్మయనేది, విష్ణవనేది, శివుడనేది పరమాత్మయొక్క బాధ్యతా నిర్వహణావధికదండి..! ఒకే మనిషి ఇంట్లో భర్త- ఆ తర్వాత పిల్లలకి తండ్రి, మనుమలకి తాత; ఈ భర్త---- ఆ తాతే కదా! Oh! What a logic!!🤗 పార్వతీపతి పరమాత్మ పొందిన ఉపాధియేనండి.

ఉ.
శృంగమె చాలనో, హిమమె శ్రేష్ఠము శయ్యకనెంచితీవొ/ యా
యంగజు చేష్టలన్ కినిసి యాతని క్రీడకు రంగమంచునో,
భంగమొనర్చి తల్పమును, వైఖరిఁ దెల్పగ దాల్చితీవ, ఖ/
ట్వాంగము నాయుధమ్ముగను, భావజ శాత్రవ! పార్వతీపతీ!
                        52

చం.
తమమతమే ఘనంబనుచు తక్కినవన్నియు బూటకంబుగా/
భ్రమపడి దౌష్ట్యముల్ సలుపు రాక్షస వృత్తుల కాతువేలనో?
క్రిమి, ఫణి, హస్తు లీర్ష్య విడలేవొకొ నీపయి భక్తి కల్గి!? యా/
తమి తొలగంగజేసి మమతల్ మది పెంచవె పార్వతీపతీ!
                               53

చం.
కొడుకు తనంతవాడయిన కూర్మి చెలంగును తండ్రి కెంతొ! నీ/
కొడుకయి నిన్ను మించెగద! కోరి గజాస్యుడు భక్త లోలుడై/
కడుముదమంది బ్రోచుఁగద గడ్డియె పూజకు చాలు నంచు! మా-
రెడు దళ మంది మోక్షమిడు రీతిని నీవలె పార్వతీపతీ!            
                        54

ఉ.
దేవర! ఎప్డుపుట్టితివొ? తీరుగ నెప్పుడు పెద్దవైతివో?
చేవకునై తపంబెపుడు చేసితొ? రూపము నెట్లు నిల్పితో?
నీవయి క్షీణ నాశముల నిత్యము సల్పెద వెట్లొ నిష్ఠతో/
కావవె షడ్వికారములు కల్గగనీయక పార్వతీపతీ!                                              55

షడ్వికారములు :
దృగ్గోచర వస్తుజాలంలో కలిగే పరిణామాలు ఆరు విధాలు. అవి : మొదట సూక్ష్మ రూపం (పుట్టుక), తరువాత స్థూల రూపం (పెరుగుదల/ వృద్ధి), మరింతగా పెరగటం (బలపడటం), రూపంలో మార్పు రావడం, క్షీణ దశ, నాశం.

చం.
కలిగి వివక్ష భూజనులు గాంచరు నీదు విరుద్ధ వైఖరుల్!
పులిమి విరూపి వౌదువు విబూదిని దేహ విలేపనమ్ముగా!
పొలుపుగ నాలి చూడ గిరి పుత్రిక, శ్యామల వర్ణ! చాలదో!?
వలికిని వాసముండెదవు వల్వలు దిక్కులె గాగ, శంకరా!
బళిర విచిత్రమౌ తమరి వన్నెలు చిన్నెలు పార్వతీపతీ!                                         56
వలికి = శ్మశానము

చం.
చెడదె విహారయాత్ర! యతి చిత్రము! పెద్దల కూలజేసి న/
ట్టడవి విమానయానమున, నాపసిబిడ్డల నాదుకొంటివే!?
బడుగుల గుండెగాయముల బాగొనరించెడు వైద్యు నాయువు/
ల్నడి నిదురందు తీయు నిను నమ్మితి నీదయ పార్వతీపతీ!                                  57

చం.
తల తెగకోసి హస్తమున దాల్చి కపాలమునాదిభిక్షుకా!
తల తెగవేసి, యేన్గునకు తాటనుదీసి మొలన్ బిగించి యా/
తల నిడి పుత్త్రు శీర్ష పరిదానము చేసితి వో త్రిశూలి! నా/
తలపడువేళ నిన్ దలచు త్రాణనొసంగవె పార్వతీపతీ!                                        58

ఉ.
సైకత లింగ మొక్కయెడ స్ఫాటిక మౌచు మరొక్క క్షేత్రమం/
దాకసమంటు కొండగుహ యందున, లోతగు బావిలోపలన్/
ప్రాకటమౌచు భక్తపరిపాలన సేయగ నెంత జాణవో/
మాకయి కార్యసాధనకు మార్గముఁ జూపితి పార్వతీపతీ!                                   59

ఉ.
ఆపద గల్గె లోకముల కంచు విషమ్మును త్రావినన్, మహా/  
తాపసివై వనంబునను ధ్యాన నిమగ్నుడవైన గాని, ది
వ్యాపగఁ దెచ్చి నెత్తిపయి నాశ్రయమిచ్చిన, నిన్ సహింపగా/
నే పెనుమాయఁ జేసితివొ యీశ్వరి మిన్నక యుండుగాని, మే/
మే పనిచేసినన్ సతులకేల రుచింపదొ పార్వతీపతీ!                                             60

చం.
సుతులను కోరి నీకొఱకు స్తోత్ర తపంబుల నాచరించు నా/
పితరుల కీప్సితమ్ము నెరవేర్పగ పుత్త్రునొసంగినంత, కా/
మితఫల దాయకా! యతని మృత్యువు తోడుగ పంపుటేల? నీ/
మతమున నంతరార్ధమది మా మతి కందదు పార్వతీపతీ!                                 61 

ఉ.
పుట్టిన సర్వజీవులకు ముంగిలి మృత్యువు నిల్ప గాను నీ/
వెట్టి మతంబుదాల్చితి మహేశ్వర! యాయువు తీరు నంతలో/
గట్టి ప్రయత్నమున్ నెరపి కార్యములన్ సఫలమ్ముజేయఁగా/
కట్టడి మీరకుండు పరికల్పన చేసితొ పార్వతీపతీ!                                            62

ఉ.
హీనునకందలమ్ము మతిహీనునకందము నేల నిచ్చెదో/
దా
నగుణమ్ము కల్గునెడ ద్రవ్యము నీయక లోభి కెందుకో!
దీనత నున్నవాని కడతేర్పగ నింకను ముంచనేల? స్వా/
ధీనులమయ్య నీయెడను దేవర కావవె పార్వతీపతీ! 
                                           63

ఉ.
భీమపరాక్రమమ్మునను విల్లుగ మేరువు హేలనెత్తి యీ/
భూమి రథమ్ముగా నిలిపి మూడు పురమ్ముల కూల్పగా నహో!
స్వామి! విరాట్స్వరూప విభవమ్మును జూపియు సూక్ష్మదేహమున్/
లీలగ దాల్చి యర్చగొను లింగమ వైతివి పార్వతీపతీ!                                         
64
వ్యోమకేశుడు, విరాడ్రూపుడూ అయిన శివుడు హస్తాంతర్గత లింగసూక్ష్మరూపమెలా అయ్యాడో.. అని భావన..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు