అనువాదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనువాదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2025, బుధవారం

అష్టవిధ పుష్పార్చన

శ్లో.

అహింసా ప్రథమం పుష్పం

పుష్పమింద్రియ నిగ్రహం

సర్వభూతదయా పుష్పం

క్షమా పుష్పం విశేషతః

శాంతి పుష్పం తపః పుష్పం

ధ్యాన పుష్పం తథైవ చ

సత్యమష్టవిధం పుష్పం

శంభోః ప్రీతికరం భవేత్

నా అనువాద ప్రయత్నము:

తే. గీ.

ఎరుగగ ప్రథమ పుష్పమహింస, యింద్రి

యమ్ము లణచుట, భూత దయయును, క్షమము

శాంతియు, తపము ధ్యానము, సత్యములను

నష్ట విధ పుష్పయుతమౌ సమర్చనమ్ము

శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!

********

నాల్గవ పాదానికి మా శ్రీరామారావు మాస్టారి సవరణ:

అష్టవిధ కుసుమార్చన - శిష్ట‌మరయ

శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!

రాధేశ్యామ్ రుద్రావఝల

15.07.2025


🙏

పోయిన వారం మిత్రులు రాధేశ్యామ్ గారు అనువాద మందించిన మూలశ్లోకమునకు నా యనువాద యత్నము.


ఎడిట్:

మా మిత్రులు శ్రీ సాహితీ సామ్రాజ్యం గారి అనువాదం:

హింస చేయకునికి నెన్నగ తొలిపుష్ప;

మింద్రియముల నిగ్రహించు టొకటి;

భూతదయయు నొక్క పుష్పమనగ నొప్పు;

క్షమము మరియు నొక్క సుమము గనగ;

శాంతి తపము లరయ చక్కని కుసుమముల్; 

ధ్యాన మరయ నొక్క యలరు జూడ;

సూనృతమ్ము నొక్క సూన; మీ యెనిమిది 

/యలరు లంది యలరు నష్టమూర్తి.


మాస్టారుకు ధన్యవాదములతో.....

🙏

4, నవంబర్ 2023, శనివారం

కాళిదాసు - చిటికినవేలు

శ్లో|| 
పురా కవీనాం గణనాం ప్రసంగే, 
కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః |
అద్యాపి తత్తుల్యకవే రభావా, 
దనామికా సార్థవతీ బభూవ ||

పూర్వకవుల గణన మొదలిడగ కనిష్ఠి/
కమున లెక్క కొచ్చె కాళిదాసు!
పిదప వేరు కవిని పేర్కొన లేక య/
నామిక తగినట్టి నామమయ్యె!


- రాధేశ్యామ్ రుద్రావఝల


5, జులై 2023, బుధవారం

కోడలి జాణతనము

శ్లోకము:
శ్ర్వశ్రూ రత్ర నిమజ్జతి
అత్రాహం దివసకే ప్రలోకయ
మా పథిక! రాత్ర్యంధ!
శయ్యాయా మావయోర్నిమఙ్క్ష్యసి!

ప్రతిపదార్థము:
శ్వశ్రూ = అత్త, అత్ర = ఇక్కడ
నిమజ్జతి = నిదుర మునుగుతుంది.
అత్ర
అహం = నేను, దివసకే = పగలే, ప్రవిలోకయ = బాగా చూడు - చూచుకో
పథిక! = ఓ బాటసారీ!, రాత్ర్యంధ! = రేఁజీకటి కలవాడా!
ఆవయోః = మాయొక్క, శయ్యాయాం = పడకపై, మా నిముఙ్క్ష్వ= పడవద్దు


నా అనువాద యత్నము:
ఉత్పలమాల:
అత్త పరుండు నిచ్చటనె యద్దరి నే పవళింతు పాంథుడా!
క్రొత్త ప్రదేశమోయి! మది గుర్తు నెరుంగుము! శయ్య చేర నీ/
తత్తరనో నిశాంధ్యమునొ దారిని తప్ప ప్రమాదముండదో/
యెత్తెరగున్ గమించెదవొ యే పొరబాటుకు తావు నీయకన్!

క్లుప్తత కోసం మరో ప్రయత్నం:
ఆ. వె.
అత్త నిదుర మునుగు నచ్చట, నిచ్చట /
నేను పవ్వళింతు! నెరుక తోడ/
చూచికొమ్ము పవలె! రేచీకటిని మాదు/
పైన పడెద వేమొ బాటసారి!


9, మే 2018, బుధవారం

శ్రీమతి సరోజినీ నాయుడు గారు వ్రాసిన Palanquin Bearers కవితకు స్వేచ్ఛానువాదం:

శ్రీమతి సరోజినీ నాయుడు గారు వ్రాసిన Palanquin Bearers కవితకు స్వేచ్ఛానువాదం:

ఉత్పలమాల:
ఊగెడు పూవువోలెనది యూపిరు లూదగ మాదు గీతితో/
నేగగ పిట్ట వోలె సెలయేరుల నుర్వుల నోలలాడుచున్/
దాగని నవ్వువోలె మది తాకిన తీయని స్వప్నమున్ గనన్/
ప్రోగున ముత్యముల్ చెలగు పోలిక మోసెద మేము డోలికన్/
సాగుచు నొయ్యనొయ్యనుచు జావళిపాడుచు తేలియాడుచున్/

చంపకమాల:
విరిసినతారవోలెహిమబిందువు నందున మాదు గీతికన్/
మెరిసెడు చంద్రరేఖవలె మించు తరంగపు వంపునందునన్/
పరగిన యశ్రు ధారవలె భార హృదంతర యౌ వధూటికిన్/
పురమునొహొమ్మొహొమ్మనెడు బోయిల కూతల సాగె పల్లకీ!

- రుద్రావఝల రాధేశ్యామ్, 04.10.2017

మూలం:

Palanquin Bearers - Poem by Sarojini Naidu

Lightly, O lightly we bear her along,
She sways like a flower in the wind of our song;
She skims like a bird on the foam of a stream,
She floats like a laugh from the lips of a dream.
Gaily, O gaily we glide and we sing,
We bear her along like a pearl on a string.

Softly, O softly we bear her along,
She hangs like a star in the dew of our song;
She springs like a beam on the brow of the tide,
She falls like a tear from the eyes of a bride.
Lightly, O lightly we glide and we sing,
We bear her along like a pearl on a string.

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు