ఉ.
దోమని తీసివేయకుము దోమను మించినశత్రువెవ్వడే/
నీమము లేక నెత్తురును నేతిని త్రావినయట్లు త్రావు యీ
దోమల నిల్వరింప యమ దూతలకైనను సాధ్యమౌనె? స్వా
మీ, మము కావరావ! జనమేజయ, దోమల యాజి చేయగన్!
08.06.2026
********************
ఇంకొక్కటి దోమమీదే:
మత్తేభం.
విన గుయ్యంచు నిశీధి వేళలను ప్రావీణ్యంబు చూపించుచున్/
తన తొండంబును సూదిగా మలచి రక్తంబున్ నిదానించి త్రా/
వును! యెఱ్ఱెఱ్ఱని దద్దురుల్ చుఱుచుఱల్ పుట్టింపగా చంప బో/
యిన యోధాగ్రణి తాడనంబునకు చిక్కీచిక్కకన్ నేర్పుతో/
తన ద్రోవన్ తను జారిపోవు నకటా ధాత్రిన్ విజృంభించు దా/
రుణమౌ కీటక మట్టి దోమపయి పోరున్ గెల్వ లేమెందుకో?
ఘన శాస్త్రజ్ఞుల మేధ చాలదొకొ! మోక్షమ్ము మనకెప్పుడో!
రాధేశ్యామ్ రుద్రావఝల
16.06.2026