మరొక కథకు పద్యం.
-----------------------------
పగటి కలల బాపఁడు
-----------------------------
ఆ. వె.
బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి,
వీథులందు తిరిగి బిచ్చమెత్తి,
దొరికినంత పిండి తోడ నేదో కాస్త
కడుపు నింపు కొనుచు గడుపు చుండ!
అలసుఁడు = సోమరి
ఆ. వె.
తల్లి యన్నపూర్ణ దయచేత నొక నాడు
యాయవారమందు నబ్బురమన
పిండి నిచ్చి పంపె పెద్దింటి యిల్లాలు
గంప నిండుగాను కరువు దీర!
ఆ. వె.
ఇల్లు చేరగ వటువెగిరి గంతులు వేసి
ముదము మీర పిండి మూటకట్టి
చిలుక కొయ్యఁ గట్టె ఎలుకలకు జడిసి
యందకుండులెమ్మ నంచు నరసి!
ఆ. వె.
తిరిగి తిరిగి వచ్చు తిరిపెంపు బాపడు
మంచమున పరుండె మగత గాను!
నావహింప నిద్ర యావలించు నతని
యూహ లందు తేలె నొడలు మరచి!
తే. గీ.
"కలిగె బియ్యపు పిండి కావలసినంత!
మూడుపూటల తిన్నను, బోలెడంత!
సరుకు మిగులును కరువులో చాలినంత!
నగదు కమ్మెద, ధర నాకు నచ్చినంత!
తే. గీ.
అందు కలిగిన లాభము నంత కంత
జేయగా వర్తకమునునే జేతు! నెంత!?
నొక్క యేడాది కార్జింతు ఊరి కంత-
ధనికుడననిపించు కొనగ తగిన యంత!
తే. గీ.
అపుడు పెద్దింటి వారికి యల్లుడనయి,
కూర్మిని కళత్రమందొక కొడుకును కన,
వాడు గృహమంత పారాడి యాడుకొనుచు,
నాదమరిచి చొరబడు తా నశ్వశాల!
తే. గీ.
“గుఱ్ఱములు త్రొక్కు నాముద్దుఁ గుఱ్ఱ, వాని
నెత్తుకొమ్మని నేనెంతొ మొత్తుకుంటి!
ప్రక్క నున్ననాలి యులుకు పలుకు లేదు,
పనినియుండెనొ, నా మాట వినగలేదొ!
తే. గీ.
సరగుననె నాదు బిడ్డను చంకకెత్తి
యాగ్రహమ్మున కాలెత్తి “యాలి వీపు
పగుల తన్నెద” నని తన్నె బలముతోడ!
దారగ తలచి మూటను తన్నినంత,
యొలికి పోయెను పిండంత తెలివి వచ్చె!
తే. గీ.
చేత నున్న దిండును తన శిశువు గాను
కొయ్యకున్నట్టి మూటయే కోమలి యని
పగటి కలలను కను వెర్రి బాపడు తన
కబ్బిన యిసుమంత సిరిని, యక్షయమని -
తేలి ఊహల, చేతల తూలి పోయి
మన్ను జేసె నిటుల కాల దన్ను కొనుచు!
---------------------------------------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
6.10.2026
7, అక్టోబర్ 2026, బుధవారం
పగటి కలల బాపఁడు
2, అక్టోబర్ 2026, శుక్రవారం
పండితుడు
మరొక కథకు పద్యం
---------------------
పండితుడు
---------------------
(తేటగీతికథామాలిక)
నదిని దాటుచు నుండిరి నరులు కొంద/
రా పడవను కలండొక యయ్య వారు!
బహుళ భాషలు నేర్చిన పండితుండు!
శాస్త్ర పారంగతుడతడు చదువులందు!
ఉబుసు పోని విశారదు డుత్సహించి
ప్రక్క నుండిన నొక పల్లె బైతు జూచి
మాట కలుప నెంచె నదిని దాటుదాక
హాయిగా కాలమును వెళ్ళదీయ నిట్లు:
'అబ్బి! యే యూరు మీది?' "యేరవతలి దరి/
గ్రామ!"- 'మేమి సేసెద వీవు?'- "రైతునండి!"
'నాగురించి చెప్పెద విను! నాల్గు వేద/
ములు నుపనిషత్తులను వడ పోసినాను!
వింటివా వాని గూర్చి?'- "లే, వినగ లేదె!"
'యరెరె! నీబ్రతుకున పావు వ్యర్థమాయె !
తెలియునా నీకు శాస్త్రముల్?'- "తెలియవు దొర!"
'యకట! నీ మనికి సగము వ్యర్థమాయె !
పోనిలే! షడంగము లేవొ జ్ఞానమున్న/
దా?'- "యవియును తెలియదు నా కయ్య గారు!"
"హారి! బ్రతుకు ముప్పాతిక వ్యర్థమైన'
-దనుచు నిట్టూర్చె పండితు! డంతలోన--
గాలి మారెను, మబ్బులు క్రమ్మెను, సుడి/
లోన చిక్కెను నావ, యా వాన లోన/
పడవ యూగి తూగ, తెరచాపలను దించి/
హెచ్చరించెను నావికు డీది చేరు/
డొడ్డు కనుచు ప్రయాణికు లులికి పడగ!
పల్లెటూరి బైతు వణుకు పండితుఁ గని-
"తమరి కీదుట వచ్చని తలచెద" నన
నతడు - 'ర ర రాదె - నా కీత''- యనె తడబడి,
యొడలు కంపింప భయమున హడలిపోయి!
"ఐన మీజీవనము పూర్తి వ్యర్థము గద!
ప్రాణ సంకటమందున పనికి రాని/
చదువు లింకెందు కవివట్టి చట్టు బండ/"-
లనగ బుద్ధి వచ్చె మన విద్యాధికునకు/
వరద దాటించి దరిజేర్చె పల్లె వాడు!
-------------------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
3.10.2026
పారంగత - ఒడ్డు దాటినవాడు
24, సెప్టెంబర్ 2026, గురువారం
ఔరా..!! 🤫🤫
ఔరా..!! 🤫🤫
తేటగీతి
పల్లె నొకడుండె! చురుకైన వాడు మిగుల/
పరుల కుపకారి యౌచును వరుస కలిపి/
బావ, యన్నయు తమ్ముడై పల్లె జనుల/
పనుల సహకార మందించు బంధువనగ!
కోడి కూత మొదలు ప్రొద్దు గ్రుంకు దాక/
నలుగురికి తాను తలలోని నాల్కవోలె/
నన్నిటికిని చేదోడయి యున్న కతన,
నతడు లేకుండ నా యూరి కడుగు పడదు!
తెల్లవారె పల్లెకు ప్రతి దినము వోలె!
నాడు మన కథా నాయకు జాడలేదు!
గుడిని, సంతను, వీథిలో, మడుల గట్ల/
నెంత వెదకిన కనరాడు వింతగాను!
తమిని యింటిని చూడగా తాళముండె/
నిరుగు పొరుగుకు నాచూకి యెరుక లేక/
వెతికి వేసారి గ్రామస్థు లితని కొరకు/
నూరకుండి రుస్సురనుచు నీరసించి!
కొన్ని నాళ్ళకు మనవాడు కూర్మి మీర/
పల్లె సీమను నడచుచు వచ్చుచుండ,
నతని జూచిన యొక్కొక్క డబ్బురముగ/
"నిన్నినా ళ్ళగుపడగ లే దేమి హేతు?"
వంచు నిలబెట్టి వివరము లడుగ సాగె!
మొదటివానికి చెప్పెను పూస గ్రుచ్చి/
నట్లె రెండవవానికి నంత కథను!
మూడు, నాలుగు నైదవ వాడి కదియ/
వివరముగ చెప్పి మరి చెప్పి విసువు పుట్టి,
పరుగునం బోయి వాఁడొక బావిఁ దూకె!
పల్లె నావార్త క్షణములో వ్యాప్తి చెంద,
విస్తు పోవుచు పెద్దలు పిల్లలెల్ల/
నూతి గట్టును చేరిరి భీతి తోడ!
మోకు లందించి లాగిరి పైకి వాని!
బయట పడినట్టి పోటరిఁ బలుకరింప/
గట్టు చేరిన జనమును కలియజూచి/
యూరి జనమెల్ల నచటనే యుంట నెరిగి/
గొంతు సవరించి పల్కెను కొంటె కుర్ర!
కార్య మతిముఖ్య మయ్యెడు కారణమున/
పొద్దు పొడవక ముందరే మూటముల్లె/
భుజమునకు నెత్తి పొరుగూరు పోతి ననుచు/
తలతుడుచుకొని తనదారిఁ దాను పోయె!
చెప్పినదె చెప్పగా నోరు నొప్పిపుట్టి/
యెల్ల జనులకు చెప్పుట యెట్టులనుచు/
నెత్తు వేసెను వీడని యెరిగి ప్రజలు,
"హారి, భడవా!" యనుచు నవ్వి రూరడిల్లి!
---------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
24.09.2026
25, ఆగస్టు 2026, మంగళవారం
మంచివాడు..!
అందరికీ శుభోదయం. చాలా చాలా రోజుల తరువాత వ్రాసిన పద్యమిది:
తే. గీ.
వణిజు డొకడుండె ధనికుడు పల్లె యందు,
నప్పు లిచ్చుచు బడుగుల యవసరమున
లాభ మార్జింప మిక్కిలి లోభమంది,
వడ్డి గుంజును పేదల నడ్డి విరిచి!
తీరి కూర్చుండి యరుగుపై దారి బోవు
జనుల, పేరుపేరున పిల్చి జంకు లేక
కస్సుబుస్సు లాడుచు వారి కసరు కొనుచు,
తిట్టుఁ, దిట్టిన తిట్టులన్ దిట్ట కుండ!
అదుపులేనట్టి నిష్ఠుర మతని మాట
మసకబార్చెను పరువును మంది లోన!
నింత దుర్మార్గునింజూడ, మింత కింత
యనుభవింపగ జూడమే యని తెగడిరి!
ముదిమి క్రమ్మగ రోగాల పుట్ట యగుచు
పాపములు పండి మంచము పట్టి నంత,
కలిగె జ్ఞానము, తన పాప కర్మఫలము
కొట్టె నిట్లని తలపోసి కుమిలె నతడు!
చివరి క్షణముల తనయుల చేర బిలిచి,
జీవితాంతము ప్రజలచే చెడ్డ వాడ-
నన్న యపకీర్తి కలిగెను! నన్ను మంచి-
వాడని ప్రజలు మెచ్చెడు పనిని చేయు-
డనుచు దీనుడై చాలించె తనువు నతడు!
శ్రేష్ఠి కొడుకులు తమ తండ్రి చివరికోర్కె/
దీర్పగా దృఢ సంకల్ప దీక్ష కలిగి,
బడితెలను పట్టి బాదిరి వచ్చుపోవు
జనులు గగ్గోలు పెట్టగ చచ్చునట్లు!
పరుగు లంకించి తలచిరి వణిజు గుణము:
తిట్టెనే గాని నీరీతి కొట్టలేదు!
మాట కేమి గాని మనిషి మంచి వాడు !
తనయులిద్దరి కన్ననా తండ్రి మేలు!
చెరప కనె నొక గీతను చిన్న గీత
చేయు రీతిగ గడుసులౌ శ్రేష్ఠి సుతులు
జనకుఁ దిట్లను మరువగా జనుల బాది
తనయులిర్వురు నిలిపిరి తండ్రి మాట!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
25.08.2026
(పాత కథకే పద్యరూపం)
😄😄😄🙏🙏🙏
6, సెప్టెంబర్ 2023, బుధవారం
మావాడు..!!
17, జులై 2023, సోమవారం
విశ్వనాథవారి వేయిపడగలు నవలలో - మేఘ వృక్ష మైత్రి - కి పద్యరూపం
విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగల్లో ఒక ఘట్టం శ్రీ శ్రీరామారావు మాస్టారి మాటల్లో:
ఒక మేఘం వానకాలంలో సంచరిస్తూ ఒక పెద్దచెట్టుని కౌగలించుకొని ఆనందబాష్పాలు కార్చేది.
ప్రతిసంవత్సరం వారి చెలిమి చాల దృడమైనది. ఏళ్లతరబడి సాగుతున్నవారి చెలిమికలిమితరగనిగని!
నాగరకత పెరిగింది. ఆ సుబ్బన్నపేట నెమ్మదిగా పట్టణాలవంకచూడసాగింది.
చెట్టునికొట్టి కరెంట్ పోల్ వచ్చింది --- ఆదేశంగా!!!
వానకాలంవచ్చింది. మన వృద్ధమేఘమూ వచ్చింది.
ఆ ప్రాంతమంతాకలయతిరిగింది.
ఎక్కడ తన ఆప్తవృద్ధమిత్రుని జాడకానరాలేదు.
వెదకివేసారి మళ్ళీ ఈ ప్రాంతానికి రానక్కర్లేదని బాధపడింది..
మ్రోడువారినయెదలోనుండి కార్చకన్నీరులేక నిట్టూర్పులతో నిష్క్రమించిందా మేఘం!!!!
పై భావాన్ని ఆటవెలదుల్లో ప్రయత్నించాను..!
జలదమొకటి మిన్ను సంచరించుచు పెద్ద/
తరువు చేరె ప్రేమ ధార కురియ!
నా యిరువురి మధ్య ననుబంధమేర్పడి/
యెంతయో బలపడె నేటికేడు!
కాల మహిమ నకట గ్రామమ్ము పట్నమై/
తరువు తొలగి వెలసె స్తంభమొకటి!
వర్ష ఋతువునందు వచ్చుమేఘము తన/
చనవరి కనరాక చకితుడయ్యె!
వెదకి యలసిసొలసె, వృద్ధమిత్రుని జాడ/
తెలియరాక మబ్బు దిగులు చెందె!
నిలువలేక నచట నిట్టూర్చి జలదమ్ము/
మరల రాననుచును మరలి పోయె!
చెట్టులేని తావు ’చినుకుదారి’క* రాదు/
తానులేక చిగురు దాల్పదు తరు/
విట్లు బంజరయ్యె వేడిగాడ్పులనూరు!
కంటనీరు కార్చ గగనమయ్యె!
*చినుకుదారి - మేఘము - ఇకరాదు
మత్తేభం.
ఒక గ్రామమ్మున పెద్దచెట్టునొక పాథోదమ్ము మైత్రీవశా/
దకలంకమ్మగు ప్రేమధారలిడు తానాలింగనాబద్ధమై!
యొకనాడా చిరుపల్లె పట్నమయి పోనూడ్చెన్ తరుశ్రేష్ఠమున్!
చకితుండయ్యెను మిత్రుడుండు దరి గాంచన్ దీపపుంకంబమున్/
వికలంబై జలదమ్ము నీరస మతిన్ వీడ్కొల్పెశోషిల్లుచున్!వికలంబై జలదమ్ము నీరస మతిన్ వీడ్కోలిడెన్, తా చనెన్!వికలంబై జలదమ్ము నీరస మతిన్ వీడెన్ మనోవేదనన్!
20, డిసెంబర్ 2020, ఆదివారం
గాలి పటము - ఖండిక
గాలి పటము - ఖండిక
ఆటవెలదులు:
గగనవీధిలోన గాలిపటమొకటి/
యెగిరె స్వేచ్ఛ తోడ నెగసి
పడుచు/
మేడ దాటి యెగిరె మిద్దె దాటుచు
పోయె/
తేలి పైకి పోయె గాలిపటము! (1)
పక్షి గుంపులోన పక్షివోలెనెగిరె!
మేఘ మాల తోడ మేలమాడె!
పవను బలము తనకు బాసటై నిలువగా/
తేలి పైకి పోయె గాలిపటము! (2)
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఇదివరకు వాట్సాప్ లోనే ’ క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో త...
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...


