27, అక్టోబర్ 2026, మంగళవారం

కౌపీన సంరక్షణార్థం..!!

కౌపీన సంరక్షణార్థం..!! 
-----------------------------------

తే. గీ.

ఊరి వెలుపలి యడవిలో నొక ముని తన
శిష్యుతో గూడ నుండెను చిన్న కుటిని
ధ్యానమున నిమగ్నుడగునా తాపసికిని
సేవ చేయును దీక్షతో శిష్యు డెపుడు!

తెల్లవారగ యువయతి పల్లె కేగి
వీథులన్నిట తిరుగుచు బిచ్చమెత్తి
దొరికి నంతకు తృప్తితో తిరిగివచ్చి
వండి పెట్టును గురునకు భక్తి కలిగి!

ఇటుల నుండగ నొకనాడు ఋషికి కలిగె
నిచ్చ తీర్థయాత్రల సేయనే వలెనని!
యంత శిష్యుని కాశ్రమంబప్పజెప్పి
వెడలె క్షేత్రముల్ దర్శింప ప్రీతి తోడ!

వటువు తానొకండె మిగిలె కుటిని; యాశ్ర
మమును బహుజాగరూకుడై మనసు బెట్టి
నిర్వహించుచు నుండగా నిష్ఠ తోడ
మూషికమ్ములు మితిమీరి పోరు పెట్టె!

ఇల్లుపీకి పందిరివేసె నెలుకలు; తన
కున్న రెండు గోచీలలో నొకటి కొరికి
పేలికల జేయ, నాతడు విసుగు పుట్టి
పిల్లి నొకదాని తెచ్చెను విరుగుడెంచి!

ఎలుకలగుపడ్డ వెంటనే యెక్కడైన
వాని పని పట్టె పిల్లి తా పరుగు లెత్తి
కొలది దినములలో చచ్చె నెలుకలన్ని
యతి ప్రశాంతత నొందగా! నంతలోనె -

పిల్లి పిల్లలఁ బెట్టెను పేర్మి మీఱ
పాలు పోయ కూనలకిక వీలు లేక
శిష్యు డడుగగా దానమిచ్చెనొక పాడి
యావు దాతలు వానికి నాదరమున!

పిల్లులకు పాలు, లభియించె నెల్లపుడును
కాని గోవుకు సరిపోవు గ్రాసము కొర
కనుచు గుడిసెకు ప్రక్క నున్నట్టి భూమి
చదును చేయుచు వరి నాటె శ్రమ పడి యతి!

అనతి కాలము ననె పంట యంది రాగ,
కూలి వారల రావించి కొలువు నిచ్చి
కొలుచుకొని, ధాన్యరాశులన్ కొట్టు గదుల
కట్టి, భద్రమ్ము సేసెను గాదెలందు!

కృషిని చేసెడి భూమిని వృద్ధి చేసి
పెద్ద భూస్వామి యయ్యెను పిన్న యతియు
పెండ్లి యాడెను చక్కనౌ పిల్ల జూచి!
శిశువు పారాడె నింటిలో శీఘ్రముగను!

అట్లు సన్యాసి సంసారి యై దినముల
గడుపుచుండగ యాత్రకు వెడలిన ముని
తిరిగి వచ్చి, యాశ్రమమది తెలియరాక
జాడ నడిగెనా యింటను చాకరుఁగని,

'ఏది యిట నుండు నాశ్రమ? మేడి వటువు?
వెడల గొట్టిరో యతనిని బెదరగొట్టి?'
యని యడుగుచుండ నాశిష్యు డరుగు దెంచి
భక్తి పూర్వకముగ మునిన్ స్వాగతించె!

ఛాత్రుఁ గని మౌని యాశ్చర్య చకితుడగుచు
నింత హంగు, పటాటోప మేల యనగ
నదియ ' కౌపీన సంరక్షణార్థ ' మనుచు,
గురుచరణములఁ బడె యతి శరణకోరి!  

-----------------------------

రాధేశ్యామ్ రుద్రావఝల
26.10.2026

 

7, అక్టోబర్ 2026, బుధవారం

పగటి కలల బాపఁడు

మరొక కథకు పద్యం.
-----------------------------
పగటి కలల బాపఁడు

-----------------------------
ఆ. వె. 
బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి,
వీథులందు తిరిగి బిచ్చమెత్తి, 
దొరికినంత పిండి తోడ నేదో కాస్త 
కడుపు నింపు కొనుచు  గడుపు చుండ!

అలసుఁడు = సోమరి

ఆ. వె. 
తల్లి యన్నపూర్ణ దయచేత నొక నాడు
యాయవారమందు నబ్బురమన
పిండి నిచ్చి పంపె పెద్దింటి యిల్లాలు
గంప నిండుగాను కరువు దీర!

ఆ. వె. 
ఇల్లు చేరగ వటువెగిరి గంతులు వేసి
ముదము మీర పిండి మూటకట్టి
చిలుక కొయ్యఁ గట్టె ఎలుకలకు జడిసి
యందకుండులెమ్మ నంచు నరసి! 

ఆ. వె. 
తిరిగి తిరిగి వచ్చు తిరిపెంపు బాపడు  
మంచమున పరుండె మగత గాను!
నావహింప నిద్ర యావలించు నతని
యూహ లందు తేలె నొడలు మరచి!

తే. గీ.
"కలిగె బియ్యపు పిండి కావలసినంత!
మూడుపూటల తిన్నను, బోలెడంత! 
సరుకు మిగులును కరువులో చాలినంత!
నగదు కమ్మెద, ధర నాకు నచ్చినంత!

తే. గీ.
అందు కలిగిన లాభము నంత కంత
జేయగా వర్తకమునునే  జేతు! నెంత!?
నొక్క యేడాది కార్జింతు ఊరి కంత-
ధనికుడననిపించు కొనగ తగిన యంత!   

తే. గీ.
అపుడు పెద్దింటి వారికి యల్లుడనయి,
కూర్మిని కళత్రమందొక కొడుకును కన,
వాడు గృహమంత పారాడి యాడుకొనుచు,
నాదమరిచి చొరబడు తా నశ్వశాల!

తే. గీ.
“గుఱ్ఱములు త్రొక్కు నాముద్దుఁ గుఱ్ఱ, వాని  
నెత్తుకొమ్మని నేనెంతొ మొత్తుకుంటి!
ప్రక్క నున్ననాలి యులుకు పలుకు లేదు,
పనినియుండెనొ, నా మాట వినగలేదొ!

తే. గీ.
సరగుననె నాదు బిడ్డను చంకకెత్తి
యాగ్రహమ్మున కాలెత్తి “యాలి వీపు 
పగుల తన్నెద” నని తన్నె బలముతోడ!
దారగ తలచి మూటను తన్నినంత,
యొలికి పోయెను పిండంత తెలివి వచ్చె!

తే. గీ.
చేత నున్న దిండును తన శిశువు గాను
కొయ్యకున్నట్టి మూటయే కోమలి యని
పగటి కలలను కను వెర్రి బాపడు తన
కబ్బిన యిసుమంత సిరిని, యక్షయమని -
తేలి ఊహల, చేతల తూలి పోయి
మన్ను జేసె నిటుల కాల దన్ను కొనుచు!













---------------------------------------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
6.10.2026

2, అక్టోబర్ 2026, శుక్రవారం

పండితుడు

 



మరొక
కథకు పద్యం

---------------------
పండితుడు
---------------------

(తేటగీతికథామాలిక)

నదిని దాటుచు నుండిరి నరులు కొంద/

రా పడవను కలండొక యయ్య వారు!

బహుళ భాషలు నేర్చిన పండితుండు!

శాస్త్ర పారంగతుడతడు చదువులందు!

 

ఉబుసు పోని విశారదు డుత్సహించి 

ప్రక్క నుండిన నొక పల్లె బైతు జూచి 

మాట కలుప నెంచె నదిని దాటుదాక

హాయిగా కాలమును వెళ్ళదీయ నిట్లు:


'అబ్బి! యే యూరు మీది?' "యేరవతలి దరి/

గ్రామ!"- 'మేమి సేసెద వీవు?'- "రైతునండి!"

'నాగురించి చెప్పెద విను! నాల్గు వేద/

ములు నుపనిషత్తులను వడ పోసినాను!


వింటివా వాని గూర్చి?'- "లే, వినగ లేదె!"

'యరెరె! నీబ్రతుకున పావు వ్యర్థమాయె !

తెలియునా నీకు శాస్త్రముల్?'- "తెలియవు దొర!"

'యకట! నీ మనికి సగము వ్యర్థమాయె ! 


పోనిలే! షడంగము లేవొ జ్ఞానమున్న/

దా?'- "యవియును తెలియదు నా కయ్య గారు!"

"హారి! బ్రతుకు ముప్పాతిక వ్యర్థమైన' 

-దనుచు నిట్టూర్చె పండితు! డంతలోన--


గాలి మారెను, మబ్బులు క్రమ్మెను, సుడి/

లోన చిక్కెను నావ, యా వాన లోన/

పడవ యూగి తూగ, తెరచాపలను దించి/ 

హెచ్చరించెను నావికు డీది చేరు/

డొడ్డు కనుచు ప్రయాణికు లులికి పడగ!


పల్లెటూరి బైతు వణుకు పండితుఁ గని-

"తమరి కీదుట వచ్చని తలచెద" నన 

నతడు - 'ర ర రాదె - నా కీత''- యనె తడబడి,

యొడలు కంపింప భయమున హడలిపోయి!


"ఐన మీజీవనము పూర్తి వ్యర్థము గద!

ప్రాణ సంకటమందున పనికి రాని/

చదువు లింకెందు కవివట్టి చట్టు బండ/"-

లనగ బుద్ధి వచ్చె మన విద్యాధికునకు/

వరద దాటించి దరిజేర్చె పల్లె వాడు!

-------------------------------

రాధేశ్యామ్ రుద్రావఝల 

3.10.2026


పారంగత - ఒడ్డు దాటినవాడు

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు