23, జూన్ 2018, శనివారం

అరిషడ్వర్గములు

అరిషడ్వర్గముల మీద తెలుగుబాల మకుటంతో వ్రాసిన పద్యములు:

కామము/ఆశ:
ఆ.వె.

ఆశ యుండవచ్చు నవనిలో నరునకు/
తనకు వలయు వరకు తప్పులేదు!
అవసరమును మించి యాశించ కుండగ
తృప్తి కలిగి యుండు తెలుగు బాల..!

క్రోధము:
ఆ.వె.
క్రోధమదియెనిప్పు కుంపటి వంటిదౌ
కారుచిచ్చు వోలె కాల్చు నెపుడు/
క్రోధమతికి జగతి కూరిమి కరవు, క్రో
ధితుల దూరముంచు తెలుగు బాల!

లోభము:
ఆ.వె.
లుబ్ధుడనగ జగతి లోగల యపకీర్తి
మాపి పొందుటెట్లు మంచిపేరు?
ప్రోగు చేయ నెపుడు పుణ్యము లోలతన్
తెరువు గాను బ్రతుక తెలుగుబాల..!

మోహము:
ఆ.వె.
మోహమదియె పాశ మాహాయన తగులు
త్రెంచవలెను గాని పెంచవలదు
లంపటములు పెరుగు కంపవలెను గాన
దృష్టి తప్పనీకు తెలుగు బాల!

మదము:
ఆ.వె.
విద్య, యౌవనమ్ము, ఉద్యోగము మగువ,
ధనము, కులము రూపు ధాన్యముల నె
యాశ్రయించి తనరు నష్ట మదములవి
దృష్టి కలిగియుండు తెలుగుబాల!

మత్సరము:
ఆ.వె.
మత్సరమ్ము కలిగి మహిలోన విద్యలో/
వృద్ధినొంద గలవు వేది వగుచు/
ఇతరములను కలుగ నిడుముల పాలౌదు/
తెలియవలెను నీకు తెలుగు బాల!

అంతఃశత్రువులు:
ఆ.వె.
ఆరు "లోనిశత్రు" లన్నిటిని క్రమముగా/
నిగ్రహించ వలెను నిష్ఠ తోడ/
నియతి యదియె రక్ష నిలువగ లోవ్యక్తి
తెలియుమిదియె నిజము తెలుగు బాల!

- రాధేశ్యామ్ రుద్రావఝల

12, జూన్ 2018, మంగళవారం

ధనములేనివాడె ధన్యజీవి

ఆ.వె.
లేదు లేద నొకడు రేయి పవలుడిగి/
ధనము చేత బడగ స్థలము కొనెను/
కర్మ చాలక నది కబ్జాకు గురియాయె!
ధనము లేనివాడె ధన్య జీవి..!

11.06.2018

ఆ.వె.
క్రోధమదియెనిప్పు కుంపటి వంటిదౌ
కారుచిచ్చు వోలె కాల్చు మనసు/
క్రోధమతికి జగతి కూరిమి కరవు, క్రో
ధనము లేనివాడె ధన్యజీవి/

ఆ.వె.
ధనము చేతగాని పని మానవత్వము/
సాధ్య పరచు నదియె చక్కగాను/
మానవతయె లేని మనిషికన్నను పాడు/
ధనము లేనివాడు ధన్య జీవి..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
12.06.2018

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు