24, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్యా పూరణము: అమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!

సమస్య: 
అమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!

నా ప్రయత్నం: 

ఉత్పలమాల:
"అమ్మలగన్న యమ్మ" యని యా ముగురమ్మల వేల్పుఁ, జాల పె/
ద్దమ్మను తా మదిన్ దలచి యా కవి పోతన  వ్రాయబూనె, కా/
వ్యమ్ముగ  విష్ణుగాథలను భాగవతంబు తెనుంగు జేయ, నా/
యమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల 

12, అక్టోబర్ 2023, గురువారం

ఆముక్త మాల్యద లోని పద్యానికి తేటగీతిలో భావానుసరణ:



శ్రీకృష్ణ దేవరాయల కృతి ఆముక్తమాల్యదలో వర్షఋతు వర్ణన :
ఆముక్త మాల్యద/ 4-118

చంపకమాల.

తడితల డిగ్గి ముంప జడతం దుది ఱెప్పలఁ గన్ను విప్పి పు/
ల్పొడచుచు నీరు ముంగరలపోలిక ముక్కునఁ గూడ నోటఁ గొం/
తొడియుచు గూఁటి కఱ్ఱ సగమెత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా/
వడకుటె గాక చేష్టుడిఁగె పక్షులు వక్షము జానువుల్ చొరన్!

*********
ఆముక్తమాల్యద లోని పై పద్యానికి తేటగీతిలో నా ప్రయత్నం:

వానజోరుకు తడవగ పక్షుల తల/ 
లా జలంపు బిందువు కన్నుల కొనకు డిగి /
పులుగు ఱెప్పలార్పగ, నంత పొలుపుమీరి/ 
ముక్కుకొనజేరి ముత్యపు ముక్కెరౌచు! 

గూటిచితుకులు తడవగ, తాఁటి కొనుచు/ 
రెక్క లల్లార్చి చలి సోక నొక్క క్షణము/ 
వణికి తమ పక్షముల చేర్చి వక్షములకు/ 
పిట్టలుండెను చెట్లపై బిఱ్ఱ బిగిసి! 

*********

తమ సవరణతో పద్యాన్ని అందంగా మలచిన గురువులు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారికి నమస్కారములు, ధన్యవాదములు.

🙏🙏🙏🙏


- రాధేశ్యామ్ రుద్రావఝల 
12.10.2023

9, అక్టోబర్ 2023, సోమవారం

న్యాయస్థానములు..!

ఆ.వె.
పాత రాతి కట్టు భవనపు గదులవి/
కప్పు నాని పోయి కారు చుండు/
ఘనము వాని చరిత గతమహో యనగను/
కూలిపడక నిలచు కోర్టు హాళ్ళు..!

ఆ.వె.
నలుపు గౌను తొడిగి పలు వాదనమ్ముల/
వినుచు తీర్పులీయ విసుగులేక/
పెద్దగద్దెమీద పేరిమి కూర్చున్న/ 
జనుల వేలుపతడు జడ్జిగారు!

ఆ.వె.
నల్ల కోటు వేసి న్యాయదేవత సాక్షి/
కాగితముల దొంతు కౌగలించి/
గాలి లేని యిరుకు గదులలో వాదనల్/
నడుపు నతని పేరు న్యాయవాది!

ఆ.వె.
తెలుపు యూనిఫార్ము నెలమి జడ్జి కడను/ 
నిలచి యెర్ర పగిడి తలను దాల్చి/ 
యరుణపు పటకానెగుర వేయుచు జనుల/ 
మూడుసార్లుపిలచు వాడు ప్యూను!!

ఆ.వె. 
దీనులగుచు మిగుల దిక్కులు చూచుచు/ 
చెమట గ్రక్కుకొనుచు చింతపడుచు/ 
తమను పిలుతు రనుచు తలుపుల వ్రేలాడు/ 
కర్మ కాలి వారు కక్షిదార్లు!

- రాధేశ్యామ్ రుద్రావఝల
7.06.2018

**************************************
దీనికే కొనసాగింపు:
ఆ.వె.
బల్ల కలదు కాని పైకప్పు మరి లేదు/
కలదు స్టూలు కాని గచ్చు లేదు/
ఒక్క కేసు కోసమురక లెత్తుచునుండు/
చెట్టు కింద ప్లీడ రిట్టు లుండు..!

యేచూరి చంద్రశేఖర మూర్తి అని మామిత్రుడి ఐడియా ని నేను పద్య రూపంలో వ్రాసినది.. 
(07.06.2018)

శిక్ష: 
ఆ.వె.
శిక్ష పడ్డవాడు చెడ్డవాడనికాదు/
పడనివాడె మంచివాడు కాదు/
శిక్షపడినపిదప చెడ్డేది మంచేది 
యన్నినొక్కరీతి నెన్న బడును..!!

తే.గీ.
దొరకు నంత వరకు పెద్ద దొరలు కాని/
దొంగలౌదురు వారలు దొరికినంత/
దొరకకుండగ దొంగలై దోచుకొనుట/
దొరలకే సాధ్యమౌనట్టి దొంగవిద్య!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(9.06.2018)

7, అక్టోబర్ 2023, శనివారం

రాయలవారి మీద మరొక పద్యం..!

ఇప్పుడే రాయలవారి మీద మరొక పద్యం ప్రయత్నించాను..!

సీ.
బ్రహ్మ చేసిన సృష్టి వైవిధ్యమౌరీతి/
కల్పించితీ వొక్క కావ్యమునను!
విష్ణుతేజముతోడ పృథివి నేలంగ స్థి/
రముగ నిల్చెను నీదు రాజ్యలక్ష్మి !
కదనాన నీ తీక్ష్ణ ఖడ్గచాలనమున/
రుద్రాంశ దునిమె శత్రువుల తరిమి!
దిక్పాలకుల తోడి దేవేంద్ర సభఁ బోలి/
తీరె నీ సభ యష్ట దిగ్గజముల!

తే.గీ.
యిన్ని యంశలు నొకనిలో నెట్లు కలిగె/
నెన్ని పుణ్యాల ఫలమవో ని ద్ధరిత్రిఁ/
బుట్టి, నడయాడి, పాలించి, పొలుపు మీఱ/
కీర్తి శిఖరాల నందితి కృష్ణరాయ!
సాహితీ సమరాంగణ సార్వభౌమ!

- రాధే శ్యామ్ రుద్రావఝల
07.10.2023
🙏🙏🙏

సవరణ (12.10.2023) : 

సీ.
బ్రహ్మ చేసిన సృష్టి వైవిధ్య మెల్లను /
కల్పించితీ వొక్క కావ్యమునను!
విష్ణుతేజముతోడ పృథివి పాలించి  స్థి/
రముగ నిల్పితి నీదు రాజ్యలక్ష్మి !
కదనాన నీ తీక్ష్ణఖడ్గవైదగ్ధి రు /
ద్రాంశతో దునుమాడి తరుల తరిమి!
దిక్పాలకుల తోడి దేవేంద్రు విభవాన  /
తీర్చితి సభ నష్టదిగ్గజముల!

గీ.
నిన్ని యంశలు నొకనిలో నెట్లు కలిగె/
నెన్ని పుణ్యాలఫలమవో యి ద్ధరిత్రిఁ/
బుట్టి నడయాడి పాలించి పొలుపు మీఱ/
కీర్తి శిఖరాల నందితి కృష్ణరాయ!
సాహితీ సమరాంగణ సార్వభౌమ!

- రాధేశ్యామ్ రుద్రావఝల


పద్యములో తగు సవరణలు సూచించిన శ్రీ రామారావు మాస్టారికి, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.🙏🙏🙏

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు