తేటగీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తేటగీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2025, బుధవారం

అష్టవిధ పుష్పార్చన

శ్లో.

అహింసా ప్రథమం పుష్పం

పుష్పమింద్రియ నిగ్రహం

సర్వభూతదయా పుష్పం

క్షమా పుష్పం విశేషతః

శాంతి పుష్పం తపః పుష్పం

ధ్యాన పుష్పం తథైవ చ

సత్యమష్టవిధం పుష్పం

శంభోః ప్రీతికరం భవేత్

నా అనువాద ప్రయత్నము:

తే. గీ.

ఎరుగగ ప్రథమ పుష్పమహింస, యింద్రి

యమ్ము లణచుట, భూత దయయును, క్షమము

శాంతియు, తపము ధ్యానము, సత్యములను

నష్ట విధ పుష్పయుతమౌ సమర్చనమ్ము

శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!

********

నాల్గవ పాదానికి మా శ్రీరామారావు మాస్టారి సవరణ:

అష్టవిధ కుసుమార్చన - శిష్ట‌మరయ

శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!

రాధేశ్యామ్ రుద్రావఝల

15.07.2025


🙏

పోయిన వారం మిత్రులు రాధేశ్యామ్ గారు అనువాద మందించిన మూలశ్లోకమునకు నా యనువాద యత్నము.


ఎడిట్:

మా మిత్రులు శ్రీ సాహితీ సామ్రాజ్యం గారి అనువాదం:

హింస చేయకునికి నెన్నగ తొలిపుష్ప;

మింద్రియముల నిగ్రహించు టొకటి;

భూతదయయు నొక్క పుష్పమనగ నొప్పు;

క్షమము మరియు నొక్క సుమము గనగ;

శాంతి తపము లరయ చక్కని కుసుమముల్; 

ధ్యాన మరయ నొక్క యలరు జూడ;

సూనృతమ్ము నొక్క సూన; మీ యెనిమిది 

/యలరు లంది యలరు నష్టమూర్తి.


మాస్టారుకు ధన్యవాదములతో.....

🙏

22, ఏప్రిల్ 2021, గురువారం

కవిత్వమెలా పుడుతుంది..!?


తే. గీ. (పంచపాది)
గుండెలోతులందున తడి యుండి నపుడు/
బీజమాత్రపు భావము వికసితమగు/
రాత్రి దాగుండి భూమిని చిత్రముగను/  
తెల్లవారగ కనబడు పల్లవముగ/
బయలు పడును చైతన్యమై భావకవిత..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(29.05.2018)

కవితాభావన అనే బీజం చిగురించాలంటే, గుండె లోతులలో 'తడి' ఉండాలి.
అది తగలగానే, భావనా బీజం వెంటనే చైతన్యవంతమై, చిగిర్చి, పైకి వచ్చేస్తుంది - రాత్రి లేక, తెల్లవారగానే దర్శనమిచ్చే మొలకలా!


శ్రీ డా. రామ్ ప్రసాద్ గారు చెప్పిన పై భావాన్ని పద్యరూపమున నుంచుటకు ప్రయత్నించాను.

6, మార్చి 2018, మంగళవారం

శివుడు..!!

ఆ.వె.
గంగ యనిన నీకు జంగమ కడు ప్రీతి
సిద్ధమీవు మరొక యుద్ధరణికి
నీదు శిరము తనకు నెలవు జేసినగాని
తనివి తీరకున్నదా త్రినేత్ర ?


కందము:
కోరడు క్రతువుల తపముల
చారెడు భస్మమును పూయ సంతసమందున్!
మారేడుదళమ దొక్కటి
పారగ నభిషేక జలము పైనిడ చాలున్!

5, మార్చి 2018, సోమవారం

భూమాతపై పద్యములు

తే.గీ.
సస్యమనుపేర యేతల్లి స్తన్య మిచ్చు?
నడుగకనె సంపదల నిచ్చు యమ్మ యెవరు?
ఓరిమికి జనని యెవరు  మారుపేరు ?
కొలుతునా మాత భూదేవి కూర్మి మీర!!

కం.
పుట్టగ పెరుగగ బ్రతుకగ
గిట్టగ నీ వొడిని జేసి క్రీడా స్థలిగా
కట్టడి మీఱుచు, నీగతి
పట్టని నీ సుతుల నేల పాలించెదవో!

తే.గీ.
సవతి శ్రీదేవి తాను చంచల యగుటను
నీవె యుండుటచేతను నిశ్చలముగ
అవతరించెను నీనాధు డన్నిమార్లు
పుడమి, నీపైని ప్రేమతో, పుణ్య చరిత!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు