మరొక కథకు పద్యం.
-----------------------------
పగటి కలల బాపఁడు
-----------------------------
ఆ. వె.
బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి,
వీథులందు తిరిగి బిచ్చమెత్తి,
దొరికినంత పిండి తోడ నేదో కాస్త
కడుపు నింపు కొనుచు గడుపు చుండ!
అలసుఁడు = సోమరి
ఆ. వె.
తల్లి యన్నపూర్ణ దయచేత నొక నాడు
యాయవారమందు నబ్బురమన
పిండి నిచ్చి పంపె పెద్దింటి యిల్లాలు
గంప నిండుగాను కరువు దీర!
ఆ. వె.
ఇల్లు చేరగ వటువెగిరి గంతులు వేసి
ముదము మీర పిండి మూటకట్టి
చిలుక కొయ్యఁ గట్టె ఎలుకలకు జడిసి
యందకుండులెమ్మ నంచు నరసి!
ఆ. వె.
తిరిగి తిరిగి వచ్చు తిరిపెంపు బాపడు
మంచమున పరుండె మగత గాను!
నావహింప నిద్ర యావలించు నతని
యూహ లందు తేలె నొడలు మరచి!
తే. గీ.
"కలిగె బియ్యపు పిండి కావలసినంత!
మూడుపూటల తిన్నను, బోలెడంత!
సరుకు మిగులును కరువులో చాలినంత!
నగదు కమ్మెద, ధర నాకు నచ్చినంత!
తే. గీ.
అందు కలిగిన లాభము నంత కంత
జేయగా వర్తకమునునే జేతు! నెంత!?
నొక్క యేడాది కార్జింతు ఊరి కంత-
ధనికుడననిపించు కొనగ తగిన యంత!
తే. గీ.
అపుడు పెద్దింటి వారికి యల్లుడనయి,
కూర్మిని కళత్రమందొక కొడుకును కన,
వాడు గృహమంత పారాడి యాడుకొనుచు,
నాదమరిచి చొరబడు తా నశ్వశాల!
తే. గీ.
“గుఱ్ఱములు త్రొక్కు నాముద్దుఁ గుఱ్ఱ, వాని
నెత్తుకొమ్మని నేనెంతొ మొత్తుకుంటి!
ప్రక్క నున్ననాలి యులుకు పలుకు లేదు,
పనినియుండెనొ, నా మాట వినగలేదొ!
తే. గీ.
సరగుననె నాదు బిడ్డను చంకకెత్తి
యాగ్రహమ్మున కాలెత్తి “యాలి వీపు
పగుల తన్నెద” నని తన్నె బలముతోడ!
దారగ తలచి మూటను తన్నినంత,
యొలికి పోయెను పిండంత తెలివి వచ్చె!
తే. గీ.
చేత నున్న దిండును తన శిశువు గాను
కొయ్యకున్నట్టి మూటయే కోమలి యని
పగటి కలలను కను వెర్రి బాపడు తన
కబ్బిన యిసుమంత సిరిని, యక్షయమని -
తేలి ఊహల, చేతల తూలి పోయి
మన్ను జేసె నిటుల కాల దన్ను కొనుచు!
---------------------------------------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
6.10.2026
7, అక్టోబర్ 2026, బుధవారం
పగటి కలల బాపఁడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఇదివరకు వాట్సాప్ లోనే ’ క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో త...
-
ఇటీవల వాట్సాప్‌లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి