20, డిసెంబర్ 2020, ఆదివారం

గాలి పటము - ఖండిక

గాలి పటము - ఖండిక

ఆటవెలదులు:

గగనవీధిలోన గాలిపటమొకటి/
యెగిరె స్వేచ్ఛ తోడ నెగసి పడుచు/
మేడ దాటి యెగిరె మిద్దె దాటుచు పోయె/
తేలి పైకి పోయె గాలిపటము!              (1)

పక్షి గుంపులోన పక్షివోలెనెగిరె!
మేఘ మాల తోడ మేలమాడె!
పవను బలము తనకు బాసటై నిలువగా/
తేలి పైకి పోయె గాలిపటము!              (2)

ఎగిరె నటొకసారి, యిటువైపు కొకసారి/
పోయి పైకి పటము మూలకెగిరె!
గగనమంత చిత్ర గతులలో నెగురుచు/
వింత చేష్టల కడు విర్రవీగె!                 (3)

ఎవరు సాటి నాకు నెగురగా వినువీథి/
యనుచు తలచి గర్వమందె మిగుల!
తనను దాటి పోవు ఘనులులేరనుచును/
చాల పైకి పోయె గాలిపటము!             (4)

అచటి నుండి చూడ నంగుష్ఠ మాత్రమై/
కానవచ్చె సకల ప్రాణికోటి!
పట్టరాని దయ్యె పరితుష్టి పటమున/
కింక పైకి యెగుర నిచ్ఛ కలిగె/            (5)

అంతకంత యెగుర యత్నించెనది, కాని/
విఫలమయ్యె మరిక వీలు లేక!
నేమి హేతువొ పరికించి చూచినయంత
దారము కనిపించె తనను పట్టి!             (6)

ఓసి హీనురాల! యులుకు పలుకు లేక/
నన్ను పట్టితేమె నంగనాచి!?
నావిహారమునకు నట్టు పెట్టగ నీవు
దాపురించితివి గదా పెనగగ!               (7)

నట్టు = ఆటంకము

అన్న గాలిపటము నాశ్చర్య పడుచును/
దారమిట్టులనియె దాని జూచి/
యొకరి కొకరు లేక యొరిగిపోదుము కదా/
యేల తమరికి మరి యింత పొగరు!?     (8)

కట్టుకొనగ నన్ను గాలిపటమ! నీకు/
పట్టుబడెను యెగురు నట్టివిద్య!
భంగపడెదవీవు స్వైర విహారిణి/
తోడులేక నేను జోడు లేక!                  (9)

విన్న గాలిపటము విరుచుకు పడి దార/
మును పుటుకున ద్రెంచె పొమ్మని విడి!
విసిరినట్టు లెగిరె వెనువెంటనే పట
మాకసంబు నుండి యవని వైపు!          (10)
 

మేఘపటలి నుండి మిద్దెల ఢీకొట్టి/
తరుల శాఖ లెన్నొ తగులుకొనుచు/
జారె చినిగి చిన్న సందున దీనతన్/
సిగ్గుతోడ పటము చితికిపోయె!            (11)
 

తల్లక్రిందులయ్యె దర్పము సర్వము/
రెప్పపాటులోన; గొప్పలన్ని/
ధ్వంసమాయె, పటము దారితెన్నులు లేక/
యెగిరిపోయె ధైర్య మిగిరిపొగ!               (12)  

తనకు బలిమి యనుచు తలచిన పవనుడు/
త్రుళ్లి పడ పటమును త్రోసి వైచె!
నడ్డటంచు తలచి యాధారమైనట్టి/
దారమును పొగరున తానె త్రెంచె!         (13)
 

పిల్లగాలి వీచె మెల్లగా నటువైపు
పలకరించె గాలి పటము జూచి!
సేదదీర్చి దాని చింతను పోగొట్టి/
హితవు తెలియజెప్ప నిట్లు పలికె/         (14)
 

కట్టు త్రెంచుకొన్న కారణంబున కదా/
నేల రాలితీవు గాలిపటమ!
అదుపు లేని స్వేచ్ఛ నాశించి నీవిట్టి/
స్థితిని బడసితివని తెలిసికొనుము!
          (15)
 

నాకు తెలిసివచ్చె నాదోషమంతయు/
బుద్ధికలిగి యుందు పోడిమి నిక/
కలసియుందునెపుడు కలుగ సౌఖ్యమ్మని/
గర్వము విడి పలికె గాలిపటము!            (16)
 

పటముకై వెదకుచు బాలుడు వచ్చెను!
చిరుగు లన్ని బాగు చేసి కొనెను!
దాని బొడ్డునందు దారము కట్టెను!
పటము పొందె పూర్వ వైభవమును!       (17)

తప్పు తెలిసికొనగ దారము విడువక/
నంబరమును తాకు సంబరాన/
పవనుని జత గూడి పైపైకి యెగయుచు/
కనుల విందు జేసె గాలిపటము!            (18)

- రాధేశ్యామ్ రుద్రావఝల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు