31, అక్టోబర్ 2019, గురువారం

’క’ గుణింతపు పద్య ప్రహేళిక

ఇటీవల వాట్సాప్‍లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆసక్తి ఉన్నా లేకపోయినా, మనకి ఆసక్తి ఉంటుందని భావించిన మన మిత్రులు ఇది మనకి తప్పక షేర్ చేసి ఉంటారు. వారు చదివారా లేదా అనేది వేరే సంగతి..! అలాగే మనం కూడా అదే కారణం చేత ఇంకొందరికి చేర్ చేసి ఉంటాము. అలా ఒరిజినల్ గా షేర్ చెయ్యబడిన ఆ ప్రహేళికని యథాతథంగా వ్రాసి, తరువాత నేను దానిలో చేసిన సవరణలని మీ ముందు ఉంచుతాను.
********************************
Original Post Shared on WhatsApp:
తెలుగు మీద మక్కువ వున్నవారికి
వారాంతములో మెదడుకు మేత.

*****

ఇది ఒక పద్య ప్రహేళిక సమాధానాలన్నీ వరుసగా 'క' గుణింతములోనే వుంటాయి. ప్రయత్నించండి.

1.కమ్మగా చెవికి సోకి కంచికేగినవేవి?
2.పితరుల పిండమే పిట్ట తినును?
3.వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి?
4.సింహపు బలమున్న జెట్టి యెవరు?
5.జలముల నింపుగ జమజేయు పాత్రేది?
6.బాటలు నాలుగెచ్చోట గలియు?
7.విష్ణువేపేరున వెలసి ద్వాపరమున ?
8.ఆదిత్య దేవుని కనుకూల మణియేది?
9.రథమున కెయ్యది రాణ గూర్చు?
10.అడవులకే రాణి యంపించె  రాముని?
11.రాయంచ లెట విహార మొనర్చు?
12.కూయన కూయని కూసెడు పులుగేది?
13.చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది?
14.పద్యరాజమ్మని పదుగురందురు దేని?

విద్య నేర్చిన బాల విప్పవమ్మ.

"పైని ప్రశ్నల బరికించి వానికెల్ల
పేర్మి గూర్చ జవాబుల నేర్పుగాను
కాంచరో చదువరులార 'క' గుణింతమును
కమ్మనౌ పద్యమ్మున నిమ్ముగాను

పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వరుసగా  'క' గుణింతములోనే  ఉంటాయి. కనుక్కోండి చూద్దాం.

**************************************
కాస్తంత పద్యాలతో పరిచయం ఉంటే ఈ ప్రహేళికను చక్కని సీస పద్య మాలికగా గుర్తించడం పెద్ద కష్టమేమీకాదు...! కాని ఛందస్సు పరంగా చూస్తే  పద్యంలో అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు  దొర్లాయి. ఇది ఎవరు వ్రాశారో, ఏనాటిదో తెలియదు. కాని ఫార్వార్డు చేసిన వారు ఆ ప్రహేళికను పద్య రూపంలో కాక కొన్ని వరుస ప్రశ్నల వలె ఇచ్చి సమాధానాలను ఊహించమన్నారు.

మొదట సీసపద్యం ఛందస్సు చూద్దాం.
సీస పద్యం లో మొదటిపాదంలో నాల్గు ఇంద్ర గణాలు, రెండవ పాదంలో రెండు ఇంద్ర మరియు రెండు సూర్యగణాలూ ఉంటాయి. ఇదేవరుసలో రెండేసి పాదాల చొప్పున కనీసం నాలుగు జతలుండాలి, అత్యధికంగా ఎన్ని ఉండొచ్చు..? ఎన్ని జతలైనా ఉండవచ్చు. (అంటే మొత్తం పాదాల సంఖ్య సరిసంఖ్య అయి ఉండాలన్నమాట) సీసపద్య పాదాలు ముగిసిన తరువాత ఒక ఆటవెలదితో గాని, తేటగీతి్తో గాని ముగించాలి అన్నది నియమం. అలాగే తేటగీతికి కూడా పాదాల సంఖ్య లో పరిమితి లేదు( కనీసం నాలుగు పాదాలు ఉండాలి).
నేను , ఈ నియమాలకు లోబడి, పై పద్యంలో నాకు చేతనైనంతవరకు సవరణలు చేసి ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించాను. అవధరించండి:

సీస మాలిక:
కమ్మగా చెవి సోకి కంచి కేగినవేవి? 
పితరుల పిండమే పిట్ట తినును?
వెన్నుడు సారధి యెన్నఁగా నెవరికి?
సింహపు బలమున్న జెట్టి యెవరు?
జలముల నింపుగ జమజేయు పాత్రేది?
బాటలు నాలుగెచ్చోట గలియు?
విష్ణువేపేరున వెలసె ద్వాపరమున ?
******
విద్య నేర్చిన బాల విప్పవమ్మ! 
ఆదిత్య దేవుని కనుకూల మణియేది?
రథమున కెయ్యది రాణ గూర్చు?
అడవులకే రాణి యంపించె  రాముని?
రాయంచ లెట విహారములొనర్చు?
కూయన కూయని కూసెడు పులుగేది?
చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది?
పద్యరాజమ్మని పదుగురందురు దేని?
విద్య నేర్చిన బాల విప్పవమ్మ!

తేటగీతి:
పైని ప్రశ్నల బరికించి వానికెల్ల/
పేర్మి గూర్ప జవాబుల వేగముగను
కాంచరో చదువరులార 'కా' గుణింత
మును పదముల మొదటి వర్ణముగ గలుగగ
కమ్మనౌ పద్య మందున నిమ్ముగాను!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(08.08.2019)

(******ఎనిమిదవ పాదంలో Technical గా చూస్తే తరువాత గుణింతంలో కాబట్టీ కౄ తో మొదలయ్యే పదం ఉండాలి. కాని ఎన్ని నిఘంటువులలో చూసినా అలా మొదలయ్యే పదం కనబడలేదు. అందుకని ఒక విరామం ఇచ్చినట్టుగా ఉంటుందని సీసపద్య పాదాల్లో ఆఖరు పాదమైన ’విద్య నేర్చిన బాల విప్పవమ్మ!’ నే ఎనిమిదవ పాదంగా ఉపయోగించాను. అలాగే తేటగీతి ని నాలుగు పాదాలలో ముగించడం కుదరలేదు అందుకని ఒరిజినల్ పద్యంలోని భావాన్నే పంచపాదిగా వ్రాశాను)
ఇప్పుడు జవాబులు చూద్దాం:

1. క - కథలు  , 2. కా - కాకి, 3, కి -  కిరీటి, 4. కీ - కీచకుడు, 5. కు - కుండ లేదా కుటము, 6. కూ - కూడలి, 7. కృ - కృష్ణుడు, 
8. ******, 9. కె - కెంపు,  10, కేతనము, 11. కై - కైక, 12. కొలను, 13. కో - కోయిల, 14. కౌ - కౌముది 15. కంద పద్యము

నా ప్రయత్నం సఫలమైందని భావిస్తున్నాను.

16, అక్టోబర్ 2019, బుధవారం

నవ్వు

ఆ.వె.
అంటు వ్యాధికాద దైనగాని తగులు/
నంటుకున్న పిదప వ్యాప్తి చెందు/
కనుల నీరు తెచ్చు కడుపు పగలగొట్టు/
చెవులవరకు సాగి చెలగు నవ్వు..!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు