సీసమాలిక.
స్వచ్ఛమౌ చిరు గాలి పలుకరించెనుగాని,
మోముపై ముసుగులు ముఖ్యమాయె!
చేతుల శుభ్రము చేసికొన్నను గాని,
కరచాలనమునకు కలుగు భయము!
బంధుమిత్రులు తీరుబాటుగా నుండినన్,
కలవలేము భుజము కలుపలేము!
నలభీము తలపించ బులపాటమున్ననూ,
విందుకొకరి నైన పిలువ లేము!
వాహనములు లేక బాటలన్నియు ఖాళి,
హేలగా కారును త్రోల లేము!
పనికి పోవగ రోజు మనసు లాగేను,
వా
రాంత సెలవులకు నంతు తెగదు!
ఆ.వె.
ధనము కలుగ నేమి తరుగు మార్గము
లేదు!
నిర్ధనుడది పొందు నియతి లేదు!
ఆత్మబంధువైన నాఖరి చూపుకు,
నోచబోము మిగుల నులుసు జెంద!
(నులుసు = న్యూనత)
ఆ.వె.
కాలమాగెను కడు కడగండ్లు పెంచుచు,
పుడమిజనులకెల్ల పుట్టి ముంచ!
(నవకతవక కాగ హాని కలిగె!)
ఇంతఁజేయు పాపి యంతట నిండియు
కానరాదు నది కరోన క్రిమియె!
- రాధేశ్యామ్ రుద్రావఝల
04.05.2020