29, ఏప్రిల్ 2022, శుక్రవారం

నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్! - సమస్యాపూరణము

 

నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్!

పై సమస్యకు నా పూరణ:

అభిమన్యుడు నిహతుడై యుండుట చూచి అర్జునుడు విలపిస్తూ కృష్ణ ధృష్టద్యుమ్నులతోనూ తన సోదరులు నలుగురితోనూ ఇలా అంటున్నాడు:

ఉత్పలమాల:

వావి తలంచరైరి చిఱు ప్రాయము వాఁడని యెంచకే, సుభ/

ద్రా వనితాసుతున్ సమర రంగము నందున చంపె హంత లా/

కావరమెల్ల చెండెద! కకావికలౌదురు గాక చూడరే/

నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్!

చచ్చిపడిఉన్న తన ప్రియసుతుని చూచి అర్జునుని దుఃఖిస్తూ ఇందరు యోధులున్నారు నా కొడుకును ఒక్కరైనా రక్షించలేకపోయారా అంటే ధర్మరాజు, మిగతా ముగ్గురు సోదరులూ ధృష్టద్యుమ్నుడూ ఆ జయధ్రథుడు అడ్డుపడ్డాడు, అందువల్ల మేమేమీ చేయలేకపొయామన్నారు.

కృష్ణునితో నువ్వుకూడా ఇది నివారించ లేకపోయావా? నీకు స్వయానా మేనల్లుడే, నువ్వు తలుచుకుంటే సాధ్యం కాకపోయేదా అని నిష్ఠురాలు ఆడాడు.

తాను దగ్గర ఉంటే తన కొడుక్కి ఈ దుర్మరణం సంభవించేది కాదని తలుస్తూ ఆ హంతకులనందరి కావరాన్ని దునుమాడి కకావికలు చేయడం నువ్వు చూస్తావు, నువ్వు చూస్తావు.. అని ఆరుసార్లు అన్నాడు ఆరుగురివైపు చూస్తూ..!!

అంటే నా పరాక్రమాన్ని చూసి నేర్చుకోండి అన్నట్టు అన్నమాట..! అలా ఆరు సార్లు అనడంలో ధర్మరాజు, మిగతా ముగ్గురు సోదరులూ, కృష్ణుడూ, ధృష్టద్యుమ్నుల (మొత్తం ఆరుగురు) పట్ల ఒక తిరస్కారం, తూష్ణీభావం కనిపించేలాగా చూపవచ్చునన్న ఉద్దేశ్యంతో పూరణకు ఈఘట్టాన్ని ఎంచుకున్నాను.

మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ..!

- రాధేశ్యామ్ రుద్రావఝల

21, ఏప్రిల్ 2022, గురువారం

శ్రీ సీతారాములపై ఇదివరకు వ్రాసిన కొన్ని పద్యాలు..!

వసంతతిలకము.

క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/
మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/
గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/
శ్రీరాముడై వెలసి సీతను పెండ్లి యాడన్/
తారావళిన్ గదిసి దామము కూర్చరే; ప/
న్నీరున్ సుగంధముల నెయ్యముతో శిరంబున్/
శ్రీరస్తుతోఁ జిలకరింపరె యమ్మలారా!

🌸🌸🏹🏹🏹🌸🌸

సీసము:
నాగేటిచాలులో నాడు మందసమందు/
ముద్దులొలక జూచి మురిసి జనక/
రాజర్షి చేకొనె లక్ష్మివచ్చెనటంచు/
తనయగా నిను పొంది ధన్యుడయ్యె..!
శివధనుర్భంగమున్ జేయనెవరిశక్య/
మతడె యగును గాక యల్లుడనుచు/
రాజలోకమునెల్ల రావించె నీతండ్రి/
పెండ్లిజేయనీకు వేడ్కతోడ!

ఆ.వె.
సంభ్రమమున మునుగ సభలోనివారెల్ల/
దశరథాత్మజుండు దండిమగడు/
తపసి యాజ్ఞ దాల్చి తమ్ముడుప్పొంగగా/
విల్లు నెత్తె నిన్ను పెండ్లియాడ!

🌸🌸🏹🏹🏹🌸🌸

ముత్యాలసరము:
రామచంద్రుడు చాపమెత్తగ/
సంబరము పులకింత వింతను/
కన్నులే విప్పారజూచెను/
సీత యుత్సుకతన్!

సూర్యవంశజు చూపు సోకగ/
సహజధర్మము నామె కన్నులు/
ముడుచుకున్నవి సిగ్గుతోనవి/
కువలయేక్షణకున్!

🌸🌸🏹🏹🏹🌸🌸

కందము:
అరవిచ్చిన కన్నుల విరి/
శరముల సంధించె సీత, సరిజోడుగ దా,
శరథియె నారీలోకా/
భరణమ్మును వలచెనూత్న వధువును పెండ్లిన్! 

మురిపెము వైదేహి కనుల/
విరితూపులు సోకి హృదిని ప్రేమను నింపన్/
మురహరుడా స్త్రీలోకా/
భరణమ్మును వలచె నూత్న వధువును పెండ్లిన్!

🌸🌸🏹🏹🏹🌸🌸

కందము:
సీరము తాకిన నేలను/
తారస పడి జనకునింట తా వర్ధిల్లెన్/
మా రాజ్యమునే మెట్టెను/
తారక రాముని సతి మము ధన్యులజేయన్! 

🌸🌸🏹🏹🏹🌸🌸

ఉత్సాహము:
కోతి తనదు శక్తి తెలిసి కొనుట, వార్ధి దాటుటన్/
సీత జాడ నెఱిఁగి వచ్చి చెప్పుటయును, కపివరుల్/
సేతు బంధనమును వేగ జేసి లంక జేరి యా/
నాతి గావుటేమి వింత? నడువ ’రామ’ దండుగన్!

🌸🌸🏹🏹🏹🌸🌸


కందము.
రామా అగణిత సద్గుణ
ధామా మమ్మాదుకొనుము దశరథ రామా
నామమ్మది మదితలచిన
తామసమును తొలగజేయు తారకరామా/

🌸🌸🏹🏹🏹🌸🌸

వసంతతిలకము.
శ్రీరామ నామపు పరీమళ మాకళింపన్/
శ్రీరామ పాదముల సేవన భాగ్య మందన్/
శ్రీరామ నామమది జిహ్వను దాల్చి యుండన్/
శ్రీరామ కీర్తనము సేయరె బంధులారా!

🌸🌸🏹🏹🏹🌸🌸

- రాధేశ్యామ్ రుద్రావఝల 

జగదీశుడు రాముడు



చంపకమాల:
తన మృదుభాషణంబు తన ధర్మపరాయణతల్ బలంబుగా/
వనచర సేన తోడ, పెను వారధిఁ గట్టి, పయోబ్ధి దాటి, భీ/
షణ రిపు దానవాగ్రణిని చంపెను తాను మహాద్భుతంబుగా/
నినకుల భూషణుండు జగదీశుడు రాముడు మార్గదర్శియై!

- రాధేశ్యామ్ రుద్రావఝల

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు