21, ఏప్రిల్ 2018, శనివారం

దక్షయజ్ఞం - ఖండిక

                దక్షయజ్ఞం         
ఉ.        దక్షుడు చంద్రుపై కినిసి దారుణశాపము నిచ్చినంత ఫా/
            లాక్షుని వేడగన్ శశిని నౌదల దాల్చిన యాహరున్ పయిన్/
            కక్షను పెంపుజేయ నొడిగట్టె నిరీశ్వరయాగమున్ తపో/
            దీక్షను కల్గు గర్వమున, దేవతలందరు కాదుకాదనన్!                          1

కం.       పిలువని పేరంటమునకు/
తలపుననైన చనవలదు తనవారైనన్/
పలికిన తన పతి పలుకుల/
తలవక నా సతి వెడలెను తనపిత దరికిన్                                             2

ము.      పలుకరింపరు క్షేమ మడుగరు/
తల్లి యును చెల్లెండ్రు చెలులును/
కుమిలి యవమానమున తండ్రిని
చేరె దుఃఖమతిన్!                                                                        

కం.      చేయుదువా యపచారము
చేయుచు నీ హోమకర్మ శివునిం దెగడన్!
చేయకు కులనాశమ్మును
చేయకు మపరాధమింత శివునికి తండ్రీ!                                             4

కం.       అని పలుకు సతిని దక్షుడు
గనె నిప్పులు గ్రక్కుచున్న కన్నుల తోడన్
తన కోపమెంచకనె, చం
ద్రుని శిరమున దాల్చె శివుడు, ద్రోహి! యనంగన్!                                5

వినిన సతికి తండ్రి పలుకు లాయె శూలసదృశములు
ఘోరమగు నగౌరవము సహింపలేక మాటరాక
నచట నిల్వ మనసుగాక తిరిగిపోవ తెరవులేక
మదిని పతికి చివరి జోత చేసి దగ్ధమాయెను సతి!                                  
 
ఫాలనేత్రుడు సతి వియోగము తాళలేకను రుద్రుడయ్యెను/
దక్షయజ్ఞ వినాశనమ్మును తత్క్షణము తాఁ జేయబూనెను/
ప్రళయకాల భయంకరాకృతి రౌద్రతాండవ మాడదొడగెను/
జూటమందొక జటను నేలకు తాటగా ప్రభవించె నంతను/                      7

అతిభయంకర వీరభద్రుండా శివప్రతిరూపమాతనె/
యుగ్రరూపము నగ్నిశిఖ వలె వ్యగ్రతన్ తా దక్షునిన్ గని/
హుమ్మనుచు పెనురవము జేయుచు క్రమ్ముకొని పదునైన పరశున/
దక్షు శిరమది యొక్క వ్రేటున తరగి వేసెను కుండమందున/                     8

హాహకారము చేసిరందరు నాభయంకరదృశ్యమున్ గని/
భయదవిహ్వలు లౌచు నతిథులు పరువులెత్తిరి వాటికన్ విడి/
వీరభద్రుడు ప్రమథగణములు వేడ్క తోడను చెలగి వీఁకను/
స్వామికే నపరాధమెంచిన వారి చెండిరి సరగు నంతను/                           9

ము.      దక్షయజ్ఞము ధ్వంసమాయెను/
గర్వమంతయు ఖర్వమాయెను/
హరుని కాదని యతడు చివరకు/
మేష శిరమున మిగిలిపోయెను!                                                     10

ము.      హరునికిన్ వ్యధ తప్పదాయెను,
 ఆలి శవమును విడువడాయెను!
 లోకమున్ పాలించు దేవర
 ద్రిమ్మరిగ మారెన్!                                                                        11

ము.       చక్రి యాసతి శరీరము తన
చక్రమున్ ఖండముల జేయగ
మోహమున్ మది వీడి శంకరు
డరగె తపమునకున్!                                                                     12

 

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు