21, ఏప్రిల్ 2018, శనివారం

గిరిజా కళ్యాణము - ఖండిక

గిరిజా కళ్యాణము
కం.
గిరిరాజ సుతగ నిండగు
దరహాసము తోడ, నపుడు దాక్షాయణియే
మరలను దయించె పుడమిని 
పరమేశుని జేర సతిగ  పార్వతి యౌచున్!                                    1
కం.
పసితనము నుండి యుమ తా
పసి వలె కేశముల జటలు, వల్కలు గట్టెన్
మసిపూసికొని  విభూతిగ
వసపోసిన భంగి, శివుని పలుకులు పలికెన్!                                  2
ఆ.వె.
పూర్వ జన్మపు స్మృతి ముదమార కల్గెనో
గౌరి పొంద గోరె హరుని పతిగ
తపసి నారదుండు తథ్యమది యనంగ
తపముజేయ బోయె తరుణి యపుడు                                          3
ఉ.
చర్విత చర్వణంబులగు శైవపురాణము లాలకించుచున్
పర్వత మౌని కూటమి, తపస్విను లెల్ల సమాదరింపగన్ 
సర్వపదార్థముల్విడచి శర్వుని బొందగ తానపర్ణయై
పార్వతి దీక్షబూనె హిమ పర్వత సానువులందునుగ్రతన్!               4
ఉ.
ఆకృతి ఫాలనేత్రు విరహాకృతి కన్బొమ తీరు స్వామి నా
మాకృతి కన్నులన్ ప్రభు నిజాకృతి కైశిక మందు నీశు జూ
టాకృతి దేహమంతటను నయ్యుమ పోలెను నీలకంఠు, స
ర్వాకృతి జూడగానపుడు నా శివు నర్ధము తానె యై తగన్!            5
తారకాసురుని ఆగడములు మితిమీరినవి.
ఉత్పలమాల:
శ్రీరమణీ విభున్ సురలు సేవలు జేసి ప్రసన్ను జేయగన్
వారల దీనతన్ దెలిసి బాపు నుపాయము దెల్పె నంతటన్!
క్రూరుడు తారకాసురుని కూల్పగ శక్యము శర్వు పుత్రుకిన్!
గౌరిని రుద్రదేవు సతిగా నొనరింప శుభంబు కల్గెడిన్!                   6
కందము:
సురపతి పనుపున కాముడు
హరుపై విరిశరము వేసె నతి లాఘవతన్/
తెరిచెను తిగకన్ను శివుడు
మరుడాయెను భస్మ మతని మానిని వగవన్!                                  7
తిగకన్ను: మూడవకన్ను     
ఆ.వె.
కరుణ జూపుమనుచు కాముని ఇల్లాలు/
వేడుకొనగ శివుని వేయి నతుల/
కనికరించె హరుడు కాయము లేకుండ/
జేసి మరుని జేసె జీవితునిగ!                                                           8
ఆ.వె.
శివుడు మరలిపోయె చేసికొన  తపము,
మరుని బాణమేదొ మదిని నాటె!
నతడు భస్మమాయె నాతని శరముల/
గాయమేదొ మరుల గలుగజేసె!                                                        9
కందము:
మెచ్చగ పార్వతి భక్తిని/
వచ్చెను హరు డామె కడకు పరికింపంగా/
నిచ్చకములాడె సరసత/
మచ్చిక నా తరుణి చేరి మనసున్ తెలియన్!                                   10
ఉత్పలమాల:
ఎవ్వతెవీవు సుందరి మునీశ్వర దుర్గమమీ వనమ్మునం
దెవ్వరి కోసమింత తప మేటికి చేయుదు వేమి కల్గునో?
జవ్వని! నాదు మాట విను జంగమ, భిక్షువు చిచ్చుకంటి నీ
కొవ్వడు, నన్ను జేరుమిక నో సఖి నీకు సగమ్ము పంచెదన్!           11
కందము:
పలికిన యాగంతకుగని
యొలకగ కన్నీరు కంట నుక్రోషమునన్
పలుకులు తడబడుచుండగ
తలపడె క్రోధమున గౌరి త్ర్యక్షుని తోడన్                                           12
ఆ.వె.
పూవువోలె నుమను పొదివి పట్టె శివుడు
శుభగ రూపమంది సుందరునిగ
సంభ్రమంబు తోడ జలదరింపగ మేను
చిక్కె మీననేత్ర సిగ్గు మొగ్గ!                                                              13
ఆ.వె.
ఆదిదంపతులగు యా గౌరిశంకరుల్/
తిరిగి యొక్కటైరి మురియ జగతి/
హర్ష మతులు కాగ నఖిల దేవగణము/
పుష్పవృష్టి కురిసె పుడమినపుడు!                                                                14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు