24, ఆగస్టు 2019, శనివారం

బ్రతుకు పయనం

ఆ.వె.
బ్రతుకు వింత గొలుపు పయనమ్ము చూడగా/
మార్గసూచి లేదు! మలుపులెన్నొ/
కలల తీరమనెడు గమ్యమ్ము చేరగా/
మలచ వలెను బాట మనకు మనము!!

ఆ.వె.
బ్రతుకు చూడ వింత  పయనమ్ము, దానికి/
మార్గసూచి లేదు! మలుపులెన్నొ/
కలల తీరమనెడు గమ్యమ్ము చేరగా/
మలచ వలెను బాట మనకు మనమె!!

- రాధేశ్యామ్ రుద్రావఝల
2.03.2019

23, ఆగస్టు 2019, శుక్రవారం

విష్ణుపదము

ఉత్పలమాల:
శ్రీ వనితా కరాంబుజ  సుసేవిత పాద యుగమ్ము దల్చెదన్/
పావని గంగ జన్మమయి పాఱెడు పాద యుగమ్ము నంటెదన్/
దేవమునీంద్ర సన్నుతుల తేలెడు పాద యుగమ్ము గొల్చెదన్/
తావగు నన్ని పుణ్యముల తానగు విష్ణు పదంబు జేరగన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల (30.10.2017)

మానవ జన్మఫలం పొందాలంటే..?

ఉత్పలమాల:
కర్మల నాచరింపగను కామితముల్ తగ నిగ్రహించి యం/
తర్ముఖుడై మనంబునను దైవము నిత్యము నిల్పి యుంచి తా/
ధర్మము వీడిపోక పర ధర్మము నెన్నడు సేయకుండు నా/
మర్మమెరుంగగా వలయు మానవ జన్మఫలంబు పొందగన్//

- రాధేశ్యామ్ రుద్రావఝల
(21.05.2018)

దీపావళి పద్యం, నవంబరు 2018

ఉత్పలమాల:

దివ్వెల బారులన్ గృహము తీరగు వెల్గుల సంతరింపగన్/
పువ్వుల చిచ్చుబుడ్లు, మెరుపుల్ వెదజల్లెడు చక్రశోభలన్/
రవ్వల కాకరొత్తులును రంగు మతాబు, పటాసు, జువ్వలున్/
సవ్వడి సేయుచుండ నిట సంబరముల్ గగనమ్ము నంటెడిన్/

- రాధేశ్యామ్ రుద్రావఝల
దీపావళి, నవంబరు 2018

శ్రీకృష్ణదేవరాయలు

ఉత్పలమాల:
రాయలు తేజరిల్లె రణరంగము నందున విక్రమించుచున్/
రాయల పాలనంబు రఘు రాముని ఛత్రపు ఛాయయై తగన్/
రాయల కావ్య కన్యకను ప్రాభవమందగ విష్ణుడే గొనన్/
రాయల కీర్తి చంద్రికలు రాజుల కీతడె రాజనంగ మా/
రాయలె రాజరాజు కవి రాజు జగంబుల వెల్గజేయగన్!

ఇవాళ మా పద్య సౌందర్యం సమూహంలో స్వీయకవితాంశము శ్రీకృష్ణదేవరాయలు..!

1.04.2019

సవరణ:
ఇదివరకు మొదటిపాదం :
రాయలు తేజరిల్లె సమరాంగణ మందున విక్రమించుచున్/ అని వ్రాశాను. కాని అది అఖండయతి యన్న సంగతి కన్నుదాటిపోయింది. అందుకని రణరంగమునందున అని మార్చాను.
23.08.2020

16, ఆగస్టు 2019, శుక్రవారం

దీనుడైనంత మాత్రాన హీనుడు కాదు!

ఆ.వె.
దీనుడైనవాని హీనుడనుచునెంచి
యపహసింపబోకు మహముతోడ
నేడు కలుగు సిరి యనిత్యమను నిజము
తెలిసి వ్యవహరించు తెలుగు బాల!

ఆదర్శములు - తెలుగుబాల!

ఆ.వె.
ఆచరింపనట్టి యాదర్శములు గల/
సూక్తులెన్ని తెలియ ముక్తి యేది?
తలచియూరుకొనక తత్పర బుద్ధివై/
దీక్షతోడ మెలగు తెలుగుబాల!

(11.05.2019)

మతమును మించి మానవత, మంచిని పెంచుటె మేలనందగున్!

ఆకాశవాణి గత పక్షపు సమస్య:
మతమును మించి మానవత, మంచిని పెంచుటె మేలనందగున్!

నాపూరణ:

చంపకమాల:
సతతము పచ్చశోభలకు స్థావరమౌ మళయాళ భూమినిన్/
వెతలను ముంచె నయ్యొ పృథివీపతియే తన సొంత దేశమున్/
హతవిధి! నా ప్రజల్ తమ సహార్తుల కాచిరి యైకమత్యమున్ !
మతమును మించి మానవత, మంచిని పెంచుటె మేలనందగున్!

(10.09.2018)

వెలదికన్న నాట వెలది మేలు!

సమస్య:
వెలదికన్న నాట వెలది మేలు!

ఆ.వె.
రసికుడౌహితుడు సరసములాడుచు కవీ!
వెలదికన్న నాట వెలది మేలు/
గాదె యనగ విన్న కవిగారి యిల్లాలు/
కస్సుమనగ కవియు నుస్సురనెను!

ఇంకొకలా

ఆ.వె.
రసికుడౌహితుడు సరసములాడుచు కవీ!
వెలదికన్న నాట వెలది మేలు
గాదె యనగ పలికె "కాదులే మా యింటి/
వెలదిమెచ్చు నాటవెలది మేలు..!"

జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!

సమస్య:
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!

ఉత్పలమాల:

తీరగు శ్రీపతిన్ తనివి దీరగ దర్శనభాగ్యమందగన్
బారులు తీరు భక్తులకు వారథులై కడు పూజ్యభావమున్
వారక కర్ణ పేయముగ పాశురగానము చేయుచున్న పూ
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!

కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్

ఆకాశవాణి హైదరాబాదు వారిచ్చిన సమస్య:
కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్

నా పూరణ:

కం.
తిట్టక, నెన్నడు బాధలు/
పెట్టక, యనురాగ మెపుడు విరియుచు, వెన్నున్/ 
తట్టుచు తన కలతను పో/
గొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల

లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

సమస్యా పూరణం:
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

కం.
విలసద్విభవము కల్గును/
కలిమి యధిష్ఠాత్రి పూజ గరపన్ భక్తిన్!
కలనైనను నిర్లక్ష్యము/
లలనలు సేయఁదగదు, వరలక్ష్మీ వ్రతమున్!!

- రాధేశ్యామ్ రుద్రావఝల, విశాఖపట్నం

11, ఆగస్టు 2019, ఆదివారం

*శ్రీకృష్ణ పాండవీయము*


ఆటవెలదులు:
1. పాండవులను లాక్ష్య భవనము గాచెడి/
యాప్త బంధువన్న నదియె నీవు/
రాజసూయ వేళ రగడు నృపతి జంపి/
యందుకొంటివిగద యగ్రపూజ//

2. ఖాండవమ్ము నగ్ని కాల్చగ నతనిచే/
పార్థు కీయ జేసి భవ్య ధనువు,
మయుని యాజ్ఞ జేసి మయసభ నిర్మించి/
పాండవులకు యశము పంచినావు//

3. ద్రౌపదికిని మాన రక్షణ జేయగ/
నార్తరక్షకుడవు నామెకపుడు/
కౌరవుండు పంపు కపటపు దుర్వాస/
మౌని గర్వమెల్ల మాపినావు//

4. రాయబార సభను రారాజు పన్నింప/
విశ్వరూపునిగను పెరిగి నావు/
సమరసీమలోన చకితుడౌ పార్థుని/
పోరుబంటు జేయు బోధ నీది//

5. పాండు సుతుల సచివ బాంధవ సఖుడవు/
గురువు దైవ మీవె కూర్మిమీఱ/
ధర్మమదియె నిలుప ధరణి నవతరించు/
మాధవుండె యౌను మాకు రక్ష//

- రాధేశ్యామ్ రుద్రావఝల

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు