28, అక్టోబర్ 2022, శుక్రవారం

'ర్వ' ప్రాసతో మరో పద్యం..!

శార్దూలము: 

పర్వంబౌ తిన బెల్లమున్ కుడుములన్ పారంబు లేకెన్నడున్/
దూర్వాయుగ్మము, లర్కపత్రముల సంతుష్టుండదెవ్వండగున్?
గర్వంబించుకలేని యాతనిని విఘ్నాధీశు, పిళ్ళారికిన్/
సర్వాభీష్ట ఫలప్రదాతకు సదా సద్భక్తి నే మ్రొక్కెదన్! 

- రాధేశ్యామ్ రుద్రావఝల
 
 

27, అక్టోబర్ 2022, గురువారం

సమస్యాపూరణం:: విల్లును రాఘవుండయిన విక్రముడై విరువంగ జాలునే!

 విల్లును రాఘవుండయిన విక్రముడై విరువంగ జాలునే!

ఉత్పలమాల.
విల్లది ఫాలనేత్రునిది; పెండ్లి పరీక్షకు నిల్ప, నవ్వు రా/
జిల్లెడు మోముతోడ నతి శీఘ్రత ద్రుంచిన రాము గాంచగా/
నల్లన సీతసోయగము నమ్మరుశస్త్రముకాగ తీయనౌ/
విల్లును రాఘవుండయిన విక్రముడై విరువంగ జాలునే!

-రాధేశ్యామ్ రుద్రావఝల
21.09.2022

26, అక్టోబర్ 2022, బుధవారం

సంక్షేమం <-> శ్రమతత్త్వం

శార్దూలము:
దీనోద్ధారణమంచు నేటి ప్రభువుల్ దేశంబు దోచేయగా/
దానంబిచ్చిన రీతి నెల్లరకుఁ బల్ తాయంబులన్ పంచ న/
జ్ఞానంబౌ! ప్రజ కార్య సంస్కృతి, కటా, చావంగ సోంబేరులై/
దీనాలాపములాడరే! భవిత లంతే! దొందు దొందేనులే!

కార్య సంస్కృతి - Work Culture

- రాధేశ్యామ్ రుద్రావఝల

15, అక్టోబర్ 2022, శనివారం

హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన:

హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన:


శార్దూలము.
ఏమా యున్నత గోపురంబులవి తామే కీర్తినిన్ దాల్చెనో/
యేమా స్వచ్ఛ జలాశయంబులవి తామే శీలమున్ కల్గెనో/
యేమా గండ్ర శిలాచయంబులవి తామే ధీరతన్ చూపెనో/
యేమా కోమల శిల్పమూర్తులవి తామే భావముల్ పల్కెనో/
యా మా రాయల సద్గుణాళి నిలిచెన్ హంపీ కళా క్షేత్రమై!

కీర్తి ఉన్నతంగా, శీలము స్వచ్ఛంగా, ధీరత్వము కఠినంగా, భావాలు కోమలంగా ఉండే రాయలవారి సద్గుణాలకు ప్రతీకలుగా/ వ్యక్తిత్వ చిహ్నాలుగా/  గోపురాలు, జలాశయాలు, శిలా సమూహాలూ, శిల్పాలూ హంపి క్షేత్రంలో నిలిచియున్నాయి అని భావము.

- రాధేశ్యామ్ రుద్రావఝల
15.10.2022

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు