18, నవంబర్ 2022, శుక్రవారం

కాకి


ఆ. వె.

అన్నమునకు కాకి ఆకలి గొనుచును/
గిన్నె ముట్టినంత కేకలేసి,
పితరులకు ప్రపత్తిఁ బిండము పెట్టి గై/
కొనగ కాకి పిలువ మనకె చెల్లు!


- రాధేశ్యామ్ రుద్రావఝల
22.03.2022

7, నవంబర్ 2022, సోమవారం

హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన: - 2

 

 (హంపీక్షేత్ర సందర్శనానంతర spandana-1 ను చదవడానికి నొక్కండి)

హంపీక్షేత్ర సందర్శనానంతర స్పందన - 2:


చంపకమాల.
ధర జనియింపగా పనిచె దైవతశిల్పిని, హంపి భూమికిన్/
వరమిడినట్లు స్రష్టయె; స్థపత్యము సేయగ విశ్వకర్మ తా/
పరిమితి లేని కల్పన లపార శిలాకృతులందు నిల్పగా/
నరిగె; హజార రామ నిలయమ్మట కన్పడె మేన్గగుర్పడన్!!

ఉత్పలమాల.
త్రచ్చి కఠోరమౌ శిలల దాగెడు శిల్పపు సౌకుమార్యమున్ /
నిచ్చెరఁ జల్ల దాగు నవనీతము వోలె బహిర్గతంబు కా/
నిచ్చెడు శిల్పులార తమ రేకడ నేర్చిరొ యిట్టి విద్య
, తా/
మెచ్చుచు ఱాతి స్తంభముల మీట స్వరంబుల వాణి పల్కెడిన్!
   

   °•°•°•°•°•°•°•°


తే. గీ.

హంపి జయగాథ యొక యితిహాసము; ఘన/

కీర్తికెక్కిన సమ్రాట్టు కృష్ణరాయ/ 

లమర పురికేగె హంసగా; నప్రతిహత   

బింబమరిగెను తన ప్రతిబింబము విడి!


- రాధేశ్యామ్ రుద్రావఝల

06.11.2022

- రాధేశ్యామ్ రుద్రావఝల                             

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు