9, మే 2018, బుధవారం

దశావతార వర్ణన

దశావతార వర్ణన
సీస మాలిక:
మీనరూపము దాల్చి దానవు దునుమాడి 
వేదాళి రక్షించి వేధ కిచ్చె/
కూర్మావతారుడై కొండ వీపునమోసి
యమృతమ్ము సురలకు నందజేసె/
కిటిరూపధారియై క్షితినుద్ధరించుచు
వధియించె హేమాక్షు బలము నణచి/
ప్రహ్లాదు రక్షింప ప్రత్యణు వణువులో
నరసింహు నాకృతి నరయ నిలచె/
బలిని దానమడిగి బ్రహ్మాండమును మూడు
పదముల కొలిచె తానదితి సుతుడు/
తండ్రి యాజ్ఞాపించ తల్లిని కడతేర్చి,
పితృ హంతకులకెల్ల పీచమణచె/⁠⁠⁠⁠
నరునిగా జన్మించి నడయాడి భూమిపై
ధర్మాచరణ జూపె ధర్మ మూర్తి/
గోకులమునపుట్టి గోవర్థనమునెత్తి,
క్షితి భారమును ద్రుంచి గీత నొసగె/
ఆలుబిడ్డలు, రాజ్య మన్నియు విడనాడి,
బుద్ధుడై జ్ఞానమ్ము బోధ జేసె/
శ్వేతాశ్వవాహుడై శిష్టుల రక్షింప
కలియుగమున వచ్చు కల్కియగుచు/

తే.గీ.
నెపుడు గ్లాని ధర్మమునకౌ, నపుడు తానె/
యవతరించి గాచును ధర్మ మవని యందు/
నతడు స్థితికారుడాతడె యంత నుండు/
విష్ణునికి శ్రీపతికివియె వేయి నతులు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
(21.09.2017)

వేధ= బ్రహ్మ
కిటి = వరాహము
హేమాక్షుడు= హిరణ్యాక్షుడు
విష్ణువు= అంతటా నిండియుండెడి వాడు, సర్వ వ్యాపి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు