వినాయక చవితి శుభాకాంక్షలతో:
సీసము:
అమ్మ చేత నలుగె యాకారమును దాల్చి/
ద్వార పాలకునిగ తా తనరుచు/
దారివదలకున్న తండ్రి కినుక పూని/
తనయు తెలియలేక తలను నరికె/
ఉత్తరమున తలనుంచి నిద్రించెడు/
హస్తిమస్తకమును అతికి నిన్ను/
మరల జీవితుఁ జేయ మాత ముదమునంది/
కుడుముల తినిపించె కొసరి కొసరి/
ఆ. వె.
ఘనతలెన్నొ జేసి గణపతిత్వము పొంది/
గజముఖుడనుపేర గణుతికెక్కి/
మోదకముల చాల ముదమార చేకొను/
భక్త సులభ సుముఖ పార్వతిసుత!
తనరుచు: విజృంభించు
- రాధేశ్యామ్ రుద్రావఝల
సీసము (పంచపాది):
పంచలోహపుమూర్తి పనిలేదు పూజింప/
పసుపు ముద్దయె నీకు పసిడి ప్రతిమ/
ఆకాశపందిళ్ళు నీకు నక్కరలేదు/
చాలుచాలును చిన్ని పాలవెల్లి/
ఘనలేపనము లేల కస్తూరి యేలను/
గరికెపూవులెనీకు కలువపూలు/
పుష్పమాలికలతో పూజింప పనిలేదె/
ఆకులలముల నీవాదరింప/
నైవేద్యములనిడ నలుబది రకములు/
మోదకమ్ములె నీకు మురియు విందు/
ఆ. వె.
అల్పమైన పూజ నందుకొని యనల్ప/
కామ్యములను దీర్చు రమ్యమూర్తి!
అమ్మ కొడుకు వగుచు నయ్యపేరు నిలుపు/
భక్త సులభ సుముఖ పార్వతిసుత!
- రాధేశ్యామ్ రుద్రావఝల
ఉత్పలమాల:
జన్మదినంబునన్ కడుపుఁ చాలెడు కుడ్ముల నారగించి యా/
తన్మయతన్ చనన్ గనుచు తానదె చంద్రుడు గేలి సేయగన్ /
చిన్మయ! శాపమిచ్చి తివి, చేరి భజింపగ శాప పీడనం /
బున్మర లించితీవ ప్రభు!మోదక హస్త! గణేశ! పాహి మామ్!!
- రాధేశ్యామ్ రుద్రావఝల
కందము:
పన్నగపు జందియంబును
చిన్నెలుకయె వాహనంబు చిత్రము గానన్
వన్నెల మోమది యేనుగు
నన్నియు నీ యభయ ముద్ర నైక్యత మెలగున్!
పాము అంటే ఎలుకకి భయం, ఎలుక అంటే ఏనుగుకు భయం. కాని అన్నీ ఆయన అభయములో కలసి మెలసి ఉంటాయి.
- రాధేశ్యామ్ రుద్రావఝల
కన్నులు చింతాకులునవి
గున్నేనుగు తలయు బొజ్జ గుండ్రంబదియే
నున్నని దంతంబొక్కటె
ఎన్నగ గణపతిని జూడ నెన్నియొ వింతల్ ..!
కన్నులు చింతాకులునవి
గున్నేనుగు తలయు బొజ్జ గుండ్రంబదియే
చిన్నెలుక నెక్కి వచ్చుచు
నున్నాడదిగోగణపతి యొక్కడు కనుడీ
కన్నులు చింతాకులునవి
గున్నేనుగు తలయు బొజ్జ గుండ్రంబదియే
చిన్నెలుక నెక్కి వచ్చుచు
నున్నాడదిగోగణపతి యుండ్రాళ్ళకునై
ఇంకొక్క కందము:
చెన్నుగ వ్రాసితివీవట
పన్నుగ వ్యాసుడు నుడివిన పంచమ వేదం/
బన్నుగ ఘంటము నిలుపక/
విన్నాణపు ఖనివి నీవె విఘ్నేశ నతుల్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి