ఆవకాయ పద్యాలు
కందము.
ఎందెందు కలిపి తినగా/
నందందే స్వర్గ సుఖము నందించునుగా!
విందేది యైనగాని ప/
సందౌ మన ఆవకాయ సందడి చేయున్!
కందము.
ఇందు తగు నందు తగదను/
సందేహము లేదు కలుప చక్కగ
రసనా/
నందము తథ్యము! గానన్/
తిందుము మన యావకాయ తృప్తి
కలుగగన్!
కందము.
ముంగిట విస్తరిలోనన్/
గోంగూరయు నావకాయ కూర్మిని
కనగా/
నంగుటి లొట్టలు వేయగ/
సంగరమే వాని మధ్య చవులూరింపన్!
ఉత్పలమాల.
ఎర్రని యావకాయ రుచి యించుక
తగ్గదు పాతబడ్డ తా/
చుర్రనిపించు నాలుకను చొక్కున
కూడగ నన్నమున్ తగన్/
జర్రని ముక్కుకారును నసాళము
నంటగ దాని ఠేవయున్/
జుర్రుదు రెల్లరున్ పెరుగు
జోడయి నన్నము కమ్మకమ్మగాన్/
ఆ.వె.
ఆవకాయ తిన్న యానందమది మిన్న!
కూరలెన్ని యున్న చారు కన్న/
నందులోన కొంచమావకాయయె నంజు/
కున్న నదియె రంజుగుండు నన్న!
ఆ.వె.
ఊహ తోనె నోటి నూరించు నెయ్యది!?
యన్నిటికిని గొప్ప యాదరువది!
యూరగాయలందు నుత్తమంబైనది!
ఆవకాయ యనిన ఠీవి గలది!
- రాధేశ్యామ్ రుద్రావఝల
24.11.2020