ఒక మిత్రుడు పంపిన దత్తపది - సలసల, జలజల, మిలమిల, వెలవెల
చూసిన వెంటనే సరదాగా ఇలా పూరించాను.
కం.
సలసల మను గ్రీష్మమునను/
జలజల మని పాఱు ఝరిని జలకములాడన్/
మిల మిల లాడును మేనియు/
వెలవెల బోవంగ నెండ వేడిమి యంతన్!
దానిలో కవిత్వం, భావుకత ఎక్కడున్నాయి..!? అందుకని మళ్ళీ ఇలా పూరించాను:
చంపకమాల:
సలసల కాగె నాతనువు సావిరహేయన నీ తలంపునన్/
జలజల రాలె మల్లికలు జాగు సహింపక, నీదు రాకకై/
మిలమిల లాడె కన్నులివి మిన్నున తార తళుక్కులై, ప్రియా!
వెలవెల బోయె నా ముఖము, వేగమె నీచెలి చెంత జేరుమా!
- రాధేశ్యామ్ రుద్రావఝల
21.12.2020