27, ఏప్రిల్ 2021, మంగళవారం

అంతరంగం..!


పలుమారులు పిలచిన గానీ

గొంతుక పొడి బారెను కానీ
బదులివ్వని కఠినత్వం నా
కెదురౌతూ ఉంటుందెపుడూ!

ఎందుకు పిలిచానో తెలియదు!
నీకది చేరిందీ తెలియదు!
వస్తావో రావో తెలియదు..!
ఈ మోహ మదేమో తెలియదు..!

                    నా పిలుపది వినిపించదొ..! మరి
                    నీకే వినడానికి చేదో..!
                    వినబడినా నాదరి చేరగ
                    కరగదు నీ మనసది బండో..!

                    ఇది తక్షణ కర్తవ్యమ్మని
                    హృదిపై పెనుబండను మోపీ
                    మోదము కలిగించే పిలుపుని
                    వదిలేద్దా మనుకుంటుంటా!

                    నిన్నే విసిగించగ రాదని
                    పిలువగ లేనంతటి దూరము
                    పోతానని శపథము చేయగ
                    ఈ జీవితమింతేలే నని

                    అనుకుంటూ ఉండంగానే
                    భానుడు తనదోవన పోగా
                    చంద్రుడు ఉదయించెను; కాంతుల
                    వెదజల్లెను చీకటి రాత్రుల!

                    వస్తూనే చంద్రుడు నాతో
                    పదపద యిక చాల్లే అంటూ
                    యెదలోతుల భావాశ్రువులను
                    ఇకదాచేయ్ అంటాడెపుడూ..!

                    తెలియని యొక వేదనయేదో
                    గుండెను పిండేస్తూ ఉంటే
                    అది కనబడకుండా దాచే
                    ముసుగొక్కటి యిస్తావా..!?

                    చీకటినే మించిన చిక్కటి
                    ముసుగేదీ లోకంలో..!? క
                    న్నీటిని దాచేసే నేస్తం -
                    వర్షం రాదేం..!? ఇది గ్రీష్మం..!!

                    అగాథమౌ భావాంబుధిలో
                    నే కూరుకుపోగా, చీకటి
                    తన చెంగున నను దాచెను నా
                    ఒంటికి తన రంగే పూసెను..!

                    నీ తలపుల నిదురే పట్టక
                    యెరుపెక్కెన కన్నుల సాక్షిగ
                    సూర్యుడు ఉదయించెను తూర్పున..!
                    కూయని నే కూసితి చప్పున..!!


                    - రాధేశ్యామ్ రుద్రావఝల
          


25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనా సెకెండ్ వేవ్..!

ఉత్పలమాల.
ఒక్కడు మాస్కుఁ బెట్టడు; మరొక్కడుఁ బెట్టును గడ్డమందు; నిం/
కొక్కడు మీదకొచ్చు; మరి యొక్కడు తుమ్మును నడ్డులేక; యా/
తక్కిన వారతీతమని దల్చి తిరుంగ స్వతంత్రులౌచు, చే/
జిక్కగ నీ కరోన కిక చిత్రమదేమి సెకెండు వేవునన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల

22, ఏప్రిల్ 2021, గురువారం

కవిత్వమెలా పుడుతుంది..!?


తే. గీ. (పంచపాది)
గుండెలోతులందున తడి యుండి నపుడు/
బీజమాత్రపు భావము వికసితమగు/
రాత్రి దాగుండి భూమిని చిత్రముగను/  
తెల్లవారగ కనబడు పల్లవముగ/
బయలు పడును చైతన్యమై భావకవిత..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(29.05.2018)

కవితాభావన అనే బీజం చిగురించాలంటే, గుండె లోతులలో 'తడి' ఉండాలి.
అది తగలగానే, భావనా బీజం వెంటనే చైతన్యవంతమై, చిగిర్చి, పైకి వచ్చేస్తుంది - రాత్రి లేక, తెల్లవారగానే దర్శనమిచ్చే మొలకలా!


శ్రీ డా. రామ్ ప్రసాద్ గారు చెప్పిన పై భావాన్ని పద్యరూపమున నుంచుటకు ప్రయత్నించాను.

20, ఏప్రిల్ 2021, మంగళవారం

ఇంకో పేరడీ పద్యం..!

తన భార్య ఆన్‍లైన్ షాపింగ్ లో మోసపోతుందేమో అని హెచ్చరిస్తున్నాడు భర్త..!!

శార్దూలము:

నీకున్ షాపుల కేగగాను కఱవా నీచేత కార్డుండగా/
బైకుల్, కారులు త్రొక్కుచుండి తిరుగన్ వైడెస్టు రోడ్లుండగా/
సోకుల్ పోవుచు ’నాను లైను’ సరకుల్ చూడన్ విచిత్రమ్ముగా/
వీకన్ జేకొన నీ మొబైలు తగునా!? వెఱ్ఱౌటకా శ్రీమతీ!?


🙂🙃🙂

పై పేరడీకి మూలం (ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి)

నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండగా
పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప కా బోయచే
జేకొంటెంగిలి మాంసమిట్లు దగునా! శ్రీకాళహస్తీశ్వరా!

దానికా శ్రీమతి ఇలా అంది:

ఆ.వె.
పైకిపోవగాను నాకును మనసేను!
పైకి పోదు నన్న భయముతోను/
కాలు కదుపలేక, కరొనా కు జడిసి నే/
నాశ్రయించితి మరి 'ఆను లైను'!


- రాధేశ్యామ్ రుద్రావఝల

శ్రీశ్రీ పద్యానికి పేరడీ..!


'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది: 

కందము.
ఉగ్గేల త్రాగుబోతుకు/
ముగ్గేలా తాజుమహలు మునివాకిటిలో/
విగ్గేల క్రిష్ణశాస్త్రికి/
సిగ్గేలా భావకవికి సిరిసిరిమువ్వా!

******************

పై పద్యానికి నా పేరడీ:

కందము.
పక్కేలా సుఖనిద్రకు/
వక్కేలా పండ్లులేని వారికి కిళ్ళీన్/
నిక్కేలా బక్కకు, టా/
నిక్కేలా బలునకు భువి నిక్కము కాదా..!

- రాధేశ్యామ్ రుద్రావఝల 

17, ఏప్రిల్ 2021, శనివారం

ప్లవ ఉగాదికి శ్రీ కడిమిళ్ల వారి అష్టావధానం

భారతీయ స్టేట్ బాంక్ వారు, శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా గురు సహస్రావధాని శ్రీ కడిమిళ్ల వరప్రసాద్ గారి అష్టావధానం విశాఖపట్నంలో ఏర్పాటుచేశారు. సమస్యా పూరణానికి పృచ్ఛకుడిగా వారికి నేనిచ్చిన సమస్య: 
నలువకు మూడు మోములని నవ్వె ఫకాలున వాణి యంతటన్!

నలువ అంటే నాల్గు మోముల వాడు (బ్రహ్మ) ఆయనకి మూడే ముఖములు అని సరస్వతి పకాలున నవ్వించిట..! అదీ సమస్య.

దానికి శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ అవధానిగారి పూరణ:

చంపకమాల.
కలదనుకొంద్రు సృష్టియను కార్యము మాత్రము బ్రహ్మయందు రూ/
కలు గొను వాడ వింతయని కంజభవుండు లిఖించుచుండు నూ/
కలు గల విన్నియే యని ముఖమ్మున వ్రాయును నాలుగెట్లగున్/
నలువకు మూడు మోములని నవ్వె ఫకాలున వాణి యంతటన్!

పై సమస్యకు నా పూరణ:

చంపకమాల.
తలఁపున దివ్య రాగములఁ దాల్చుచు శారద వీణ మీటినన్/
తొలకరి వోలెఁ జిందె సుధ; తోయజముల్ వికసింప, దిగ్భ్రమన్/
బలె! యని నాల్గు మోములొక పాటున త్రిప్పగ, వీలుకాని య/
న్నలువకు, మూడుమోములని నవ్వె పకాలున వాణియంతటన్!

తన తలపులో దివ్యమైన రాగములను తలచికొనుచు వీణను మీటగా అమృతపు జల్లు కురిసి కమలములు విచ్చుకొంటే బలే అంటూ ఆశ్చర్యంతో (ఇక్కడ కూడా సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు విచ్చుకోవడం సహజం, కాని ఇక్కడ భార్య పాటకి విచ్చుకున్నాయి, అది ఆశ్చర్యానికి కారణం, పైగా అది ఆయన పుట్టిల్లు ) ఆవైపు చూడడానికి నాలుగు ముఖాలు త్రిప్పడానికి ప్రయతించగా, అలా కుదరదు కాబట్టీ నలువకు మూడే మోములు (అలా చూడడానికి పనికి వచ్చేవి అని – లోమాట) అంటూ శారద పకాలున నవ్విందని భావం..!

- రాధేశ్యామ్ రుద్రావఝల

మా అమ్మాయి, కుమారి కృష్ణప్రియ పురాణం విభాగానికి పృచ్ఛకురాలిగా వ్యవహరించి, పద్యాలు పాడింది.

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! - 1

కందము.
రగిలెను శ్రీమతి పతిపై/
వగచుచు "గుర్తేది మీకు పనిలో పడ మా/
యగచాట్లేవో" యనె! నిల
మగబుద్ధికి మార్పురాక మనుగడయెట్లో!?

ఇంకొకటి:-

కందము:
పగవాడు కాకపోయిన
వగ పాలౌనటుల జేయు వనితల ధరలో
తెగడుచు సాధింపగ నీ
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(15.07.2018)

ఆకాశవాణి విశాఖపట్నం వారిచ్చిన సమస్యకు నాపూరణ ఇది..!

15, ఏప్రిల్ 2021, గురువారం

మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! -2

కందము.
ప్రక్కనె యుండగ తాళము/
లెక్కడ పోయినవని తెగ యెగిరెగిరి పడే/
తిక్కల పెనిమిటితో నెక/
సెక్కము లాడుట యదొక్క శ్రీమతికె తగున్! 😀

జగమంతయు వెదకితి మరి/ 
యగుపడ లేదంచు, నాలి నడుగుట పతిదే/
వుగ నా హక్కని తలచెడు/
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! 🤷🏻‍♀️

- రాధేశ్యామ్ రుద్రావఝల
15.04.2021

4, ఏప్రిల్ 2021, ఆదివారం

వేసవిలో శివుడి సదుపాయాలు..!

చంపకమాల.
చలువకు శీత శైలమును, చంద్రుడు, గంగయు నెత్తినుండ, నీ/
వలువలు దిక్కులై గళముఁ బయ్యరమేపరి యుప్ఫనంగ నీ/
వలది విబూది దేహమున హాయిగ నాడెద వేమి గొప్ప!? నీ/
విలనొక వేసవిన్ గడుపవే తెలియున్ పస పార్వతీపతీ!


శివుణ్ణి ఉద్దేశించి వేసవిలో మనపాట్లు, ఆయనకి ఉన్న సదుపాయాల గురించి చెప్తూ వ్యాజస్తుతిలో వ్రాసిన పద్యం ఇది.

ఓ పార్వతీ పతీ, నీకు చల్లదనాన్ని కలిగించడానికి చుట్టూ మంచుకొండలు, నెత్తిమీద చంద్రుడు, గంగ ఉన్నాయి, నీవు దిగంబరుడవు (దిక్కులే అంబరములు అంటే వలువలు, వస్తాలు గాకలిగినవాడవు, కంఠానికి చుట్టి ఉండేది పయ్యరమేపరి అంటే (పయ్యర - గాలి, మేపరి - భక్షించేది) పాము. (మనం ఉక్కపోస్తే ఉఫ్ అని మెడ మీద దగ్గర ఊదుకుంటాం కదా, అలాగ శివుడికి ఎప్పుడూ అలా ఊదడానికి బుసలుకొట్టే పాములు ఉన్నాయి.) ఇవన్నీ ఉండగా పౌడర్ రాసుకున్నట్టు విబూది ఒళ్ళంతా పట్టించుకొని హాయిగా ఉంటావు. మా భూమిమీద ఒక వేసవి గడిపిచూడవయ్యా, అప్పుడు తెలుస్తుంది నీ పస ఎంతో.. అని భావం.

 

- రాధేశ్యామ్ రుద్రావఝల
04.04.2021 

3, ఏప్రిల్ 2021, శనివారం

అందం తెచ్చిన తంటా..!

ఆ.వె.
అరువదేండ్ల ముసలి యముని గని కలను/
నాయువెంత మిగిలె ననుచు నడిగె/
ముప్పదేండ్లపైని మూడుమాసములని/
యా యముండు పలికె నాదరమున!

ఆ.వె.
సంతసించి నారి చెంతనుగల వైద్య/
శాలకు చని ఖర్చు చాల చేసి/
చక్కదనము తిరిగి చిక్కునట్లు చికిత్స/
నంది పాతరూపు పొందె ముదము..!

ఆ.వె.
వైద్యశాల నుండి వచ్చిన వనితను/
నకట! గ్రుద్దు కొనియె నాంబులెన్సు!
విడిచె ప్రాణ మచటె విల విలలాడుచు/
తరుణి కాయె యముని దర్శనమ్ము!

ఆ.వె.
ఏల జేసినావొ యింతటి ఘోరము?
ఆయువెట్లు దీరె ననుచు నడుగు/
పడతి జూచి యముడు బదులిచ్చె "గుర్తింప/
కుంటినమ్మ నిన్ను కోమలాంగి!"

_(ఆంగ్లములో వచ్చిన ఒక వాట్సాప్ జోకుకి పద్యానుసరణ.)_
- రాధేశ్యామ్ రుద్రావఝల
(01.08.2019) 🙏🙏🙏

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

పంచచామర వృత్తము లో పద్యములు

ఈ రోజు పంచచామర వృత్త పద్యములు ప్రయత్నించానండి.. 🙏🙏🙏

లక్షణము:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం కలదు
  3. ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు జ , ర , జ , ర , జ , గ గణములుండును.

పంచచామరములు:

ప్రరూఢమౌచు నిష్ఠతో ప్రభాత కాలమందునన్/
పరాత్పరా! త్రిపత్ర పత్రి భక్తి పూజ సేసి, నిన్/
హరోంహరా శివా యనంగ హార్దికమ్ము, వేగమే/
పరాన చేర్చి మోక్షమిచ్చు స్వామి! నీకు మ్రొక్కెదన్!


త్రివేణి సంగమస్థలాన తీర్థమాడ బోయినన్/
భవాబ్ధి దాట శక్యమే? భవా! శివా! కృపాకటా/
క్షవీక్షణమ్ము లేక నీది! చంద్ర శేఖరా! పరీ/
క్షవెట్టబోకుమయ్య మాకు, శంకరా! సదాశివా!


శివా! యనన్య శక్తి సాంద్ర! చిద్విలాస! చిన్మయా!
భవా! సచేతనా! విరాగి! ఫాలనేత్ర! శంకరా! 
అవస్థిరా! వశంకరా! నిరామయా!  మహేశ్వరా! 
నివాసముండు నా మనంబు నిత్యమై! పరంతపా!


- రాధేశ్యామ్ రుద్రావఝల
02.04.2021

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు