2, నవంబర్ 2022, బుధవారం

సమస్యాపూరణం: నలువకు మూడు మోములని నవ్వె ఫకాలు‌న వాణి యంతటన్!

సమస్య: నలువకు మూడు మోములని నవ్వె ఫకాలున వాణి యంతటన్! 

పలుకులరాణి వాణి గని బ్రహ్మ విలాసముతోడ నిట్లనెన్ /
"చెలియరొ నాదు  చిత్రము రచింపుమ వేడ్క" నటంచు నట్లె దా /
ఫలకముపై లిఖింప కనుపట్టె త్రిశీర్షములే, "త్రయీ విధి‌న్ /
నలువకు మూడు మోము" లని నవ్వె ఫకాలు‌న వాణి యంతటన్ /

- శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారు

చలితశరస్సరస్సునను సాంద్ర సితద్యుతి పర్వువేళలో /
కలువను జాబిలిన్ దన ముఖంబును దీరుగఁ బ్రక్కప్రక్కగా/
నిలుపుచు ' మీదు బింబమిదె నీటగనంబడెఁ జూడు చూడుమా/
నలువకు మూడుమోములని' నవ్వె ఫకాలున వాణి యంతటన్//

-  శ్రీ భైరవభట్ల విజయాదిత్య గారు 

పై సమస్యకు నా పూరణ:

చంపకమాల.
తలఁపున దివ్య రాగములఁ దాల్చుచు శారద వీణ మీటినన్/
తొలకరి వోలెఁ జిందె సుధ; తోయజముల్ వికసింప, దిగ్భ్రమన్/
బలె! యని నాల్గు మోములొక పాటున త్రిప్పగ, వీలుకాని య/
న్నలువకు, మూడుమోములని నవ్వె పకాలున వాణియంతటన్!

తన తలపులో దివ్యమైన రాగములను తలచికొనుచు వీణను మీటగా అమృతపు జల్లు కురిసి కమలములు విచ్చుకొంటే బలే అంటూ ఆశ్చర్యంతో (ఇక్కడ కూడా సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు విచ్చుకోవడం సహజం, కాని ఇక్కడ భార్య పాటకి విచ్చుకున్నాయి, అది ఆశ్చర్యానికి కారణం, పైగా అది ఆయన పుట్టిల్లు ) ఆవైపు చూడడానికి నాలుగు ముఖాలు త్రిప్పడానికి ప్రయతించగా, అలా కుదరదు కాబట్టీ నలువకు మూడే మోములు (అలా చూడడానికి పనికి వచ్చేవి అని – లోమాట) అంటూ శారద పకాలున నవ్విందని భావం..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(ఇది మహా సహస్రావధాని శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారి అష్టావధానంలో నేనిచ్చిన సమస్య.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు