23, సెప్టెంబర్ 2023, శనివారం

పుత్రికల దినోత్సవమును పురస్కరించుకొని..!



అందరికీ నమస్కారమండీ..! ఇవాళ Daughter's Day సందర్భంగా వ్రాసిన పద్యాలివి..!
🙏🙏🙏

తే.గీ.
ఊహ జేసి *పుత్రికల దినోత్సవమున,*
నీదు బాల్యచేష్టలను వర్ణింపగాను!
వచ్చె నాపాత మధురాలు ప్రాత బడక/
తలపున వెను వెంటనె చిట్టి తల్లి, యిట్లు!

సీ.
ఉత్కృష్టమౌ తండ్రి యుద్యోగమందితి/
పొత్తిళ్ళలో నిన్ను నెత్తుకొనగ! 
ఉంగా యనుచు చాల నూసులాడితి వీవు/
వేళ తెలియలేదు వినుచునుండ!
దోగాడి యిల్లెల్ల దోబూచులను మము/
త్రిప్పుకొంటివి కన్ను త్రిప్పనీక!
చిన్ని యడుగులేయు చిట్టి పాపగనీవు/
గుమ్మాల దాటచో గుబులు నాకు!
శ్రుతిలోన గొంతును జతకలిపిన నాడు/
మరచితి ననునేను పరవశమున!

ఆ.వె.
నాన్న యనెడు పిలుపు విన్న యంతను పుల్క/
లెత్తి మమత పండు నెడద నిండ!
కూతురున్న యింట కూర్మియె పంట! యా/
తండ్రి కన్న నెవరు ధన్యుడిలను!?

తే.గీ.
జోడుపిలకల తోడను జోకచేసి/
మోము పౌడరద్ది, తొడిగి బుట్టగౌను, 
పూన్చి కళ్ళకు కాటుక, బుగ్గ చుక్క/
దిద్ది నినునిల్పె మీ యమ్మ, ముద్దు గాను!

తే.గీ.
మొదటి సంతానమై ప్రియ పుత్రి వౌచు/
మేర లేని యాప్యాయతన్ చూరగొన్న/
మాదు హృదయ పీఠపు రాకుమారి వీవు/
యశము, సంపద భృశముగ నందు మమ్మ!

- రాధేశ్యామ్ రుద్రావఝల 

13, సెప్టెంబర్ 2023, బుధవారం

సమస్య: చూచిననొక్కటౌను మరి చూడనిచో మరొక్కటగు

సమస్య: చూచిన నొక్కటౌను మరి చూడని చో మరొక్కటగు!
అష్టావధానము వేదిక: వై వి యెస్ మూర్తి ఆడిటోరియమ్, ఆంధ్రాయూనివర్సిటీ
అవధాని: శ్రీ తాతా సత్యసందీప్ శర్మ
పృచ్ఛకులు: శ్రీ భైరవభట్ల విజయాదిత్య గారు

అవధాని గారి పూరణ:
మధ్యాక్క
ఱ.
కాచుచు విశ్వమంతటిని గాంచదె యంబిక సతము/
ప్రోచవె యామె దృక్కులవి పూర్ణముగా ప్రజనిలను/
యోచన చేసి చూడ సమయోచిత రీతిని యామె/
చూచిన నొక్కటౌను మరి చూడని చో మరొక్కటగు!

నా పూరణ:
మధ్యాక్కఱ.
చూచితి నప్పరావనెడు షోకుల బాల్య మిత్రు, నట/
దోచిన నాదు వస్తువుల తోడ ఖుషీల చేయగను!
వేచితి కన్నుదాట, మరి వేడుక కైన వాఁడు నను/
చూచిన నొక్కటౌను మరి చూడనిచో మరొక్కటగు!

11, సెప్టెంబర్ 2023, సోమవారం

లోకరీతి..!

 సీ.
అలనాడు, చంద్రమా! యద్దము నిను జూపె/
బాలరాముని తండ్రి వైనముగను!
ఆముద్దు తీరక నా రామచంద్రుడు/
తన నామ మందున నిను ధరించె!
శాపదష్టుడ వగు శశి! నిను గాంచగా/
క్షీర ఘటమునందు కృష్ణమూర్తి/
నిందచే యలిగెనో నిన్ను దాల్పడు కదా/
నామావళిన్ తాను దీమసాన!

గీ.
సిరికి సోదరుడౌ బావ మఱది వయ్యు/
శీతకర! ముచ్చట కలుగ చేరదీసి/
తనకు నష్టము సేయ మాధవుడు దూర
ముంచె! లోకరీతి యదంతె! యుర్వినెపుడు!

6, సెప్టెంబర్ 2023, బుధవారం

మావాడు..!!

ఆ. వె.
వనమున నొకసారి వచ్చెనెన్నిక లంత/
నన్ని చెట్లు 'ఓటు హక్కు' పొందె!
కుదిరెను బరి నెదురు 'గొడ్డలి'‌ 'సెలయేరు'
నన్ను నన్నటంచు ఎన్నికలను!

ఆ. వె.
తరుల మనుగడ కవసరమగు నీరిచ్చె/ 
నేరు! గాన గెలిచి తీరును! మరి/
కూలె నెన్నొ చెట్లు గొడ్డలి వ్రేటుల/
కనుక గెల్చు తెరువు కాన రాదు!

ఆ. వె.
అనుచు బయలుదేరె నభిమతమొక్కటి/
వనము నందు చెలగి ప్రబల మయ్యె!
ఎవరు గెల్తురనుచు నెంతయో నుత్కంఠ/
పెరిగె దినదినాభివృద్ధి యగుచు!

ఆ. వె.
ఫలితమొసగువేళ బలములు లెక్కింప/
నబ్బురమున మునిగె నడవి యంత!
ఘన విజయము పొందె గండ్రగొడ్డలి, సెల/
యేరు నోటమిగని నీరుగారె!

తే.గీ.
వృక్ష జాతి పెద్దల సమావేశ పరచి/
ఇట్టి వింతైన ఫలితమ దెట్టు కల్గె/
ననగ మా ఓటు "గొడ్డలి" కనియె తరులు!
వాని వెనుక నున్నది *మన వాడె* కనుక!

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కేదారనాథ పర్వత సానువులలో ప్రకృతి

మా కేదార్ నాథ - బదరీ నాథ యాత్ర లో చూచిన ప్రకృతి వర్ణన:

సీ.
నభమంటు శిఖరాలు ప్రభుధామమై 'మంచు/
తలపాగ' తొడిగెను దర్పమొలుక!
పులకాగ్ర మైనట్టి భూరుహమ్ములు నిల్చె/
ముక్కంటికై కయిమోడ్పు లిడుచు!
శిరము నుండెడు గంగ చెంగునన్ దూకంగ/
పాయలై లోయలన్ పాదమంట!
చల్లగాలులు వీచె మెల్లగా నెల్లెడన్
శివ విభూతిని పెంపుజేయ జగతి!
లింగాకృతిన్ దాల్చి లెక్కకు మిక్కిిలై/
ప్రమథులె రాలు రప్పలుగ వరల!

తే. గీ.
ప్రకృతి కేదారనాథుని ప్రాభవమును/
రంగరించెడి ఘనత నంగాంగ మలరు/
వర్ణ సాకల్య చిత్రంపు పరిధి యెంత?
సరస హృదయ చిత్రపట వైశాల్యమంత!

- రాధేశ్యామ్ రుద్రావఝల
03.08.2023
🙏🙏🙏


ఆకాశాన్ని అంటుకుంటున్న శిఖరాలు శివుడి నివాసమైనందుకా అన్నట్టు మంచు తలపాగ తొడిగాయి దర్పంగా..!!
ఆ పులకింతలో శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఆపర్వతాల మీది వృక్షాలు నిట్టనిలువుగా నిలబడి శివుడికి నమస్కరిస్తున్నాయి..!
శిరస్సు మీది గంగ చెంగున దూకి పాయలుగా లోయలలో శివుడి పాదాలను తాకడానికా అన్నట్టు పారుతున్నది.
శివ విభూతిని (విభూతి = భస్మం, ఒక సంపద, ఐశ్వర్యము) విశ్వమంతా వ్యాపింప జేయడానికి అన్నట్టు చల్ల గాలులు మెల్లగా వీచుతున్నాయి.
ప్రమథ గణాలు లింగాకృతిలో (గుండ్రం గా) అసంఖ్యాకంగా రాళ్ళు రప్పలు గా కొలువుతీరాయి.

ప్రకృతి కేదారనాథుని ప్రాభవాన్ని తన అంగాంగములలో రంగరించి ఉన్నట్టి ఆ సంపూర్ణ వర్ణ చిత్రపు పరిథి ఎంత అంటే, మన హృదయంలో ఉన్న కేన్వాసు ఎంత పెద్దగా ఉంటే అంత..!!
మంచు తలపాగ 

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు