ఆ. వె.
మురికి యున్న గదిని చొరలేము మన, మిక
చెడిన మదిని యెట్లు చేరు హరుడు?
చిత్తశుద్ధి కలిగి సేవింప, నాతడు
హృదయకమలమందు కుదురుకొనును!
నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆ. వె.
మురికి యున్న గదిని చొరలేము మన, మిక
చెడిన మదిని యెట్లు చేరు హరుడు?
చిత్తశుద్ధి కలిగి సేవింప, నాతడు
హృదయకమలమందు కుదురుకొనును!
శ్లో.
అహింసా ప్రథమం పుష్పం
పుష్పమింద్రియ నిగ్రహం
సర్వభూతదయా పుష్పం
క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం
ధ్యాన పుష్పం తథైవ చ
సత్యమష్టవిధం పుష్పం
శంభోః ప్రీతికరం భవేత్
నా అనువాద ప్రయత్నము:
తే. గీ.
ఎరుగగ ప్రథమ పుష్పమహింస, యింద్రి
యమ్ము లణచుట, భూత దయయును, క్షమము
శాంతియు, తపము ధ్యానము, సత్యములను
నష్ట విధ పుష్పయుతమౌ సమర్చనమ్ము
శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!
********
నాల్గవ పాదానికి మా శ్రీరామారావు మాస్టారి సవరణ:
అష్టవిధ కుసుమార్చన - శిష్టమరయ
శంభునికి ప్రీతికరమగు సరణి యిదియ!
రాధేశ్యామ్ రుద్రావఝల
15.07.2025
🙏
పోయిన వారం మిత్రులు రాధేశ్యామ్ గారు అనువాద మందించిన మూలశ్లోకమునకు నా యనువాద యత్నము.
ఎడిట్:
మా మిత్రులు శ్రీ సాహితీ సామ్రాజ్యం గారి అనువాదం:
హింస చేయకునికి నెన్నగ తొలిపుష్ప;
మింద్రియముల నిగ్రహించు టొకటి;
భూతదయయు నొక్క పుష్పమనగ నొప్పు;
క్షమము మరియు నొక్క సుమము గనగ;
శాంతి తపము లరయ చక్కని కుసుమముల్;
ధ్యాన మరయ నొక్క యలరు జూడ;
సూనృతమ్ము నొక్క సూన; మీ యెనిమిది
/యలరు లంది యలరు నష్టమూర్తి.
మాస్టారుకు ధన్యవాదములతో.....
🙏
ఉత్పలమాల.
ఎవ్వరు నేర్పె కొమ్మలకు నిన్ని సుమంబులు రెమ్మరెమ్మకున్/
నవ్వుచు పూయగా ప్రతి దినంబు క్రమంబును తప్పకుండగా/
దివ్వెగ భాను బింబము ద్యుతిన్ విరజిమ్మక మున్నె వర్ణములు/
నివ్వటిలంగ జేయగను నెమ్మి వహించుచుఁ నద్దె నాతడే!
ఎవరు కొమ్మకొమ్మలకూ పూవులను క్రమంతప్పకుండా పూయడం నేర్పాడో, ఆతడే ఆ పూవులు అతిశయించేటట్టుగా ఓపికగా సూర్యోదయానికి ముందే వర్ణాలు కూడా అద్దాడు.
చంపకమాల.
దినమణి వంశ దీపకుఁడు, తీరుగ ముద్దులు మూటగట్టుచున్/
కనకపు చేలఁ గట్టి, కరకంకణముల్, మణిహారపంక్తులన్/
తనరుచు, చాపబాణముల దాలిచి, స్వర్ణ కిరీట ధారియై/
ఘనమగు గద్దెపై నిలిచి కాంతుల చిందెను బాలరాముడై!
ప్రణతుల, మేన పుల్కల శుభమ్ముల కోరుచు నా యయోధ్య రా/
ముని కనులార గాంచితిమి మోదము, భాగ్యము నంది ధన్యతన్!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
20.12.2024
ఈ నెల 13వ తేదీన అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నాం.
🙏🙏🙏
ఉత్పలమాల.
దివ్వెల బారులన్ గృహము తీరగు వెల్గుల సంతరింపగన్/
పువ్వుల చిచ్చుబుడ్లు, మెరుపుల్ వెదజల్లెడు చక్రశోభలన్/
రవ్వల కాకరొత్తులును రంగు మతాబు, పటాసు, జువ్వలున్/
సవ్వడి సేయుచుండ నిట సంబరముల్ గగనమ్ము నంటెడిన్/
కందము.
నరకుడు చచ్చిన వేళను/
సరగున జన హృదయసీమ సంబరమందెన్!
ధరణిని పేర్చిరి దివ్వెల/
వరుసల దీపావ ళియను పర్వదినముగన్!
కందము.
తాపములను చల్లార్చుచు/
మాపుచు చీకట్ల జనుల మనములయందున్/
దీపమువలె జ్ఞానమ్మిడి
దీపావళి పర్వమవని దీపించు తగన్!
చంపకమాల
పెనగొన నొక్కటై వలపు, వీరరసమ్ములు నిండ కన్నులన్/కొనరు= చచ్చు, నీల్గు
-- రాధేశ్యామ్ రుద్రావఝల
కందము .
అరి నికరము చెదరగ ప్రభు/
డురికెను రణమున తఱిగని యురిమి యురవడిన్!
గిరగిర తిరిగెడి-కరమున /
బిరబిరమని కరి యరిగెను భిదురము పగిదిన్!
మొదట వ్రాసినది:
అరి వర్గము చెండగ ప్రభు/
డురికెను రణరంగమందు నురుముచు; పరుగున్/
గిరగిర త్రిప్పుచు తొండము/
బిరబిరమని కరి యరిగెను భీకరలీలన్!
సీ.
నల్ల రాతిని జూచి నారాయణుని రూపు/
దర్శనమును చేయు ద్రష్ట యెవరు ?
గండ శిలల లోన కమనీయ మూర్తిని/
వెలికి తీసినయట్టి వేత్త యెవరు?
ఉలిని తాటించగా హొయలొల్క బండకు/
చలనము కలిగించు సరసు డెవరు?
చూచినంతనె కేలు జోడించు నట్టి ది-
వ్యత రప్ప కొసగిన వరదు డెవరు?
కొండకోనలఁబడి యెండవానల కోర్చు/
బండల కగు నెవరండ దండ?
తే. గీ.
ఒకటి ప్రాకార శిల్పమౌ, నొకటి గడప,
దేవతామూర్తిగ నొకటి సేవలందు-
శిలల భాగ్యవిధాత యౌ శిల్పి యతడు!
ఆ కళావిశారదునకు నంజలింతు!