ఉత్పలమాల.
దివ్వెల బారులన్ గృహము తీరగు వెల్గుల సంతరింపగన్/
పువ్వుల చిచ్చుబుడ్లు, మెరుపుల్ వెదజల్లెడు చక్రశోభలన్/
రవ్వల కాకరొత్తులును రంగు మతాబు, పటాసు, జువ్వలున్/
సవ్వడి సేయుచుండ నిట సంబరముల్ గగనమ్ము నంటెడిన్/
కందము.
నరకుడు చచ్చిన వేళను/
సరగున జన హృదయసీమ సంబరమందెన్!
ధరణిని పేర్చిరి దివ్వెల/
వరుసల దీపావ ళియను పర్వదినముగన్!
కందము.
తాపములను చల్లార్చుచు/
మాపుచు చీకట్ల జనుల మనములయందున్/
దీపమువలె జ్ఞానమ్మిడి
దీపావళి పర్వమవని దీపించు తగన్!
చంపకమాల
పెనగొన నొక్కటై వలపు, వీరరసమ్ములు నిండ కన్నులన్/తన కరమందు విల్లుగొని దైత్యుని పీచమడంచ నిల్చు స/
త్యను కడగంటఁ జూచె కడు తన్మయుడై ముదమార కృష్ణుడున్/
కొనరగ నామెఁ జూచె నరకుండు రణంబున సంభ్రమంబునన్!
కొనరు= చచ్చు, నీల్గు
-- రాధేశ్యామ్ రుద్రావఝల