23, ఆగస్టు 2024, శుక్రవారం

శిల్పి

 

 సీ.

నల్ల రాతిని జూచి నారాయణుని రూపు/
దర్శనమును చేయు ద్రష్ట యెవరు ?
గండ శిలల లోన కమనీయ మూర్తిని/
వెలికి తీసినయట్టి వేత్త యెవరు?
ఉలిని తాటించగా హొయలొల్క బండకు/
చలనము కలిగించు సరసు డెవరు?
చూచినంతనె కేలు జోడించు నట్టి ది-
వ్యత రప్ప కొసగిన వరదు డెవరు?
కొండకోనలఁబడి  యెండవానల కోర్చు/
బండల కగు నెవరండ దండ?

తే. గీ.

ఒకటి ప్రాకార శిల్పమౌ, నొకటి గడప,
దేవతామూర్తిగ నొకటి సేవలందు-
శిలల భాగ్యవిధాత యౌ శిల్పి యతడు!
ఆ కళావిశారదునకు నంజలింతు!

జలకాలాటలలో..


ఆ. వె. 

నీట దిగినయంత నేనుగా తీరమ్ము/ 
చేరబోను తనివి తీరకుండ!  
మేముకూడ నంతె! సామజ రాజమా,
పిలిచి యమ్మ రెండు పెట్టు దాక! 

😄😄😄

- రాధేశ్యామ్ రుద్రావఝల

22, ఆగస్టు 2024, గురువారం

చక్రి..!




కం.
చక్రము త్రిప్పెడు చక్రికి,
చక్రములో నుండి తిరుగు చక్రికి తోడై/
చక్రము సైతము తానై/
సక్రమ మార్గమును జూపు చక్రికి ప్రణతుల్!   

-- రాధేశ్యామ్ రుద్రావఝల 
🙏🙏🙏

14, ఆగస్టు 2024, బుధవారం

స్త్రీమూర్తి



ఉత్పలమాల - సప్తపాది:

పాపగ తల్లిదండ్రులకు భాగ్యమొసంగెడు లక్ష్మి యంశ వై/
ప్రాపుగనుండి నీడవయి భర్తకు, పాపకు నీవెయమ్మవై/
యాపయి నత్త మామ లెడ నాదృతిసూపెడు నాడుబిడ్డవై/
రేపవలున్ కుటుంబమున ప్రేరణ నింపెడు పెద్ద దిక్కువై/
దీపమవై గృహంబునకు, తీరుగ నొక్కతె విన్ని నేర్పులన్/
చూపగ సాధ్యమౌనని యశోవతివై ప్రజ మేలనంగ - నిం/
తీ! పలు బాధ్యతల్ నెరపు దేవత వీవని ప్రస్తుతించెదన్!

రాధేశ్యామ్ రుద్రావఝల
27.07.2024

9, ఆగస్టు 2024, శుక్రవారం

వృత్తౌచిత్యము: బలి చక్రవర్తి వామనునికి దానమీయుటకు సిద్ధమైన ఘట్టము

ఉత్సాహము:

దైత్య గురువు నీకు చేటు తథ్యమన చలింపకన్/
సత్యవాక్కు కై నిలచుచు సావధాన చిత్తుడై/
నిత్యమైన యశము పొంద నిశ్చయించి వటువుకున్
స్తుత్యుడనుచు ధార వోసె శుద్ధజలము దోసిటన్!


7, ఆగస్టు 2024, బుధవారం

గజరాజు సంరంభము - ఫోటోకు పద్యం

మత్తేభము:
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం/
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా/
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్/
నభమం దాడెడు మీన కర్కటముల న్బట్టెన్ సురల్ మ్రాన్పడన్.

భావము: 

ఆ సమయంలో, గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్య చకితులు అయ్యారు.

- పోతన భాగవతము : గజేంద్ర మోక్షణము.

ఆ. వె.
సామజవిభు డిట్టి సంరంభమును జేయ/
నుర్వియు నుడుపథము లొకటి కాగ/
నంబర మణి హస్తి హస్తాగ్రమున నున్న/
కందుకమ్ము వోలె కానవచ్చె!

భావము:

ఈ విధం గా గజరాజు సంరంభము తో భూమి ఆకాశము ఒక్కటై పోతూ ఉండగా, అంబరమణి (సూర్య బింబము) హస్తి హస్తాగ్రమున నున్న - (ఏనుగు తొండం చివరనున్న ) కందుకము (బంతి) వలె కనిపించింది.

-- రాధేశ్యామ్ రుద్రావఝల
07.08.2024

(మా 'హంస - పిపాస' WhatsApp సమూహం లో మా సారథులు డా. రామ ప్రసాద్ గారు ఉంచిన ఫోటోకు వ్యాఖ్యగా నా పద్యం ఇది.)

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు