7, ఆగస్టు 2024, బుధవారం

గజరాజు సంరంభము - ఫోటోకు పద్యం

మత్తేభము:
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం/
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా/
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్/
నభమం దాడెడు మీన కర్కటముల న్బట్టెన్ సురల్ మ్రాన్పడన్.

భావము: 

ఆ సమయంలో, గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్య చకితులు అయ్యారు.

- పోతన భాగవతము : గజేంద్ర మోక్షణము.

ఆ. వె.
సామజవిభు డిట్టి సంరంభమును జేయ/
నుర్వియు నుడుపథము లొకటి కాగ/
నంబర మణి హస్తి హస్తాగ్రమున నున్న/
కందుకమ్ము వోలె కానవచ్చె!

భావము:

ఈ విధం గా గజరాజు సంరంభము తో భూమి ఆకాశము ఒక్కటై పోతూ ఉండగా, అంబరమణి (సూర్య బింబము) హస్తి హస్తాగ్రమున నున్న - (ఏనుగు తొండం చివరనున్న ) కందుకము (బంతి) వలె కనిపించింది.

-- రాధేశ్యామ్ రుద్రావఝల
07.08.2024

(మా 'హంస - పిపాస' WhatsApp సమూహం లో మా సారథులు డా. రామ ప్రసాద్ గారు ఉంచిన ఫోటోకు వ్యాఖ్యగా నా పద్యం ఇది.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు