8, మార్చి 2018, గురువారం

పార్వతిదేవి గంగతో ఇలా అంటోంది

[8.03.2018 10:08 PM] radheshyam r:
పార్వతిదేవి గంగతో ఇలా అంటోంది:
చంపకమాల:
పెనిమిటి నెత్తికెక్కితని బింకము చూపగ నెంత దానవే
వినయము లేక నించుకయు వేడుక చేయగ చాలు చాలికన్
తనరగ నీ సుడుల్ తిరుగు తాహతు కల్గనదేమి హేతువో
కనగ మదీయ సోదరుని పాదములన్ జనియించుటే సుమా!
నాల్గవ పాదం యతి..!!
శ్రీ రవికుమార్ గారి సవరణ:

పార్వతిదేవి గంగతో ఇలా అంటోంది:

చంపకమాల:
పెనిమిటి నెత్తికెక్కితని బింకము చూపగ నెంత దానవే/
వినయము లేక నించుకయు వేడుక చేయగ చాలు చాలికన్/
తనరగ నీ సుడుల్ తిరుగు తాహతు కల్గుటకేమి కారణం/
బ? నిజము నాదు సోదరుని పాదములన్ జనియించుటే సుమా!

చంపకమాల:
పెనిమిటి నెత్తికెక్కితని బింకము చూపగ నెంత దానవే/
వినయము లేక నించుకయు వేడుక చేయగ చాలు చాలికన్/
తనరగ నీ సుడుల్ తిరుగు తాహతు కల్గెడు కారణంబు చూ/
చిననది నాదు సోదరుని శ్రీ చరణమ్ముల పుట్టుటే కదా!

6, మార్చి 2018, మంగళవారం

స్త్రీ పాత్ర

ఆ.వె.

ఎవరి కడవ వారు యేరీతి మోస్తిరో
ఆలి, తల్లి, వదినె, అక్క, చెల్లి!
బరువు బాధ్యతలను పంచుకొందు రట్లె/
పోల్చవలదు సుమ్ము పురుషులార!


ప్రేమ


ఆటవెలది:

ప్రేమకలిగియుంట పిచ్చియౌ నిక దాని
చూపబూనుటన్న పాప మింక
తిరిగి పొందగోరు తిమ్మిరి నీకేల
ప్రేమ విడువు మింక ప్రీతి నొంద!

- 8.02.2018

చెన్నై లేటునైటు కబుర్లు

25th డిసెంబరు 2017

నిన్న రాత్రి మాఆవిడ, సుమన, వందన, జ్యోతిర్మయిగారూ... వీళ్ళందరూ ఏవో మాట్లాడుకుంటూ రెండున్నర దాటేవరకూ ఉండిపోయారు. పొద్దున్న నేను ఈ పద్యం వ్రాసాను.

ఆ.వె.
లేటు నైటువరకు లేచియుండిరిగదా
అంత ముఖ్యమైన దెంత పనియొ..!!
బ్రష్షు చేయమనిన బద్దకము పడుచు
లేపు చుండనెంత లేవరైరి..!

చెన్నై సంగీతోత్సవాలు

ఆటవెలది:

చెన్నపట్నమందు చెవులకు నింపుగా
సుస్వరములుపొంగి సుధలు పంచ
గాత్ర జంత్ర వాద్య గాన మధురిమల
పులకరించె శ్రోత ముదము మీర

ఆది శంకరులు

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః౹
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా౹౹ 

(కూర్మపురాణం నుండి).

ఆ.వె.

సక్రమముగ చేసి శ్రౌతము స్మార్తమున్
వైదికమ్ము నిలుప భరత భూమి
నీలలోహితుండు కాలడి గ్రామంబు
నాది శంకరునిగ నవతరించె!

- రాధేశ్యామ్ రుద్రావఝల



భోగి, సంక్రాంతి, కనుమ

ముత్యాలసరము.

భోగిమంటల వెచ్చదనమున్
సంకురాతిరి సంబరములన్
కనుమ వంటల కడుపు నిండెన్
పెద్ద పండుగలో!

చందమామ

శార్దూలము.
రాకాచంద్రుని వెన్నెలల్ జగతి కారాధ్యంబు లింపారగా/
నాకాశంబున నిన్నుజూడ మది నాహ్లాదంబు పెంపారగా/
నీకై వేచిన కల్వ భామినుల సాన్నిధ్యమ్ము సొంపారగా/
నేకాంతంబునుగోరు జంటలకు నీవేకైక మిత్రుండవై..!

శివుడు..!!

ఆ.వె.
గంగ యనిన నీకు జంగమ కడు ప్రీతి
సిద్ధమీవు మరొక యుద్ధరణికి
నీదు శిరము తనకు నెలవు జేసినగాని
తనివి తీరకున్నదా త్రినేత్ర ?


కందము:
కోరడు క్రతువుల తపముల
చారెడు భస్మమును పూయ సంతసమందున్!
మారేడుదళమ దొక్కటి
పారగ నభిషేక జలము పైనిడ చాలున్!

రామకృష్ణ పరమహంస

ఆ.వె.

వట్టి రాయి కాదు బంగరు తల్లియే
ననగ కాళి గొలిచి యార్తి పిలిచి
తనదు చేతి బువ్వ తినిపించె నాయోగి
పరమహంసగాను పరగ నిలిచె!

ఆ.వె.

వట్టి రాయి కాదు బంగరు తల్లియే
ననగ కాళి గొలిచి యార్తి పిలువ
తనదు చేతి బువ్వ తినగ రామకృష్ణ
పరమహంసగాను పరగ నిలిచె!

5, మార్చి 2018, సోమవారం

భూమాతపై పద్యములు

తే.గీ.
సస్యమనుపేర యేతల్లి స్తన్య మిచ్చు?
నడుగకనె సంపదల నిచ్చు యమ్మ యెవరు?
ఓరిమికి జనని యెవరు  మారుపేరు ?
కొలుతునా మాత భూదేవి కూర్మి మీర!!

కం.
పుట్టగ పెరుగగ బ్రతుకగ
గిట్టగ నీ వొడిని జేసి క్రీడా స్థలిగా
కట్టడి మీఱుచు, నీగతి
పట్టని నీ సుతుల నేల పాలించెదవో!

తే.గీ.
సవతి శ్రీదేవి తాను చంచల యగుటను
నీవె యుండుటచేతను నిశ్చలముగ
అవతరించెను నీనాధు డన్నిమార్లు
పుడమి, నీపైని ప్రేమతో, పుణ్య చరిత!

ఇది నా పద్యాల బ్లాగు

5.3.18

నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకుగాను ఉద్దేశించిన బ్లాగు ఇది..! నా పద్య రచన

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు