25, నవంబర్ 2026, బుధవారం

పిసినారి విందు


పిసినారి విందు
---------------------------------

తే. గీ.

పిల్లి కైనను బిచ్చము పెట్టనట్టి
పరమ పిసినారి కలడొక పల్లెలోన
ధనియె గాని యౌదార్యంపు ధనము లేదు
చేయి విదిలించి దానము చేయబోడు.

పదుల వందలు చేయగా ప్రతిన బూని
వేల లక్షలు కోట్లుగా పెంచు గాని
యొక్కనాడైన దమ్మిడీ రొక్క మిచ్చి
పేదలకు తిండి పెట్టడా పిసిని గొట్టు!

పిల్లపాపలు లేరంచు తల్లడిల్లు
నతని భార్యకు నా చింత యధికమయ్యె
పూజలెన్నొ చేసిన యట్టి పుణ్యవతికి
కడుపు పండెను, పండంటి కొడుకు పుట్టె!

అట్టి సంతోష సమయంపు టదను జూచి
యూరి జనులెల్ల పోటెత్తి పోరుపెట్టి
యిప్పు డెటు పోదు? చూచెద మేమటంచు
విందు సేయగ బలవంత పెట్టి రతని!

ఖర్చు కనిపించి యాతని కనులముందు
దిమ్మదిరుఁగగ కను గ్రుడ్లు తేలవేసి
విందు నెగవేయు మార్గము వెదుక నెంచి
వింత పథకము తలచె హృదంతరమున!

శాంతుడై తానె పిలిచెను స్వయముగాను
గ్రామవాసుల నెల్లర రండటంచు
విందుకేతెంచి కొడుకు దీవించి, మించి
గైకొనుడనెను తానిచ్చు కానుకలను

"ఎన్నడు మరొకరికి పెట్ట నెరుగనట్టి
పిసిని యీనాడు పిలిచెను వేడ్క జేయ
నెట్లు సేయు? నే మిచ్చు? ని దెంత వింత?"
యనుచు తరలి వచ్చిరి యూరి జనులెగబడి!

ఆ. వె.
వారి కలియజూచి కూరుచుండగజేసి
గొంతును సవరించి కొనుచు పిసిని
పలికె నిట్లు: తిన్న వారికి తిన్నన్ని
లడ్లు, రూక లిత్తు లడ్డు కొకటి!

ఇది వినంగ నతిథు లెగిరి గంతులువైచి
తీయనైన లడ్లు తినగబోగ
సావధానమనుచు షరతుల నాతడు
తెలియ పరిచె ప్రజకు దీమసమున!

తే. గీ.
వంచకుండగ మోచేయి, కంచమునకు
మూతి చేర్చక లడ్డుల నేతి ముంచి
తినగ వలెనంచు షరతుల తీరు జెప్ప
సంభ్రమాశ్చర్య చకితులై జనులడగిరి!

ఆ. వె.
"ఎంత గడుసు పిండమీ రీతి మనలను
పిలిచి బువ్వకు నతితెలివితోడ
సాధ్యపడని విందు షరతు లుంచె; నితడు
వట్టి పిసిని" యనుచు తిట్టు కొనిరి!

తే. గీ.
అటుల తబ్బిబ్బు పడునట్టి యతిథి గణము
గాంచి ప్రమదించు లుబ్ధుండు కంగు తినగ
నొక యుపాయశాలి వివేకి యుక్తి చేసి
చెప్పె తనప్రక్కవానికి చెవులు కొరికి

ఆ. వె.
అంద రొకరికొకరు పందెంపు కిటుకును
గుసగుసల వినిచిరి గుమురుకొనుచు!
లోన నవ్వుకొనుచు లోభి యా వితతిని
తినుడు తినుడటంచు తీవరించె!

తే. గీ.
వంచకుండగ మోచేయి, కంచమునకు
మూతి చేర్చక లడ్డుల ముదము మీర
నెదురు బొదురుగ కూర్చుండి రిద్ద రిద్ద
రొకరి కొక్కరు తినిపించి యూరి జనులు
రూక లార్జింప దొడగిరి వీక తోడ!

ఆ. వె.
తాడి తన్ను వాని తలదన్ను వాడుండు
చందమున నతిథులు చతుర మతులు
వక్రబుద్ధి కలిగి పండుగ జరిపించు
గడుసు పిసిని యాట కట్టి రంత!

తే. గీ.  
తాను తీసిన గోతిలో తానె పడెను
పిసినిగొట్టు; వాని తెలివి బెడిసికొట్టె!
గొల్లుమని యేడ్చె ఖర్చుకు గుండె లదర
లెంపలను వేసికొని వీడె లేకి బుద్ధి!

----------------------------
రాధేశ్యామ్ రుద్రావఝల
24.11.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు