5, జనవరి 2020, ఆదివారం

పుస్తకము


 
కం.
పుస్తకము గురువు జనులకు/
పుస్తక పఠనమ్ము పెంచు బుద్ధి కుశలతన్/
పుస్తకము మంచి మిత్రుడు/
పుస్తకమే తోడు మనకు ముదమున చదువన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
06.01.2020

30, డిసెంబర్ 2019, సోమవారం

మధ్యాక్కఱలో మొదటి ప్రయత్నము

ఇది 'మధ్యాక్కఱ' ఛందస్సులో నా మొదటి ప్రయత్నము:


మధ్యాక్కఱ:
నామనవి వినంగ నీకు నామోషి యాయెనా!? చెలియ,
ప్రేమ పొంగగ నీపయి, మది రేగె నేవో కోర్కె, లింక
కామితార్థము నీయగాను కనికరింపవుగదే సఖియ
నామనసును తెలిసికొని నాప్రాణము నిలుపు! సత్య
భామా! యలుకలు చాలు ననె వాసుదేవుడు కృష్ణు డపుడు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
30.12.2019
ఫొటో కర్టెసీ: శ్రీకృష్ణపాండవీయం సినిమా





20, డిసెంబర్ 2019, శుక్రవారం

హరితకలితము..!

Photo Courtecy - Sandhya Rudravajhala
ఆటవెలది:
చిక్కిశల్యమైన స్నేహితుని కనగ/
మనసు వికల మాయె మగువ లతకు!
హరిత సంపదతని దావిరై పోవగా/
కౌగలించి తనదు కలిమి పంచె!! 

- రాధేశ్యామ్ రుద్రావఝల


28.05.2018 న వ్రాసిన పద్యం ఇది.


5, డిసెంబర్ 2019, గురువారం

వచన కవిత..!!

వచన కవిత:
--------------

వరదలా
జీవనదిలా
పెను గంగలా

రస ప్రవాహంలా
అలుపెరగని జలపాతంలా
ముసురు పట్టి ఆగని వర్షంలా
చిల్లుకుండలా
విరిగిన కొళాయిలా
ఊర్వశి శారద కన్నీటిలా
వడిగా
ఆగకుండగా
ధారాపాతంగా
......
...........
...............
నా 
ముక్కు 
కారిపోతోంది..!!

******

ముత్యాలసరము:
కనుల యెర్రని జీరలొచ్చెను/
బుగ్గలవియె గులాబులాయెను/
పెదవులన్ చిరు వణుకు బుట్టెను/
నాకు జ్వరమొచ్చెన్..!!
***********
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను మరియిక/
చయ్యన నికనైన మరలు సౌండిక లేకన్..!!
***********

సవరణలతో:
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను చివరకు/
చయ్యన నికనైన మరలు సౌండది లేకన్..!!
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను చివరకు/
చయ్యన నికనైన మరలు చప్పుడు లేకన్..!!

26, నవంబర్ 2019, మంగళవారం

సీతాకోకచిలుక


 










సీతాకోకచిలుక
******
ముత్యాలసరము:
1.        రంగుచీరలు కట్టికట్టీ
మొహం మొత్తీ మార్పుకోరీ
నలుపు తెలుపుల కోక నేడే
కట్టుకున్నావా!?

2.        ఎన్ని రంగులు! యెన్ని హంగులు!
ఎంత అందం? ఏమి చందం?
ఎక్కడిది నీకా వయారం,
అంత సుకుమారం!?

3.        పురువుగా నువు పడిన కష్టం
ఒంటిగా నుండేటి వైనం
సుందరిగ ఈ నీ ప్రయాణం
మాటకందేనా?

4.        ఓర్చినమ్మకి తేటనీరట
కష్టముల కెదురీది నేడీ
అందమైనటు వంటి రూపం
సంతరించావా!!??

5.        నీకు నీ ఓపికకు జోహార్
అనుచు దైవం  పూలమధ్యన
తేనెనే త్రాగుచును కడుపును
నింపుకొనమనెనా?

6.        చీదరించిన వెగటు లోకం
నేటి నీ ఈ రూపుజూసీ
అబ్బురం పడిపోతు ఉంటే
నవ్వు రాలేదా..??

7.        ఈసడింపుల చీదరింపుల
మనసులోనవి పెట్టుకొనకా
పువ్వు రంగుల మాకు నవ్వుల
పంచుతున్నావా!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు